కేసీఆర్ ఛీ అన్నా మోడీనే నంబర్ వన్
Publish Date:Aug 27, 2022
Advertisement
“ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ళ పాలనలో, దేశానికి పనికొచ్చే ఒక్క మంచి పనిచేసింది, లేదు. ఏ వర్గాన్ని సంతృప్తి పరిచిందీ లేదు. మోడీ వట్టి పనికిమాలిన ప్రధాని. ఇంత పనికి మాలిన ప్రదానిని నేను నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదు.” ఈ మాటలు ఎవరివో వేరే చెప్పనక్కరలేదు. ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచు చేస్తున్న విమర్శ ఇది. నిజమే, ఒక్క కేసీఆర్ అనే కాదు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదలు రేవంత్ రెడ్డి వరకు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరూ, మోడీని విమర్శించడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. కానీ, దేశంలో విపక్షాలు మోడీని ఎంతగా విమర్శించినా, అంతర్జాతీయంగా ఆయన ప్రతిష్ట మరింతగా పెరుగుతూనే వుంది, కానీ, గ్రాఫ్ పడిపోయిన దాఖలాలు మాత్రం లేవు. నిజానికి, అంతర్జాతీయంగానే కాదు, జాతీయంగానూ, రాహుల్ గాంధీ సహా ప్రధాని రేసులో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరికంటే, మోడీనీ ఫస్ట్ ప్లేస్’లో ఉన్నారు. ఓ పక్షం రోజుల క్రితం ‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ డి నేషన్ సర్వే’లోనూ 53 శాతం మంది ప్రజలు మాలీ మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. మోడీ తర్వాత రెండవ స్థానంలో ఉన్న రాహుల్ గాంధీని పీఎంగా చూడాలని అనుకుంటోంది కేవలం 9 శాతం మంది మాత్రమే. అలాగే, జస్ట్ ఓ 7 శాతం మంది కేజ్రీవాల్’ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. సో, రాహుల్ గాంధీ, కేసీఆర్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకులు మోడీని పనికిమాలిన ప్రధాని అని ఎద్దేవా చేసినా దేశ ప్రజలు మాత్రం మోడీకే జై కొడుతున్నారని, అనుకోవచ్చును. సర్వేలే కాదు. ఎన్నికల ఫలితాలు కూడా అదే సుస్చిస్తున్నాయి, అనుకోండి, అదివేరే విషయం. అదలా ఉంటే, దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రధాని మోడీ ఛరిష్మా ఒకేలా వుంది. ప్రధాని పదవిలో ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న మోడీకి జాతీయ స్థాయిలో ఎంత ఫాలోయింగ్ ఉందో అంతర్జాతీయంగా కూడా అంటే ఫాలోయింగ్ ఉందని మరో మారు రుజువైంది. అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ "మార్నింగ్ కన్సల్ట్ "ప్రపంచ అత్యుత్తమ నేత” ఎవరనే విషయంగా నిర్వహించిన సర్వేలో మోడీ మళ్ళీ మొదటి స్థానంలో నిలిచారు. ఓటింగ్’లో పాల్గొన్న వారిలో 75 శాతం మంది, ‘మోడీ ది బెస్ట్’ అని కితాబు నిచ్చారు. ప్రపంచ నేతల్లో నరేంద్ర మోడీయే మళ్లీ నెంబర్ వన్ గా నిలిచారు. మొత్తం 22 మంది అంతర్జాతీయ నేతలపై మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ 22 మంది దేశాధినేతల్లో అత్యధికంగా 75 శాతం రేటింగ్ సంపాదించుకుని మోడీ ప్రధమ స్థానంలో నిలిచారు. 63 శాతం ఆమోదంతో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడార్ ఉండగా, 54 శాతంతో మూడో స్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు. అయితే ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం 41 శాతం అప్రూవల్ రేటింగ్తో 5వ స్థానంతో సరిపెట్టుకున్నారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 39 శాతం, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో బైడెన్ తర్వాత స్థానంలో ఉన్నారు. మార్నింగ్ కన్సల్ట్... పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ వంటి దేశాల్లో ఈ సంస్థ సర్వేను నిర్వహించింది. ఈ సంస్థ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుంచి ప్రధాని మోడీ అప్రూవల్ రేటింగ్స్ 2020 మే నెలలో అత్యధిక స్థాయిలో కనిపించాయి. అయితే గత ఏడాది కొవిడ్ రెండో ప్రభంజనం సమయంలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ అతి తక్కువ స్థాయికి పతనమయ్యాయి. ఈ సంవత్సరం జనవరిలో విడుదలైన ఒక సర్వేలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి స్థానంలో నిలిచారు.ఇప్పడు మళ్ళీ అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
http://www.teluguone.com/news/content/whatever-kcr-say-modi-is-number-one-25-142779.html





