జగన్‌రెడ్డికి పార్లమెంట్ టెన్షన్.. రఘురామపై వేటుకు స్కెచ్..
Publish Date:Jun 11, 2021
Advertisement
జూలైలో పార్లమెంట్ సమావేశాలు. జగన్‌రెడ్డికి ఈ వార్త కంటిమీద కునకు లేకుండా చేస్తోందని అంటున్నారు. లోక్‌సభలో బెల్ మోగగానే.. మొదట తన పేరే వినిపిస్తుందేమోననే ఆందోళన. తమ పార్టీ ఎంపీ రఘురామ.. తనను పార్లమెంట్ బోనులో దోషిగా నిలబెడతాడనే టెన్షన్. గోటితో పోతుందని అనుకొని.. రఘురామను అరెస్ట్ చేయిస్తే.. అది గొడ్డలి వేటుగా తనకే రివర్స్ అవుతుందని అస్సలు ఊహించలేకపోయారని అంటున్నారు. చేసిన తప్పుకు ఫలితం అనుభవించక తప్పనిసరి పరిస్థితులు రాబోతున్నాయని తెగ హైరానా పడుతున్నారట. పార్లమెంట్ సాక్షిగా జగన్‌ను శిక్షించాలని రఘురామ ఢిల్లీలో కాచుకు కూర్చున్నారు. కేంద్ర పెద్దలు, లోక్‌సభ స్పీకర్‌తో పాటు దేశంలోని యావత్ పార్లమెంట్ సభ్యులకు ఇప్పటికే లేఖలు రాశారు. తన కాలి గాయాల ఫోటోలను పంపి.. తనపై జరిగిన దాడిని పార్లమెంట్ మీద జరిగిన దాడిలా చూడాలని కోరారు. పలు రాష్ట్రాలు, పలు పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ఇప్పటికే రఘురామకు బహిరంగ మద్దతు పలికారు. ఇలా పావులన్నీ జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా కదులుతుండటంతో.. త్వరలో జరగబోవు పార్లమెంట్ సమావేశాల్లో తన పరువు పోవడం ఖాయమనుకున్నారో ఏమో.. అందుకే జగన్‌రెడ్డి ముందస్తుగా రఘురామపై కౌంటర్ అటాక్ మొదలుపెట్టారని అంటున్నారు. తాజాగా.. ఎంపీ రఘురామపై వేటు వేయాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది వైసీపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కె. రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే తాము ఆధారాలను లోక్ సభ స్పీకర్‌కు సమర్పించామని భరత్ రామ్ తెలిపారు. అనేక పర్యాయాలు రఘురామ డిస్ క్వాలిఫికేషన్‌కు సంబంధించి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజు పార్లమెంట్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని మరోసారి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు లోక్‌సభలో వైసీపీ చీఫ్ విప్ ఎంపీ భరత్. వైసీపీ ఎంపీలంతా కలిసికట్టుగా వెళ్లి ఫిర్యాదు చేస్తే.. రఘురామ విషయంలో తాము భయపడుతున్నామనే మెసేజ్ వస్తుందనుకున్నారో ఏమో.. ఎంపీ భరత్ ఒక్కరే సింగిల్‌గా వెళ్లి స్పీకర్‌కు కంప్లైంట్ ఇచ్చారు. సీఎం జగన్ ఢిల్లీలో ఉన్న రోజే స్పీకర్‌కు ఫిర్యాదు చేయడాన్ని బట్టి ఆయన రఘురామ విషయంలో ఎంత ఆందోళనతో ఉన్నారో అర్థం అవుతోందని అంటున్నారు. అసలు, జగన్ ఢిల్లీ వచ్చి కేంద్ర పెద్దలను కలిసిందే.. ఎంపీ రఘురామ విషయంలో వివరణ ఇచ్చుకోడానికే అనే ప్రచారమూ జరుగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి రఘురామ ఎపిసోడ్లో తమ తప్పేమీ లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. అటు, రఘురామ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పైనా అమిత్‌షాను జగన్ ప్రాధేయపడినట్టు సమాచారం. అయితే, అమిత్‌షా నుంచి ఎలాంటి హామీ లభించలేదని అంటున్నారు. అందుకే, రఘురామ వ్యవహారం పార్లమెంట్ ముందుకు వస్తే మరింత ప్రమాదమని భయపడుతున్నారట జగన్‌రెడ్డి. పక్కా ఆధారాలు, గాయాలు ఉండటంతో తనకు ఇబ్బందులు తప్పవని భావించే.. లోక్‌సభలో అడుగుపెట్టకుండా రఘురామను అడ్డుకునేందుకే స్పీకర్‌ను కలిసి అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. ఇది వృధా ప్రయత్నమని తెలిసినా.. పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయితే.. ఇక ఢిల్లీ కేంద్రంగా దేశం ముందు తాను దోషిగా నిలబడాల్సి వస్తుందనే భయంతోనే జగన్‌రెడ్డి.. రఘురామపై కౌంటర్ అటాక్‌కి ట్రై చేస్తున్నారనేది విశ్లేషకుల మాట.
http://www.teluguone.com/news/content/ycp-complaints-to-loksabha-speaker-to-disqualify-mp-raghurama-krishna-raju-39-117430.html





