ప్రశ్నించడం మరిచావా పవన్! జనసేనానిపై జనంలో చర్చ
Publish Date:Oct 30, 2020
Advertisement
ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చారు సినీ హీరో పవన్ కల్యాణ్. కాని ఇటీవల కాలంలో ఆయన ప్రశ్నించడమే మరిచిపోయినట్లు కనిపిస్తోంది. జనం కోసం ఎంతకైనా పోరాడుతానన్న జనసేనానికి కొన్ని రోజులుగా జనాలను, వారి సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రాలో ఎన్నో సమస్యలున్నా, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాల్లో నిర్ణయాలు జరుగుతున్నా, రాష్ట్రానికి నష్టం కలిగే పరిణామాలు చోటు చేసుకుంటున్నా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. జగన్ సర్కార్ నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్ పడింది. పర్యావరణ అనుమతులు పొందకుండా ప్రాజెక్టుపై ముందుకెళ్లవద్దని ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కృష్ణా బోర్డుకు డీపీఆర్ సమర్పించి, ఆమోదించేంత వరకు ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్లవద్దని రాష్ట్రప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ సూచించిన నేపథ్యంలో .. కృష్ణా బోర్డు నుంచి ముందస్తు అనుమతులు అవసరమా? లేదా? అన్న అంశంలోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్రం ఆదేశాలకు రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉంటుందని భావిస్తున్నామని తెలిపింది. కేంద్ర జలవనరుల శాఖ అభిప్రాయమే ప్రాజెక్టుకు గండంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. రాయలసీమ ఎత్తిపోతలపై సీమ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాయలసీమ నుంచి కరువును తరిమేయడమే లక్ష్యమని ఎన్నో సార్లు చెప్పిన పవన్.. ఈ ప్రాజెక్టుకు కేంద్రం వైఖరిని ఎందుకు నిలదీయడం లేదని సీమ వాసులు పవన్ ను ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. పోలవరం కోసం గతంలో పవన్ పవర్ ఫుల్ ప్రసంగాలు చేశారు. ఇప్పుడా పోలవరం ప్రాజెక్టుతో కేంద్రం ఆటలాడుతోంది. ప్రాజెక్ట్ బడ్జెట్ ఆమోదించామని ఒకసారి , కాస్త కోత విధించామని మరోసారి చెబుతూ వస్తోంది. తాజాగా ఏపీకి షాకిస్తూ భూసేకరణ నష్టపరిహారం తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది కేంద్రం. పోలవరం నిర్వాసితుల గురించి గతంలో పవన్‌కల్యాణ్ మాట్లాడారు. గోదావరి జిల్లాల పర్యటనలోనూ, పోలవరం పర్యటనలోనూ నిర్వాసితుల అంశాన్ని పవన్ లేవనెత్తారు. కానీ ఇప్పుడు కేంద్రం పునరావాస ప్యాకేజీని ఇచ్చేదిలేదని స్పష్టం చేసినా పవన్ కల్యాణ్ మాత్రం మాట్లాడటం లేదు. ఇదెక్కడి న్యాయమని నోరు విప్పి మోడీ సర్కార్ ను అడగడం లేదు. పవన్ తీరుతో పోలవరం నిర్వాసితులతో పాటు జనసేన కార్యకర్తల్లోనూ నిరాశ వ్యక్తమవుతోంది. బీజేపీతో పొత్తు ఉన్నా రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశంలో స్పందించపోవడం సరికాదనే విమర్శలు పవన్ పై వస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఏపీలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కొల్లేరు లంక ప్రాంతాలు , కృష్ణా పరివాహకంలో వందలాది గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేలాది మంది కొన్ని రోజుల పాటు నీళ్లతోనే సహవాసం చేశారు. వరదలు ముంచెత్తి లక్షలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. వరద బాధితులను అదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. కాని వరదల సమయంలో ఏపీ ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు జనసేన. హైదరాబాద్ వరద బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఏపీకి మాత్రం నయా పైసా కూడా ప్రకటించలేదు.దీనిపైనే ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. వరదలతో అల్లాడిన ప్రజలకు ప్రతిపక్ష పార్టీగా అండగా నిలవాల్సిన పవన్ కళ్యాణ్.. కనీసం స్పందించకపోవడం దారుణమంటున్నారు బాధితులు. బీజేపీ కూడా వరద బాధితుల విషయంలో నిర్లక్ష్యంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ బాటలోనే జనసేనాని నడిచినట్టున్నారని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్థానిక ఎన్నికలపై రాష్ట్రంలో నిబంధనల యుద్ధం నడుస్తోంది. కరోనా కారణంగా ఎన్నికలు ఇప్పుడు వద్దని వైసీపీ వాదిస్తోంది. మరోవైపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. ఎస్‌ఈసీ సమావేశానికి వైసీపీ రాలేదు. అయితే అనూహ్యంగా జనసేన కూడా భేటీకి డుమ్మా కొట్టింది. తమ అభిప్రాయాన్ని మెయిల్ ద్వారా పంపించింది. ఎస్‌ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని చెప్పింది. అయితే జనసేన ఎస్‌ఈసీ సమావేశానికి రాకపోవడం రాజకీయ వర్గాలను విస్మయపరిచింది. తన మిత్రపక్షం బీజేపీ తన వైఖరి స్పష్టంగా చెప్పేసినా.. జనసేన దాగుడు మూతలు ఆడటమేంటనే విమర్శలు వచ్చాయి. అమరావతి రైతుల ఉద్యమం మూడు వందల రోజులు దాటింది.ర్యాలీలు, జిల్లాల్లో సంఘీభావ నిరసనలతో ఊపు పెంచారు రాజధాని రైతులు. గతంలో నేనున్నాని మాట ఇచ్చిన పవన్ మాత్రం కనీసం స్పందించలేదు. ఇద్దరు రైతులకు బేడీలు వేసిన ఘటనపై అందరూ మండిపడ్డా పవన్ మాత్రం స్పందించలేదు. పవన్ కళ్యాణ్ తీరుపై ఇప్పుడు ఏపీ జనాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ సమస్యలను ఆయన పట్టించుకోవడం మానేసినట్టున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. బీజేపీతో స్నేహం చేసిన జనసేన చీఫ్... ఎప్పుడు దేనిమీద రియాక్ట్ కావాలో తెలియకో తికమక పడుతున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిస్తేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని లేదంటే ముందుకెళ్లడం కష్టమనే అభిప్రాయం మెజార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/why-is-pawan-kalyan-silent-25-105742.html