జగన్ పీఏ పర్సనల్....ఏపీలో బెదిరింపుల కలకలం
Publish Date:Jul 9, 2019
Advertisement
జగన్ పీఏ పేరు చెప్పి వైసీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి బెదిరించడం కలకలం రేపుతోంది. ఇది నిజంగా జగన్ పీఏ చేస్తున్న పనేనా లేక మరేమిటో అర్ధం కావడం లేదు. సీఎం పీఏ పర్సనల్ వ్యవహారం అని చెబుతుండడంతో ఏమి చేయాలో పాలుపోని ఆ కుటుంబం ఇప్పుడు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లా ముక్తేశ్వరంకి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబంతో కలిసి గుంటూరు మండలం లాల్‌పురంలో కొంతకాలంగా ఉంటున్నారు. గతంలో అపరాల వ్యాపారం చేసిన సమయంలో తన గ్రామానికి చెందిన ప్రస్తుతం వైసీపీ కార్యాలయం ఐటీ విభాగంలో పనిచేస్తున్న మహేంద్రరెడ్డి నుంచి గతంలో రూ. 15 లక్షలు 4 రూపాయల వడ్డీకి అప్పుగా తీసుకున్నారు. అందుకోసం నెలకు రూ. 60వేలు చప్పున వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. అయితే ఇప్పటికే అసలు వడ్డీ కలిపి 28 లక్షల వరకు చెల్లించారు. అప్పు తీసుకున్న సమయంలో మూడు చెక్కులు, 19 ప్రామిసరి నోట్లు మహేంద్రరెడ్డి రాయించుకొన్నారు. ఇక ఇచ్చుకోలేనని వెంకటేశ్వర్లు చెప్పడంతో రెండు చెక్కులను రూ. 5 లక్షలకు వేరేవారి పేరుతో బ్యాంకులో వేసి అవి బౌన్స్ అయ్యాయని కోర్టులో కేసు వేశారు. అయితే వ్యాపారంలో నష్టం రావడంతో వెంకటేశ్వర్లు ప్రస్తుతం కారు డ్రైవర్ గా పని చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మహేంద్రరెడ్డి తనతో కలిసి పనిచేస్తున్న శంకర్‌రెడ్డి, చెన్నూరి చిన సుబ్బారావు, ఇప్పల నర్సిరెడ్డితో కలిసి కార్లలో ఆయనింటికి వచ్చి దాడి చేశారు. ఆ తర్వాత కొద్దిరోజుల క్రితం వెంకటేశ్వర్లుకు ఓ వ్యక్తికి ఫోన్ చేసి, సీఏం గన్‌మెన్‌గా పరిచయం చేసుకొన్నాడు. మహేంద్రరెడ్డికి ఇవ్వాల్సిన డబ్బు మొత్తం వడ్డీతో చెల్లించాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక మొన్నీమధ్య వెంకటేశ్వర్లు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రామాంజనేయులు అనే వ్యక్తి ఫోన్ చేసి ఈ వ్యవహారం జగన్ పీఏ పర్సనల్ వ్యవహారం అని, తక్షణం డబ్బులు ఇవ్వాలని, లేదంటే గుంటూరులోని వైసీపీ కార్యాలయానికి రావాలని హెచ్చరించాడు. లేదా విజయవాడ చిన్నారి వైష్ణవి తరహాలోనే నీ కూతుర్ని కూడా కిడ్నాప్ చేసి బాయిలర్ లో వేస్తామని బెదిరించాడు. అయితే ఇప్పటికే మహేంద్రరెడ్డి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడనే భయంతో నిజంగా అన్నంత పనీ చేస్తాడేమో అని ఎస్పీని కలిసి మోర పెట్టుకున్నారు బాదితులు.
http://www.teluguone.com/news/content/ycp-it-cell-worker-threatens-family-for-his-loan-recovery-39-87912.html





