నువ్వింకా పురుగుల మందు తాగలేదా.. రైతు పట్ల దురుసు ప్రవర్తన.. ఎమ్మార్వోపై వేటు.!
Publish Date:Oct 11, 2026
Advertisement
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వ్యవసాయ భూమికి సంబంధించిన ఒక వివాదంపై న్యాయం కోరుతూ కార్యాలయానికి వచ్చిన ఒక సాధారణ రైతు పట్ల ఎమ్మార్వో వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. తన సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్న అన్నదాతకు అండగా నిలవాల్సిన ఒక బాధ్యతాయుతమైన ఉన్నతాధికారి, అత్యంత అమానుషంగా ప్రవర్తించడం పట్ల ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. మక్త మసన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు ఏసు తన భూ సమస్యను వివరిస్తూ కార్యాలయానికి రాగా, సదరు తహసీల్దార్ స్వామి ఆయన పట్ల తీవ్ర దురుసుగా ప్రవర్తించారు. సమస్యను పరిష్కరించడానికి బదులుగా, "నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా.. ఇంకా బతికే ఉన్నావా?" అంటూ ఆ రైతును అత్యంత హేయంగా ప్రశ్నించడం కలకలం రేపింది. ఒక అన్నదాత తన కష్టాలను చెప్పుకుంటూ కంటతడి పెట్టుకుంటుంటే, దాన్ని చూసి పకపకా నవ్వడమే కాకుండా, "అవును.. నాకు నవ్వు వస్తుంది, బరాబర్ వస్తది" అంటూ బాధ్యతారహితంగా సమాధానం ఇవ్వడం ఆ అధికారిక పదవికి ఉన్న పవిత్రతను మంటగలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడంతో ప్రజలు, నెటిజన్లు ఆ తహసీల్దార్ అహంకారపూరిత వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల ఇంతటి దారుణమైన ధోరణి ప్రదర్శించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రాజకీయ ప్రముఖులు సైతం తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, తోటి మనిషి ప్రాణాలను కించపరిచేలా మాట్లాడిన ఆ అధికారి మానసిక స్థితిపై మండిపడ్డారు. రైతుల కష్టాలను పరిష్కరించాల్సిన స్థానంలో ఉండి వారిని మానసికంగా కుంగదీసేలా మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొంటూ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే ఒక ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఆ నివేదికలో ఎమ్మార్వో ప్రవర్తన ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు, నైతికతకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా తేలింది. దీనితో ఉన్నతాధికారులు ఎలాంటి తర్జనభర్జనలకు తావులేకుండా సదరు తహసీల్దార్ స్వామిని సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, తదుపరి అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ దాటి వెళ్లకూడదని ఉత్తర్వులలో స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో అధికారులు ఎంతటి బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, మానవతా దృక్పథంతో మెనగాలనేదానికి ఈ ఉదంతం ఒక పెద్ద హెచ్చరికగా నిలిచింది. ప్రజాస్వామ్యంలో ప్రజల సేవకులుగా ఉండాల్సిన అధికారులు అహంకారంతో ప్రవర్తిస్తే చట్టం ముందు ఎంతటి వారైనా శిక్ష తప్పదనే వార్త మరోసారి రుజువైంది. [ Gajwel MRO suspended, Siddipet district, Tahsildar Swamy, farmer humiliation, Collector Haimavathi, Telangana news, CM Revanth reddy, Farmer Yesu, Telangana Revenue Department, Minister Ponguleti Srinivasa Reddy, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/gajwel-mro-suspended-25-234042.html





