వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ మొసలి కన్నీరు!
Publish Date:Aug 20, 2025
Advertisement
కొన్ని నాటకాలు రక్తి కడతాయి. కొన్ని నాటకాలు వాస్తవాన్ని బయటపెడతాయి. ఇప్పుడు వైసీపీ పరిస్థితి విశాఖలో అదే రకంగా ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేవలం కార్మికులే కాదు, ఉత్తరాంధ్ర ప్రజలు సైతం ఆవేదనతో ఉన్నారు. ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన ఈ స్టిల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నది ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్. డిమాండ్ కూడా. అయితే ఆ సెంటిమెంటును రాజకీయంగా వాడుకోవడానికి వైసిపి తొలి దశ నుంచి ప్రయత్నిస్తోందని తాజా పరిణామాలను బట్టి స్టీల్ కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రుల హక్కు నినాదంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పుట్టింది. ప్రపంచంలోనే నాణ్యమైన స్టీల్ గా విశిష్టత గాంచింది. కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల బారిన పడింది. ప్రధానిగా వాజ్ పేయి ఉన్న సమయంలో ప్లాంటును ప్రైవేటీకరించాలన్నఅధికారుల ప్రతిపాదనను అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు. కేంద్రాన్ని ఒప్పించి బిఎఫ్ఆర్ నుంచి కాపాడారు. ఆ తర్వాత మళ్లీ దశాబ్ద కాలం తర్వాత ప్లాంట్ సంక్షోభంలో పడింది. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దీన్ని ప్రైవేటీకరించాలని ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న ఫ్యాన్ పార్టీ దీన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకించలేదు. ఒక దశలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాంట్ లో మిగులు భూమిని విక్రయించి నష్టాల నుంచి బయటపడాలని సూచించారు అయితే కార్మిక నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్ కోసం రైతులు ఇచ్చిన భూములను విక్రయించడానికి అంగీకరిం చలేదు. అయితే స్టీల్ కార్మికులు ఉత్పత్తి ఆగకుండా ఉద్యమాలు కొనసాగించడానికి సహకరిస్తామని ఫ్యాన్ పార్టీ నాయకులు ప్రకటించారు. అది నిజమేనని భావించి కార్మికులు వైసిపి వెంట నడిచారు. అయితే ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఫ్యాన్ పార్టీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదు. దీంతో ప్లాంట్ మరింత నష్టాల్లోకి కష్టాల్లోకి వెళ్ళింది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంపై ఒత్తిడి తేవడంతో 1140 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. అయితే ప్లాంట్ ను విక్రయించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ నాయకులు విమర్శలు గుప్పించారు. అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఒక్క పైసా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఆర్థిక సహాయం తీసుకురాకపోగా, కాకపోగా ఆ సమయంలో ఆ పార్టీ పరోక్షంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాలేదు. దీంతో దాదాపు నాలుగేళ్లగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తర్జనభర్జనులు కొనసాగుతూ ఉన్నాయి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాని ఈ ఫ్యాన్ పార్టీ ఇప్పుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోందని స్టీల్ కార్మికులు ఆరోపిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-crocodile-tears-over-vizag-steel-plant-25-204623.html





