క్రిమినల్ కి కులం ఏమిటి?.. పవన్ కల్యాణ్
Publish Date:Jun 21, 2026
Advertisement
సమాజంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. ఒక క్రిమినల్ కులం ఏంటి అంటూ నేటి యువతను ప్రశ్నించిన తీరు ఆలోచింపజేస్తోంది. గాదె సాయికృష్ణ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్, నేరగాళ్లను కుల కోణంలో చూడటం వల్లే వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదని కోర్టును ఆశ్రయించిందంటే, అది ఆ తల్లి ప్రాథమిక హక్కు అన్న ఆయన.. తన బిడ్డ బతికాడో లేదో తెలియని ఆవేదనలో ఉన్న ఆ తల్లి పోరాటంలో ఎక్కడా కులం లేదని, కేవలం న్యాయ పోరాటం మాత్రమే ఉందని గుర్తుచేశారు. రాజ్యాంగం గానీ, దేశ క్రిమినల్ చట్టాలు గానీ నేరస్తుడి కులాన్ని, మతాన్ని లేదా ప్రాంతాన్ని చూసి శిక్షలు ఖరారు చేయవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చట్టం దృష్టిలో కేవలం క్రైమ్ జరిగిందా లేదా, ఎవరు ఎవరికి అన్యాయం చేశారు అనే అంశాలు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకుంటాయి. కానీ దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో నేరస్తులను కూడా వారి కులాలను బట్టి వెనకేసుకొచ్చే సంస్కృతి పెరిగిపోతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా యువత ఈ కులాల పరిధి నుంచి బయటకు రావాలని, క్రిమినల్స్ ను క్రిమినల్స్ లాగే చూడాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పు చేసేవాడికి, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వాడికి కులం ఎందుకు ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వాడి గుర్తింపు కేవలం ఒక క్రిమినల్ మాత్రమేనని, అలాంటి నీచుడిని ఏ కులం వారైనా వెనకేసుకొస్తే అది ఆ వ్యక్తి దౌర్భాగ్య స్వభావాన్ని సూచిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్రిమినల్ గ్యాంగులతో ప్రభుత్వాలను నడపాలని చూడటం, అధికారులను భయభ్రాంతులకు గురిచేసి గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని హెచ్చరించారు. భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం అంటూ క్రిమినల్ గ్యాంగులు ఈరోజు తలపైకి ఎక్కి ఆడుతున్నాయంటే, ఆ బలం వాళ్ళది కాదు, సమాజంగా మనందరి కలెక్టివ్ బలహీనత అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. పౌరులను సాధికారత వైపు నడిపించడమే తన ముఖ్య ఉద్దేశమని, అందుకే 3 నెలల క్రితమే ఎస్పీ గారితో మాట్లాడి సివిల్ సిటిజన్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం వస్తే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తమ పరిధిలో ఉంటారని, మితిమీరి ప్రవర్తించరని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కులాలకు ఓటింగ్ పాటర్న్ ఉండొచ్చేమో కానీ, పౌర హక్కులకు, ప్రాథమిక హక్కులకు ఎలాంటి కులాల ఓటింగ్ పాటర్న్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. మన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఏ ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్నుకోబోమని ప్రజలు గట్టిగా నినదించినప్పుడే నిజమైన మార్పు వస్తుందని, పాలకులు కూడా మారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రిమినల్స్ కు కులాన్ని అంటగట్టి వెనకేసుకొచ్చే ఏ రాజకీయ నాయకుడినైనా సరే ఆమడదూరంలో పెట్టకపోతే, అది సమాజ భవిష్యత్తుకే తీవ్ర భంగం కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/will-not-tolerate-criminals-being-given-a-caste-color-39-223681.html





