ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్.. ఆయనే ఎందుకంటే?
Publish Date:Aug 18, 2025
Advertisement
చివరాఖరుకు ఎన్డీఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెర పడింది. నిజానికి మాజీ ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్ ఖడ్ అనారోగ్య కారణాల వలన తన పదవికి రాజీనామా చేసిన మరు క్షణం నుంచీ ఆయన వారసుడి వేట మొదలైంది. ఊహాగానాలు ఊపందుకున్నాయి. చాలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి, అయితే.. చివరాఖరుకు ఊహాగానాలలో అంతగా వినిపించని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను అధికార ఎన్డీఎ తమ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. బీజీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలోతీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం (ఆగస్టు 17)మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే.. ఎన్నో పేర్లు పరిశీలనకు వచ్చినా, బీజీపీ నాయకత్వం ఆయన్నే ఎందుకు ఎంపిక చేసింది ? ఇదీ ఇప్పడు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినవస్తున్న ప్రశ్న. ఇందుకు ఒకటికంటే ఎక్కువ కారణాలే కనిపిస్తున్నాయి. అయితే ఇతర కారణాలు ఎన్నున్నా.. సైధాంతిక పునాదులే అయన ఎంపిక వెనక ఉన్న ప్రధాన కారణంగా’పేర్కొనవచ్చునని పరిశీలకులు అంటున్నారు. అవునుజ. జగదీశ్ ధన్ ఖడ్ ను బలవంతంగా బయటకు పంపవలసి వచ్చిన చేదు అనుభావాన్ని దృష్టిలో ఉంచుకునే బీజేపీ నాయకత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వేసిందని, అందుకే.. బాల్యం నుంచి రాష్ట్రీయ స్వయం సేవం సఘ్(ఆర్ఎస్ఎస్) భావజాలంతో, భారతీయ జన సంఘ్ (బీజేఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లతో కలిసి నడిచిన సీపీ రాధాకృష్ణన్ ను ఎన్డీఎ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదొకటి అయితే వివిధ కీలక పదవులకు బాధ్యులను ఎంపిక చేసే విషయంలో బీజేపీ నాయకత్వం, ఆలోచనా తీరు కొంత భిన్నంగా ఉంటుంది. విభిన్న కోణాల్లో ఆలోచించి కానీ తుది నిర్ణయం తీసుకోదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర శాఖలఅధ్యక్షులు,ఇతర బాధ్యుల ఎంపిక విషయంలో బీజేపీ ఎంతో కసరత్తు చేస్తుంది. ఇప్పడు ఉపరాష్ట్రపతి అబ్యర్ది ఎంపిక విషయంలోనూ అదే కసరత్తు ఇంకొంచెం ఎక్కువగా చేసిందని పరిశీలకులు అంటున్నారు. అందుకే సైద్ధాంతిక కట్టుబాట్లతో పాటుగా రాజకీయ సమీకరణాలు, అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుందని అంటున్నారు. దక్షిణాదిలో మరీ ముఖ్యంగా తమిళనాడులో పట్టు పెంచుకునేందుకు ఎంతో కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న కమల దళం, తమిళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీపీ రాధాకృష్ణన్ ను వ్యుహ్తంకంగానే ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిందని అంటున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికయ్యే సమయానికి ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నా, ఆయన స్వరాష్ట్రం తమిళనాడు. తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జన్మించిన సీపీ రాధాకృష్ణన్ తమిళ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 16 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ తీర్ధం పుచ్చుకున్న ఆయన అదే బాటలో రాజకీయ ప్రస్థానం సాగించారు. బీజేఎస్, బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటుగా, 1998, 1999లో కోయంబత్తూరు నుంచి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004-2007 మధ్య తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అంతే కాకుండా రాధాకృష్ణన్ కు అన్ని పార్టీలతో, అందరు నాయకులతో సన్నిహిత సంబంధా లున్నాయి. డిఎంకే అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని అంటారు. రాధాకృష్ణన్ ఒక వారం పదిరోజుల క్రితం కూడా, ఇటీవల అనారోగ్యానికి గురైన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను ఆయన ఇంటికెళ్ళి మరీ పరామర్శించారు. అలాగే.. ఇతర పార్టీలలోని ముఖ్యనేతలతోనూ రాధాకృష్ణన్‌కు మంచి సంబంధాలున్నాయని అంటారు. అలాగే.. ఆయన ఓబీసీ కులానికి చెందిన వారు కావడం కూడా కలిసి వచ్చిందని అంటారు. నిజానికి బీజేపీ అన్ని కోణాల్లో ఆలోచించే.. తమిళ మోదీగా పిలుచుకునే సీపీ రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అదలా ఉంటే,సెప్టెంబర్ 9 న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్ట్రోరల్ కాలేజీలోని బలా బలాల దృష్ట్యా ఎన్డీయే అభ్యర్ధి రాధాకృష్ణన్ గెలుపు ఇంచు మించుగా ఖరారు అయినట్లే అంటున్నారు.
http://www.teluguone.com/news/content/why-radhakrisnan-selected-as-nda-vice-president-candidate-39-204473.html





