వైసీపీది బహిష్కరణ కాదు పలాయనమన్న బీటెక్ రవి
Publish Date:Aug 13, 2025
Advertisement
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో రీపోలింగ్ కావాలని డిమాండ్ చేసి మరీ సాధించుకున్న వైసీపీ.. ఆ రీపోలింగ్ ను బహిష్కరించింది. కోరి సాధించుకున్న రీపోలింగ్ ను బహిష్కరించడానికి కారణం జనం వారి వైపు లేరని తెలిసిపోవడం వల్లనే అంటున్నారు పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పుణ్యాన వైసీపీయులకు పులివెందులలో వారి పరిస్థితి ఏమిటో? వారి బలం ఏమిటో తెలిసివచ్చిందనీ, దీంతో దిమ్మతిరిగి బొమ్మ కనిపించిందని బీటెక్ రవి అన్నారు. బుధవారం (ఆగస్టు 13) పులివెందులలో మీడియాతో మాట్లాడారు. పులివెందుల చరిత్రలో దాదాపుగా ఎన్నడూ లేని విధంగా జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరిగిందన్నారు. ఆ ఎన్నిక కూడా చాలా ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగిందన్న బీటెక్ రవి.. వైసీపీ మాత్రం కొందరి చేత ఓట్లు వేయలేకపో యామంటూ చెప్పించి, వాటిని వీడియోలు తీసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి రీపోలింగ్ కోరిందన్న బీటెక్ రవి.. వారు కోరినట్లు ఎన్నికల కమిషన్ రెండు కేంద్రాలలో రీపోలింగ్ కు ఆదేశించిందనీ, అయినా కూడా రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నామంటూ ప్రకటించడం పలాయనం కాక మరేమౌతుందని ప్రశ్నించారు. ఇప్పుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి తాము 15 కేంద్రాలలో రీపోలింగ్ కావాలని అడిగితే.. ఎన్నికల కమిషన్ రెండు చోట్లే రీపోలింగ్ కు ఆదేశించిందంటూ కొత్త వాదనకు తెరతీస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా ప్రజాస్వామ్యం పట్ల నమ్మకముంటే.. రీపోలంగ్ లో పాల్గొనాలని సవాల్ చేశారు. ప్రజలు తమ వెంట లేరని తెలియడం వల్లనే వైసీపీ రీపోలింగ్ ను బహిష్కరించి పలాయనం చిత్తగించిందని బీటెక్ రవి అన్నారు.
http://www.teluguone.com/news/content/ycp--not-boycott-ranaway-39-204124.html





