టాస్క్ ఫోర్స్ టీమ్ సోషల్ మీడియా బూతు పంచాంగానికి చెక్ పడేనా?
Publish Date:Jul 8, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపులు, వ్యక్తిగత దూషణలకు వేదికగా మారిన సోషల్ మీడియాను అదుపు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇంటర్నెట్ వేదికగా సాగుతున్న అసభ్యకర పోస్టులు, వికృత వ్యాఖ్యలను అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఒక సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా విపరీతమైన విద్వంసకర వాతావరణం నెలకొంది. భావప్రకటనా స్వేచ్ఛ ముసుగులో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు, ఇతర ప్రజాప్రతినిధులపై బూతులు తిట్టడం, శృతిమించిన వ్యక్తిగత దూషణలకు దిగడం నిత్యకృత్యంగా మారింది. చదువు చెప్పిన గురువులు, పెంచిన తల్లిదండ్రులు తలదించుకునేలా దరిద్రమైన పదజాలంతో సాగుతున్న ఈ అరాచకానికి బ్రేక్ వేయడమే ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ప్రముఖ నాయకులపై నిస్సిగ్గుగా విమర్శలు చేసినందుకు పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ప్రస్తుత చట్టాల ప్రకారం ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో కోర్టులో అతనికి తక్షణమే బెయిల్ లభించింది. ఇలాంటి చట్టపరమైన లొసుగులను వాడుకుని నిందితులు సులభంగా బయటపడుతున్నారని ప్రముఖ విశ్లేషకుడు కిలారు నాగార్జున అభిప్రాయపడ్డారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన సోషల్ మీడియాలోలొ వికృత, అసభ్య పోస్టులు పెట్టే వారిని పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చి విచారించి వదిలేయడం వారికి భయం లేకుండా పోతోందన్నారు. కేవలం టాస్క్ ఫోర్స్ బృందాలను వేసి నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టినంత మాత్రాన ఈ సమస్య పూర్తిగా సమసిపోదన్నారు. గత ప్రభుత్వంలో కూడా న్యాయమూర్తులు, ప్రతిపక్ష నేతలపై జరిగిన వ్యక్తిగత దాడులను పరిశీలిస్తే.. చట్టాల్లో కఠినమైన మార్పులు రానంత వరకు సోషల్ మీడియా వికృత చేష్టలకు అడ్డుకట్ట వేయడం అసాధ్యమన్నారు. తీవ్రమైన బూతులు, బెదిరింపులకు పాల్పడే వారిపై నాన్-బెలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేలా చట్ట సవరణలు జరగాల్సిన అవసరం ఉందని కిలారు నాగార్జున అన్నారు. ఈ సోషల్ మీడియా బూతుల పంచాంగానికి శాశ్వత పరిష్కారం లభించాలంటే కేవలం ప్రభుత్వాలు, టాస్క్ ఫోర్స్లే కాకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందన్నారు. మనం వాడే దారుణమైన పదజాలం రేపు మన కుటుంబ సభ్యులపైకి కూడా వస్తుందనే విజ్ఞత ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. అప్పుడే ఏపీలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం నెలకొంటుందని కిలారు నాగార్జున అన్నారు. ఎన్నిటాస్క్ ఫోర్సులు వేసినా కఠిన చట్టాలను తీసుకువస్తే తప్ప ఈ సమస్య రూపుమాపడం సాధ్యం కాదన్నారు. AP Social Media Task Force, Online Abuse Control AP, Social Media Laws India
http://www.teluguone.com/news/content/will-task-force-team-curb-offensive-comments-on-social-media-36-225421.html





