మహిళా బిల్లుపై సీఎం రేవంత్‌పై బండి సంజయ్ ఘాటు విమర్శలు
Publish Date:Apr 23, 2026
Advertisement
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహిళా ఆగ్రహ పాదయాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం మహిళల సాధికారతకు కట్టుబడి ఉందని, ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళా బిల్లును అడ్డుకునే వారు మహిళల ఆశలపై నీళ్లు చల్లినట్టేనని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల కల్లా మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం, తులం బంగారం, స్కూటీలు వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ హామీలపై ప్రశ్నించే హక్కు మహిళలకు ఉందని, తమ ఇంటికొచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. మహిళల ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని, అది ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కుటుంబ రాజకీయాలపై నడుస్తున్నవేనని ఆరోపించారు. పార్లమెంట్‌లో ఇప్పటికే ఉన్న మహిళా నేతలను ఉదాహరణగా చూపుతూ సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, కనిమొళి, డింపుల్ యాదవ్, సుప్రియా సూలే పేర్లను ప్రస్తావిస్తూ సాధారణ మహిళలకు అవకాశాలు కల్పించడంలో ఈ పార్టీలు ఆసక్తి చూపలేదని విమర్శించారు. దేశంలో మహిళల పాత్రను గౌరవించే సంస్కృతి ఉందని, కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా దేశ అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని అన్నారు.మహిళా బిల్లుకు మద్దతు తెలపాలని కాంగ్రెస్ నేతలను కోరుతూ, మహిళల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. మహిళల ఆక్రోశం రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/womens-protest-march-36-218104.html





