విశాఖలో వైసీపీ ఖాళీ!
Publish Date:Jul 22, 2024

Advertisement
విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. విశాఖ రాజధాని అంటూ ఐదేళ్ల పాటు జగన్ ఆడిన డ్రామాకు విశాఖ ప్రజలు తెర దించేశారు. విశాఖ అభివృద్ధిని భూ స్థాపితం చేసి భూదందాల కోసం రాజధాని అంటూ మభ్యపెట్టేందుకు జగన్ చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేశారు.
విశాఖ పరిధిలో మొత్తం ఓట్లలో 70 శాతం వరకూ కూటమి అభ్యర్థులకే పడ్డాయంటే వైసీపీని ప్రజలు ఎలా తిరస్కరించారో అర్థమవుతుంది. అందుకే తమ రాజకీయ భవిష్యత్ ను చూసుకుంటూ.. వైసీపీ కార్పొరేటర్లుఇతర పార్టీలకు వెళ్లిపోతున్నారు. వారు వెళ్లిపోతున్నా ఆపేందుకు వైసీపీ కీలక నేతలు కనీసం ప్రయత్నించడం లేదు. సరే సార్వత్రిక ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో విశాఖ ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన జగన్ పార్టీ ఇప్పుడు విశాఖ కార్పొరేషన్ లోనూ ఖాళీ అయిపోతుంటే చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతోంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పెద్ద ఎత్తున విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం, జనసేన పార్టీల్లోకి క్యూకట్టారు. ఇప్పుడు తాజాగా మరికొందరు తెలుగుదేశం గూటికి చేరారు. ఔను 13 మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. మరో ఇండిపెండెంట్ కార్పొరేటరు కూడా సైకిలెక్కేశారు. మరో పది మంది కార్పొరేటర్లు జనసేన గూటికి చేరడానికి రెడీగా ఉన్నారు. ఈ పది మంది మంగళవారం (జులై 23) జనసేన కండువా కప్పుకోనున్నారు. ఈ పది మందినీ కూడా కలుపుకుంటే విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ కార్పొరేటర్ల బలం 20కి పడిపోతుంది. దీంతో విశాఖ మేయర్ రాజీనామా కోసం తెలుగుదేశం, జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం పెట్టకూడదు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఆ నిబంధనను సవరించే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఒక్క విశాఖ అనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిస్థితి ఇలాగే ఉంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వైసీపీని వీడి కూటమి పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం కూడదు అన్న నిబంధనను మార్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.
http://www.teluguone.com/news/content/ycp-empty-in-vizag-39-181206.html












