పులివెందులలో అంపశయ్యపై వైసీపీ.. జగన్ పర్యటనతో కోలుకుంటుందా?
Publish Date:Feb 25, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటిస్తున్నారు. పులివెందుల జగన్ అడ్డాగా చెబుతారు. అక్కడ ఆయనకు తిరుగులేని ఆధిపత్యం ఉందని అంటారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మాత్రం అందుకు ఒకింత భిన్నంగా ఉంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలలో పులివెందులలో వైసీపీ అభ్యర్థి అవమానకరం అన్న రీతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడంతో జగన్ అడ్డాగా అప్పటి వరకూ అంతా భావించిన పులివెందులలో వైసీపీ గాలిపోయినట్లైంది. జగన్ కోట బీటలు వారిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. అటువంటి పులివెందులలో జగన్ ఇప్పుడు పర్యటిస్తున్నారు. సాధారణంగా ఒక ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గంలో పర్యటించడం అన్నది సాధారణమే. అలాగే జగన్ కూడా పర్యటిస్తున్నారు అనుకోవడానికి లేకుండా ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయంలో నూతన విగ్రహ ప్రతిస్ఠాపన చేశారు. ఔను నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో జగన్ బుధవారం (ఫిబ్రవరి 25) నూతన విగ్రహ ప్రతిష్ఠాపన చేయడమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , దేవాలయాలను మన సంస్కృతీ, సంప్రదాయాల ప్రతీకలుగా అభివర్ణించారు. అయితే గతంలో ఎన్నడూ ఇలా ఆలయాల సందర్శన, పూజలు నిర్వహించిన దాఖలాలు లేవు. పైపెచ్చు తన హయాంలో ఆలయాలపై జరిగిన దాడులపై కూడా జగన్ పెద్దగా స్పందించలేదు. అయితే ఇప్పుడు జగన్ తన పులివెందుల పర్యటనలో ప్రత్యేకంగా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయడం, ప్రత్యేక పూజలు నిర్వహించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఓ వైపు అసెంబ్లీలో తిరుమల లడ్డూపై చర్చకు గైర్హాజర్ కావడంతో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో వైసీపీ తప్పు చేసినట్లుగా సర్వత్రా ఒక భావన అయితే వ్యక్తం అవుతోంది. జగన్ యాంటీ హిందూ అన్న ప్రచారం ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో హిందూత్వ వ్యతిరేకి అనే ముద్రకు దూరం కావడానికి జగన్ ఇప్పుడు తన నియోజకవర్గ పరిధిలోని ఓ ఆలయాన్ని సందర్శించి, విగ్రహ ప్రతిష్ఠ చేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో అంటే వైసీపీ హయాంలో కూడా జగన్ ఇలా హిందూ వ్యతిరేక ముద్ర తొలగించుకునేందుకు పీఠాధిపతుల వద్దకు వెళ్లిన సంగతి విదితమే. ఇప్పుడు కూడా అదే తరహాలో పులివెందులలో కూడా ఆలయ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పోతే.. జడ్పీటీసీ ఎన్నికలో వైసీపీ ఓటమి తరువాత పులివెందులలో జగన్ హవా తగ్గిందన్న భావన వైసీపీ శ్రేణులలోనే వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యూహం మార్చి తన పర్యటనలో ప్రజాదర్బార్ లు నిర్వహిస్తున్నారు. అయితే ఇవేమంత సత్ఫలితాలను ఇస్తున్నట్లు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాయలసీమ కరవును నివారించడానికి, సాగు, తాగు నీరు అందించడానికీ చేస్తున్న పనులు, చేపడుతున్న కార్యక్రమాలు ఇందుకు కారణమంటున్నారు. అలాగే రాయలసీమ అభివృద్ధి పనులు సైతం జోరుగా సాగుతున్నాయి. అలాగే పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జనంలో పాగా వేస్తున్నది. ఈ నేపథ్యంలోనే జడ్పీటీసీ ఉప ఎన్నికలో పులివెందులలో వైసీపీ ఓటమి తరువాత నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అంపశయ్యపై ఉన్నట్లుగా తయారైందనీ, జగన్ తన పర్యటనలు, ఆలయ సందర్శనతో ఈ పరిస్థితి మర్చగలుగుతారా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తమౌతున్నాయి.
http://www.teluguone.com/news/content/will-ycp-revive-in-pulivendula-25-214653.html




