తిరుపతి లడ్డు వివాదం ..ధర్మారెడ్డి ఏరీ? ఎక్కడ?
Publish Date:Sep 23, 2024
Advertisement
తిరుమల తిరుపతి లడ్డూ వివాదంతో దేశం అట్టుడికిపోతున్నది. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందన్న విషయం ల్యాబ్ నివేదికతో నిర్ద్వంద్వంగా తేలిపోయింది. జగన్ హయాంలో దేవాలయాలపై జరిగిన అరాచకాలు, దాడులను మించి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగం.. ప్రజల మనోభావాలను తీవ్రాతి తీవ్రంగా దెబ్బతీసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశ ప్యాప్తంగా జనం ఆందోళనలకు దిగుతున్నారు. జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద కూడా బీజేపీ ధర్నా చేసింది. జగన్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది. ఇక జాతీయ మీడియా తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై డిబేట్లు నిర్వహించింది. అంటే జగన్ హయాంలో తిరుమల పవిత్రత దెబ్బతిందని ప్రజలు సందేహాలకు అతీతంగా నిర్ధారణకు వచ్చేశారు. ఒక్క చాన్స్ అంటూ ప్రజలను అభ్యర్థించి అధికారంలోకి వచ్చిన జగన్ ఐదేళ్ల పాటు బాధ్యతారహితంగా అరాచక పాలన సాగించారు. దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, కక్ష సాధింపులే తన పాలనా విధానం అన్న రీతిలో జగన్ పాలన సాగింది. అదంతా పక్కన పెడితే.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై మాట్లాడాల్సిన అప్పటి తిరమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారన్న సమాచారం కూడా లేదు. జగన్ హయాంో ఐదేళ్లపాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఈ లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై మాట్లాడాలి. కానీ ఆయన ఆచూకీ తెలియడం లేదు. జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐదేళ్లు వెలగబెట్టిన ధర్మారెడ్డి.. 2024 ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నాలుగు రోజుల ముందు పదవీ విరమణ చేశారు. జగన్ హయాంకు ముందు వరకూ టీటీడీ ఈవోలుగా పని చేసిన వారంతా ఐఏఎస్ అధికారులు మాత్రమే. కానీ జగన్ అధికారం చేపట్టిన తరువాత టీటీడీ ఈవో నియోమకం విషయంలో సంప్రదాయానికీ, ఆనవాయితీకి పంగనామాలు పెట్టేసి ఐడీఈఎస్ (ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్)కి చెందిన ధర్మారెడ్డిని ఏరి కోరి మరీ టీటీడీ ఈవోగా నియమించుకున్నారు. జగన్ అప్పగించిన బాధ్యతను ధర్మారెడ్డి తు.చ.తప్పకుండా నిర్వర్తించారు. తిరుమల పవిత్రతను మంటగలిపే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరిగినా పట్టించుకోలేదు. రాజకీయ ప్రసంగాలకు వేదికగా తిరుమల మారుతున్నా మాట్లాడలేదు. టీటీడీలో అన్యమతస్తులను కొలువులు కట్టబెట్టారు. ఇలా టీటీడీ జగన్ హయాంలో ధర్మారెడ్డి జాగీర్ అన్నట్లుగా మారిపోయింది. ధర్మారెడ్డి జాగీరు అంటే జగన్ జాగీరేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరే ఇప్పుడు జగన్ అధికారంలో లేరు. జగన్ హయాంలో టీటీడీలో రాజ్యమేలిన అరాచకం, అకృత్యాలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని వెలుగులోనికి వచ్చింది. వీటన్నిటికీ తొట్ట తొలుత బాధ్యత వహించాల్సింది అప్పటి ఈవో ధర్మారెడ్డి మాత్రమే. ఆ తరువాత అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయనకు మందు టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే వీరిలో ధర్మారెడ్డి మాత్రం కనిపించడం లేదు. వినిపించడం లేదు. ఐదేళ్ల పాటు డిప్యూటేషన్ పై ఆంధ్ర సర్వీస్ లో ఉన్న ధర్మారెడ్డి, తనకు జూన్ 30 వరకూ ఎక్స్ టెన్షన్ ఇవ్వాల్సిందిగా ఎన్నికలకు ముందు కోరారు. అందుకు కేంద్రం అంగీకారం కూడా తెలిపింది. అయితే ఎన్నికలలో జగన్ రెడ్డి పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుని అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ధర్మారెడ్డిని సెలవుపై పంపింది. జూన్ 30తో ఎక్సటెన్షన్ ముగియటంతో సొంత క్యాడర్ లో చేరి ఉండాలి కానీ చేరారా లేదా అన్న సమాచారం లేదు.
http://www.teluguone.com/news/content/where-is-dharmareddy-39-185379.html





