బొల్లారం లో ఓ మహిళ హత్య కేసు.. భర్తే నిందితుడు
Publish Date:Jun 10, 2026
Advertisement
హైదరాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన భార్యతో బైక్ పై వెడుతుండగా గుర్తు తెలియని కొందరు దుండగులు వచ్చి భార్యను దారుణంగా హత్య చేశారంటూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసులో భర్తే నిందితుడిగా నిర్ధారించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. బీహార్‌కు చెందిన అనిల్ కుమార్, మీనా దేవి దంపతులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి బొల్లారంలోని బీహార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అనిల్ కుమార్ లేబర్ కాంట్రాక్టర్ పని చేస్తూ సంపాదిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అనిల్ కుమార్, మీనాదేవి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన భార్య మీనాదేవిని హత్య చేయాలని పథకం పన్నిన అనిల్ కుమార్.. ఆ హత్య ఒక ప్రమాదం జరిగినట్లుగా ఉండాలని భావించి బీహార్‌కు చెందిన నలుగురు వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు. గత నెల 30న తన భార్యతో మార్కెట్ కు వెళ్లిన అనిల్ కుమార్ తిరిగి వస్తూ.. బొల్లారం సమీపంలో రిపేర్ అంటూ బండిని ఆపాడు. ఆ మాటలు నమ్మి మీనాదేవి బండి దిగి పక్కన నిలబడింది. అప్పటికే అక్కడ మాట వేసి ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా మీనాదేవి మీద దాడి చేసి పొదలోకి తీసుకువెళ్లి గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత అనిల్ ఏమి ఎరగనట్లు పోలీసులకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన భార్యను హత్య చేశారంటూ ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులకు అనిల్ చెప్పే మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు. దీంతో కేసు నమోదు చేసుకొన్న పోలీసులకు దర్యాప్తులో భర్త అనిల్ కుమార్ పై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయట పెట్టాడు. పోలీసులు అనిల్‌తో పాటు భరత్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
http://www.teluguone.com/news/content/womans-murder-case-36-222511.html





