రాహుల్ పై జగన్ వ్యాఖ్యలు.. షర్మిల రియాక్షన్ తట్టుకోలేమంటూ వైసీపీ బెంబేలు
Publish Date:Aug 14, 2025
Advertisement
పులివెందుల ఓటమి జగన్ ప్రతిష్టను పాతాళానికి పడిపోయేలా చేసిందన్న మాటలు వైసీపీ వర్గాల నుంచే వినపిస్తున్నాయి. అయితే ఆ పాతాళం కంటే ఆయన ప్రతిష్ఠ దిగజారిపోయే పరిస్థితి ముందుందని అంటున్నారు. పులివెందుల ఓటమిని ముందుగానే అంచనా వేసిన జగన్.. ఆ ఓటమికి అధికార తెలుగుదేశం అధికార దుర్వినియోగమే కారణమని ఆరోపణలు కౌంటింగ్ కు ముందు రోజే గుప్పించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగి ఉంటే పాపం కొంచం ఆబోరైనా దక్కేదేమో.. కానీ జగన్ ఈ వ్యవహారంలోకి రాహుల్ గాంధీని లాగారు. ఓట్ చోరీ అంటూ హంగామా చేస్తున్న ఆయనకు ఏపీలో జరిగిన ఎన్నికల అక్రమాలు కనిపించలేదా? అని ప్రశ్నించడమే కాకుండా, ఏపీ వ్యవహారంపై ఆయన మాట్లాడకపోవడానికి చంద్రబాబుతో నిత్యం హాట్ లైన్ లో టచ్ లో ఉండటమే అందుకు కారణమని ఆరోపించారు. జగన్ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీయులను గాభరా పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ కు సొంత చెల్లి అయిన షర్మిల జగన్ వ్యాఖ్యలకు రియార్ట్ అయితే తమ పరిస్థితి, జగన్ పరిస్థితి ఏమిటని బెంబేలెత్తిపోతున్నారు. జగన్ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ మామూలుగా ఉండదనీ, ఆమె సంధించే ప్రశ్నలు, చేసే విమర్శలతో జగన్ కు దిమ్మతిరిగి బొమ్మకనబడటం ఖాయమన్న మాటలు వైసీపీ నుంచే వినవస్తున్నాయి. ఇటు బీజేపీ ఎన్డీయే లో భాగంగా ఉంటూ మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో బాబు హాట్ లైన్ లో ఉన్నారు అంటూ పులివెందుల పంచాయితీలోకి రాహుల్ లాగడం ద్వారా జగన్ తన చెల్లి షర్మిలను రెచ్చగొట్టారని అంటున్నారు. ఇక ఇప్పుడు షర్మిల నోరు విప్పితే..పులివెందుల ఓటమితో బీటలు మాత్రమే వారిన జగన్ కోట బద్దలైపోవడం ఖాయమని అంటున్నారు. పులివెందుల పంచాయతీలోకి రాహుల్ ను లాగి జగన్ కొరివితో తలగోక్కున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.
http://www.teluguone.com/news/content/ycp-fear-about-sharmila-reaction-on-jagan-hotline-comments-39-204206.html





