సర్వే పేరుతో వైసీపీ ఓట్ల తొలగింపు
Publish Date:Jan 25, 2019
Advertisement
వైకాపా నేతలు సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లాలో సర్వేల పేరుతో వైకాపా ఓట్లు తొలగిస్తున్నారని, సర్వేలకు ఉపయోగించిన ట్యాబ్‌లను ఆయనకు చూపించారు. తెదేపా అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని బొత్ససత్యనారాయణ తెలిపారు. ఓటర్ల జాబితాను ట్యాబ్‌లలో అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సర్వేల పేరుతో వైకాపా సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. అనంతరం వైకాపా నేతలు రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు కూడా ఫిర్యాదు చేశారు. ట్యాబులతో వచ్చి ఓట్ల తొలగింపు చర్యల వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ వద్దనున్న ట్యాబులను వైసీపీ బృందం డీజీపీకి అందించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను డీజీపీకి వివరించామని బొత్స తెలిపారు. అక్రమ అరెస్ట్ లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. తమ వద్ద ఉన్న ట్యాబులను డీజీపీ అందించమని బొత్స పేర్కొన్నారు. స్థానిక పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారన్న విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అసలు జరిగింది ఏంటంటే...విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో కొందరు పీపుల్స్ సర్వే సంస్థ పేరుతో ఓటర్ల సర్వే చేస్తుండగా వైకాపా నాయకులు పట్టుకున్నారు. వైకాపాకు చెందిన ఓటర్ల పేర్లను తొలగించేందుకే సర్వే చేస్తున్నారని సంస్థ ప్రతినిధులపై దాడికి దిగారు. వారి నుంచి ట్యాబ్‌లు లాక్కున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం వారిని పోలీసులు వదిలేశారు. అయితే, ట్యాబ్‌లు వైకాపా నాయకులు స్వాధీనం చేసుకున్నారని, వాటిని తిరిగి ఇవ్వాలని వారు పట్టుబట్టారు. ఈ విషయంలో విజయనగరం జిల్లా వైకాపా సమన్వయకర్త,బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ప్రధాన పాత్ర వహించటంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు జామి పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. సర్వే పేరుతో ప్రభుత్వం వైసీపీ ఓట్లు తొలగించేందుకు ఈ కుట్రలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వైకాపా నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని, డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
http://www.teluguone.com/news/content/ycp-leaders-complaint-to-ec-and-dgp-over-voter-survey-in-vizianagaram-dist-39-85516.html





