సీఎం జగన్‌తో అదానీ సీక్రెట్ మీటింగ్!.. అందుకేనా..?
Publish Date:Sep 13, 2021

Advertisement
రహస్య సమావేశాలు ఎప్పుడూ అనుమానాస్పదమే. ఎలాంటి లొసుగులూ లేకపోతే నిర్భయంగా, అందరికీ తెలిసేలానే భేటీలు జరుగుతుంటాయి. ఏదైనా తేడా వ్యవహారమైతేనే ఆ విషయం ఎవరికీ తెలీకుండా రహస్య మంతనాలు నెరపుతారు. అప్పుడెప్పుడో పోస్కో ప్రతినిధులు సీఎం జగన్‌ను కలిశారు. కట్ చేస్తే, ఆ తర్వాత విశాఖ ఉక్కును పోస్కో కంపెనీ కొనబోతోందని.. అందుకు జగన్ సర్కారు తమవంతు సాయం చేస్తోందనే న్యూస్ వైరల్ అయింది. ఇలా పలు మీటింగ్స్ పలురకాల సందేహాలకు దారి తీస్తుంటాయి. అందులో, జగన్‌రెడ్డిలాంటి వాళ్లు పారిశ్రామికవేత్తలతో సీక్రెట్‌గా మీటింగ్ జరిపారని తెలిస్తే.. గత క్విడ్‌ప్రోకో చరిత్ర కారణంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. తాజాగా, సీఎం జగన్‌తో అదానీ సోదరులు భేటీ అయ్యారనే సమాచారంతో ఒక్కసారిగా అటెన్షన్ నెలకొంది. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా అసలేం జరుగుతోందనే అటెన్షన్ పెరిగిపోయింది.
ఇండియాస్ టాప్ బిజినెస్‌మేన్‌లో ఒకరైన గౌతమ్ అదాని సడెన్‌గా సీఎం జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారని తెలుస్తోంది. ఆ మేరకు ఓ మీడియాలో ప్రముఖంగా వార్త వచ్చింది. అదానీ సోదరులు స్వయంగా తరలివచ్చి మరీ.. తాడేపల్లి ప్యాలేస్‌లో జగన్‌తో భేటీ అవటం మామూలు విషయమేమీ కాదంటున్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును సొంతం చేసుకున్న అదానీ గ్రూప్.. మరోవైపు విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్టులో నూరుశాతం వాట కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ సమావేశం జరగడం ఊహాగానాలకు తావిస్తోంది. సీఎం జగన్‌తో అదానీ బ్రదర్స్ భేటీ గురించి తనకు తెలీదని.. పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డే చెప్పడం.. ఆ శాఖ మంత్రికే తెలీకుండా జగన్‌తో అదానీ సోదరులు సీక్రెట్ మీటింగ్ జరిపారంటూ వార్తలు రావడం ఆసక్తికర పరిణామం.
గంగవరం పోర్టులో 89 శాతం వాటా అదానీ గ్రూపుదే. మిగిలిన 10.54 శాతం వాటాను కూడా కొనేస్తే.. పోర్టు పూర్తి స్థాయిలో అదానీ చేతికొస్తుంది. ఆ మేరకు ప్రభుత్వంతో అదానీ గ్రూపు ఒప్పందం కూడా చేసుకుంది. ఆ పది శాతం వాటా కోసం సుమారు 645 కోట్ల చెల్లింపులు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ ఒప్పందంపై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ కేసుపై తదుపరి విచారణను ఈనెల 20వ తేదీన జరగనుంది. అంటే విచారణకు సరిగ్గా వారం ముందు.. సీఎం జగన్‌తో అదానీ సోదరులు సమావేశమయ్యారంటూ తెలీడం అనుమానాలకు కారణమవుతోంది.
మరో 10శాతం వాటా కోసమే అదానీ బ్రదర్స్ సీఎం జగన్‌ను కలిశారా? కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే నెక్ట్స్ ఏం చేయాలని చర్చించారా? ఆ విషయం మాత్రమే చర్చించడానికి అదానీ సోదరులు ఇంతదూరం తాడేపల్లి ప్యాలెస్‌కు స్వయంగా తరలిరావాలా? వస్తే, ఆ మీటింగ్‌ను అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? ఆ శాఖ మంత్రికి కూడా సమాచారం లేదంటే ఏమనుకోవాలి? ప్యాలెస్ లోపల ఏం జరిగిందని భావించాలి? ఇలా అనేక అనుమానపు ప్రశ్నలు. ఇందులో ఏది నిజమో.. జగన్‌కే తెలియాలి....
http://www.teluguone.com/news/content/why-gowtham-adani--meet-ap-cm-jagan-secret--39-122921.html












