‘జగన్’మాతను మరచిపోయారా?
Publish Date:May 4, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను ఫ్యాన్ పార్టీలోని నేతలే మరిచిపోయారా? అంటే ఆ పార్టీలోని ఓ వర్గం నుంచి అవుననే సమాధానం వస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైయస్ విజయమ్మతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇరువురు మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో మంత్రి కావాలనుకున్న నీ ఆశయం.. ఎలాగైనా సాధించావంటూ ఈ సందర్బంగా ఆర్కే రోజాను వైయస్ విజయమ్మ భుజం తట్టి మరీ అభినందించినట్లు సమాచారం. అలాగే వైయస్ విజయమ్మను కూడా ఆర్కే రోజా.. తన మాటల పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసినట్లు సమాచారం. అయితే విజయమ్మను మంత్రి రోజా కలవడం సరే... మిగిలిన మంత్రులంతా ఏమయ్యారని సదరు వర్గంలోని వారు ప్రశ్నించుకొంటున్నారట. ఓ రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది.. ఈ నేపథ్యంలో విజయమ్మ అధికార పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. అలాంటి ఆమెను జస్ట్ ఓ కర్టసీగా కలిస్తే ఏమవుతోందనే ఓ చర్చ అయితే వారి మధ్య హాట్ హట్‌గా నడుస్తోందట. గౌరవాధ్యక్షురాలిగా ఆమెకు గౌరవం ఇవ్వకుంటే.. పోని ఓ మహానేత భార్యగా ఆమెకు ఇప్పటికి ఓ గౌరవం అయితే అలాగే ఫిక్స్ అయి ఉంది. ఆ గౌరవాన్ని ఆ పార్టీలోని వారే తుంగలోకి తొక్కితే ఎలా అనే ప్రశ్న సదరు వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారట. పోని జగన్ కేబినెట్‌లో కొనసాగుతోన్న బొత్స, ధర్మానలు సైతం నాడు మహానేత కేబినెట్‌లో ఉన్నారు.. వీళ్లు కూడా ఆమెను కలవకపోవడం ఏమిటనే సదరు వర్గం సందేహం వ్యక్తం చేస్తోంది. అయితే మంత్రులుగా వీరంతా మహా బిజీ బిజీగా ఉన్నారనుకుందాం.. కానీ వీరంతా మంత్రులు కాగానే వీరిలో చాలా మంది విశాఖ శారదా పీఠానికి క్యూ కట్టి.. మరీ ఆ మఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామిని కలిసి.. ఆయనకు సాస్టాంగ నమస్కారాలే కాదు.. ఫలం, పుష్పం, తొయం అంటూ అన్ని సమర్పించేశారన్న విషయం అటు మీడియాలోనే కాదు ఇటు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ స్వామిలోరి విలువ అంత కూడా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేయలేదా? అనే సందేహాలు అయితే పార్టీలోని వారిలోనే కాదు.. ప్రజల్లో సైతం వ్యక్తమవుతోంది. పోని వైయస్ విజయమ్మను కలిస్తే... తమ పార్టీ అధినేత, సీఎం జగన్ ఫీలవుతారనే ఓ భావన ఈ కేబినెట్ మంత్రుల్లో ఉందేమోననే ఓ చర్చ కూడా సదరు వర్గంలో మహా రంజుగా నడుస్తోంది. గతంలో సీఎం వైయస్ జగన్ సమీప బంధువు... తాజాగా మాజీ అయిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి.. పాదయాత్ర చేపట్టిన వైయస్ షర్మిలను కలిశారు. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి రావడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పక్కన పెట్టారని సమాచారం. ఆ క్రమంలోనే ఆయన తాజా కేబినెట్‌లో ఆయన మంత్రి పదవికి దూరమయ్యారనే ఓ చర్చ కూడా ఉంది. మరోవైపు తాను జగన్ బంధువు కావడం వల్లే మంత్రి పదవి దక్కలేదంటూ బాలినేని స్వయంగా మీడియా ముందు పేర్కొనడం గమనార్హం. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిస్తే.. తమకు కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పట్టిన గతే పడుతుందనే ఓ విధమైన భయాందోళనలో సదరు మంత్రులకు ఉందని అందుకే... వారు ఆమెను కలవడం లేదనే ఓ చర్చ అయితే ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గంలో యమ జోరు జోరుగా నడుస్తోంది.
http://www.teluguone.com/news/content/ycp-forgort-jagans-mother-25-135435.html





