వైకాపా యంపీలు జంప్
Publish Date:May 25, 2014
Advertisement
నంద్యాల వైకాపా యంపీ యస్.పీ.వై. రెడ్డి, కర్నూలు వైకాపా యంపీ బుట్టా రేణుక భర్త నీలకంటం ఇరువురూ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఈరోజు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. నీలకంటంతో బాటు ఆయన బార్య రేణుక కూడా తెదేపాలో చేరిపోవడం దాదాపు ఖాయమయిపోయింది. వైకాపా యంపీలు, యం.యల్యేలు. తమతో టచ్చులో ఉన్నారని తెదేపా నేతలు గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రచారాన్నిఆ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ గా కొట్టిపడేసిన వైకాపా నిజంగానే ఇద్దరు పార్టీ యంపీలు గోడ దూకేయడం చూసి షాక్కు గురయ్యారు. ఆ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్ధ పార్టీల యంపీలను, యం.యల్యేలను తెదేపాలోకి ఆహ్వానించడం చాలా అనైతికమని ఖండించారు. అధికారం కోసం అర్రులు చాస్తూ కొందరు స్వార్ధపరులు పార్టీని వీడినంత మాత్రాన్న తమపార్టీకి వచ్చే నష్టం ఏమీలేదని అన్నారు. ఇకపై ఒక్కరు కూడా పార్టీ వీడబోరని భరోసా వ్యక్తం చేసారు. అటువంటి నేతలకు, పార్టీలకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెపుతారని అన్నారు. తెదేపా ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వైకాపా ఆవేదన అర్ధం చేసుకోవచ్చును. కానీ అదే వైకాపా పార్టీ గతేడాది కాంగ్రెస్, తెదేపాలకు చెందిన 29మంది యం.యల్యే.లను గంపగుత్తగా పార్టీలో చేర్చుకొన్నపుడు తమ ప్రతాపం చూడమని జబ్బలు చరుచుకొన్న సంగతి ఇప్పుడు మరిచిపోయారు. అప్పటి నుండి ఎన్నికల వరకు ఎంతమంది ఇతర పార్టీనేతలను వైకాపాలో చేర్చుకొన్నారో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి చెందిన యస్.పీ.వై.రెడ్డి సరిగ్గా ఎన్నికలకు ముందు గోడదూకి తమ పార్టీలోకి చేరినప్పుడు ఆయనకు ఎర్ర తివాచి పరిచి నంద్యాల టికెట్ ఇచ్చిన సంగతి మరిచిపోయి, ఇప్పుడు ఆయన తెదేపాలోకి చేరడం అనైతికమని గగ్గోలు పెడుతుండటం హాస్యాస్పదం. తమ పార్టీకి వర్తించని, పాటించని నీతి, నియమాలు ఇతర పార్టీలు పాటించాలని వైకాపా అనుకోవడం విచిత్రం.
http://www.teluguone.com/news/content/ycp-39-34065.html





