జగన్ సర్కార్ కు ఇక చుక్కలే..!
Publish Date:Jul 19, 2022
Advertisement
ఇక ఏపీలో జగన్ సర్కార్ కు కేంద్రంలోని మోడీ సర్కార్ చుక్కులు చూపించనుందా? జగన్ కు గతంలోలా పీఎంతో భేటీలకు అప్పాయింట్ మెంట్ అంత సులువుగా దొరకదా? అన్న ప్రశ్నలకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం రాక మానదు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వైసీపీ అవసరం ఎంతో ఉందని భావించిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఆ పబ్బం గడుపుకునేందుకు జగన్ ను ఆ ఒక్కటి దక్క (ప్రత్యేక హోదా) ఏ వరం కోరుకున్నా ఇచ్చేస్తానని హామీ ఇచ్చింది. పాపం జగన్ గారికి ప్రత్యేక హోదా అడుగుదామన్న యోచనే లేదు. అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఏం కోరడానికి ఆయన ఈ మూడేళ్లలో ఎన్నడూ కనీసం ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఎంత సేపూ నవరత్నాలకు డబ్బులెలా? అప్పులెలా? అన్న యోచనతోనే కాలం గడిపే పరిస్థితాయె. సరే తీరా రాష్ట్ర పతి ఎన్నిక సమయం దగ్గర పడే సరికి మహారాష్ట్ర పరిణామాలూ, అనూహ్యంగా విపక్షాల నుంచి ముర్ము అభ్యర్థిత్వానికి వచ్చిన సానుకూల స్పందనతో బీజేపీకి వైసీపీ అవసరం అంతాగా అవసరంలేని పరిస్థితి వచ్చింది. అందుకే ముర్ము అభ్యర్థిత్వానికి తాము వైసీపీ మద్దతు కోరలేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కుండబద్దలు కొట్టేశారు. ఏ రకంగా చూసినా వైసీపీ తమకు అంటరాని పార్టీయేనని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు రాష్ట్రపతి ఎన్నికకు ముందు సంచలనం సృష్టించాయి. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్రపతి ఎన్నికకు ముందు అనవసర రాద్ధాంతం ఎందుకు అనుకున్న బీజేపీ అగ్రనాయకత్వం వైసీపీ మద్దతు కోరామనీ, సత్యకుమార్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమనీ ఓ ప్రకటన చేసి ఊరుకుంది. అయితే అక్కడితో కథ ముగియలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీ తన అసలు ఉద్దేశమేమిటో ఎటువంటి భేషజాలూ లేకుండా వెల్లడించేసింది. ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థికి జగన్ మద్దతు ప్రకటించారు. బీజేపీ ఆయనను మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిందా లేదా అన్నది పక్కన పెడితే ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి వైసీపీకి ఆహ్వానం అందలేదు. దీనిని బట్టే ముందు ముందు వైసీపీ విషయంలో బీజేపీ తీరు ఎలా ఉండబోతున్నదన్నది అవగతమైపోతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ వైసీపీని ఇక లెక్కలోకి తీసుకునే అవకాశమే లేదంటున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వైసీపీకి జరిగిన మర్యాదే ఈ విషయాన్ని తేటతెల్లం చేసిందని చెబుతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కడ్ నామినేషన్‌లో ప్రధాని, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు పాల్గొన్నాయి. కానీ వైసీపీ ఎంపీల జాడ మాత్రం కనిపించలేదు. ఎందుకంటే వారికి ఆహ్వానం రాలేదు. మద్దతు ప్రకటించినా ఎందుకు ఆహ్వానం అందలేదన్న ప్రశ్నకు సమాధానం దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. ఏది ఏమైనా ఇంత కాలం కేంద్రాన్ని వైసీపీ కోరినవన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధం లేని వ్యక్తిగత విషయాలేననీ, అందుకే ఇక ఆ పార్టీని సాధ్యమైనంత దూరం పెట్టాలనీ బీజేపీ అధిష్ఠానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసిందంటున్నారు. వాస్తవానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ బీజేపీకి వైసీపీ అంటరాని పార్టీ అన్న వ్యాఖ్య చేయడానికి బీజేపీ అధిష్ఠానం నిర్ణయమే కారణమని కూడా పరిశీలకులు అంటున్నారు. ఇందుకు నిదర్శనంగా మంగళవారం హస్తినలో జరిగిన అఖిలపక్ష భేటీని వారు ఉదాహరణగా చెబుతున్నారు. శ్రీలంక సంక్షోభంపై చర్చించడానికి నిర్వహించిన ఆ భేటీలో రాష్ట్రాల అడ్డగోలు అప్పులపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం తీరును టీఆర్ఎస్ ఖండించగలిగింది కానీ.. వైసీపీ కిమ్మనలేని పరిస్థితిలో పడింది. వాస్తవానికి మంగళవారం నాటి అఖిల పక్ష భేటీలో అప్పులపై కేంద్రం చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లక్ష్యం రెండు తెలుగు రాష్ట్రాలే అనడంలో సందేహం లేదు. పేరుకు పది రాష్ట్రాలలో అప్పులు ప్రమాదకర స్థాయికి చేరాయని కేంద్రం పేర్కొన్నా.. కేంద్రం దృష్టి మాత్రం ఏపీ, తెలంగాణపైనే ఉందన్నది సుస్పష్టం. తెలంగాణ పేరును ప్రస్తావించడంపై తెరాస ఎంపీలు మండి పడ్డారు. కేంద్రం అప్పుల మాటేమిటని నిలదీశారు. అదే సమయంలో వైసీపీ మాత్రం ఆమోదయోగ్యం కాని మౌనం పాటించింది. కేంద్రం టార్గెట్ చేసిందని స్పష్టమౌతున్నా కనీస స్పందన కూడా కరవైంది. అడ్డగోలు అప్పులకు ఇంత కాలం అంతే అడ్డగోలుగా అనుమతులిస్తూ వైసీపీకి ఫేవర్ చేసిన కేంద్రం ఇప్పుడు ఒక్క సారిగా జగన్ పార్టీని కార్నర్ చేయడంలోనే ఆ పార్టీ పట్ల ముందు ముందు కేంద్రం వైఖరి ఎలా ఉండబోతోందో అవగతమైందని పరిశీలకులు విశ్లేషిన్తున్నారు. ఇక ముందు వైసీపీకి అప్పలు పుట్టడం గతంలోలా కేక్ వాక్ గా ఉండదని అంటున్నారు. బటన్ నొక్కాలంటే జగన్ ఇక వంద సార్లు ఆలోచించాల్సిందేనంటున్నారు. ఇప్పటికే సంక్షేమంలో కోతపై జనంలో తీవ్ర నిరసన వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఇక వైసీపీ సర్కార్ కు ప్రతి రోజూ గండంగానే గడుస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/ycp-government-in-deep-trouble---25-140127.html





