మోడీ నాడేం చెప్పారు.. నేడేం చేస్తున్నారు?

Publish Date:Nov 11, 2022

Advertisement

పీఎస్ యూలను అమ్మేయ్.. ప్రైవేటును పెంచేయ్.. మోడీ విధానమిదేనా? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రధానిగా ఎనిమిదేళ్ల కాలం పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా మోడీ రికార్డు అయితే సృష్టించారు కానీ, దేశ ప్రగతి, పురోగతి విషయంలో ఆయన పాలన, ఆయన విధానాలు తిరోగమనంలోనే ఉన్నాయన్నది విశ్లేషకుల మాట. పీఎస్ యూలను తెగ నమ్ముతూ పాలన అంటే ప్రైవేటీకరణే అన్నట్లుగా మోడీ తీరు ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వాలు కూడా అనివార్యమైన పరిస్థితులు తలెత్తిన సమయాల్లో ప్రభుత్వ రంగ సంస్థల లో ప్రభుత్వ వాటాలను విక్రయించిన సందర్భాలు ఉన్నాయి.

కానీ ఇప్పుడు మోడీ చేస్తున్నట్లు గా మొత్తం ప్రభుత్వ వాటాలను విక్రయించేసి ఆయా సంస్థలపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకుండా చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. గత ప్రభుత్వాలు పీఎస్ యూలలో వాటాలు విక్రయించినా ఆయా సంస్థలపై ప్రభుత్వ ఆజమాయిషీ కొనసాగేలా అన్ని జాగ్రత్తలూ తీసుకునేవి. వాటాల విక్రయం కూడా పరిమితంగానే ఉండేది. అయితే మోడీ మాత్రం పీఎస్ యూలను వదిలించుకోవడమే ధ్యేయం అన్నట్లుగా ప్రభుత్వ రంగ సంస్థలను వేలానికి పెట్టేస్తున్నారు. 

 టీమ్ ఇండియా స్ఫూర్తితో దేశాన్ని ప్రగతి బాట పట్టిస్తానంటూ నాడు ప్రసంగాలూ వాగ్దానాలతో జనాన్ని మెస్మరైజ్ చేసి అధికారంలోకి వచ్చిన మోడీ.. ప్రధానిగా మాత్రం టీమ్ ఇండియా స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకూ, అన్ని ప్రాంతాలకూ సమన్యాయం అన్న మోడీ ఆచరణలో మాత్రం గుజరాత్ కే ఎక్కువ సమన్యాయం అన్న తీరులో వ్యవహరిస్తున్నారు. భారత దేశం అంటే రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల సమాహారం అన్నది విస్మరించి.. గుజరాత్ మాత్రమే బారత్ లో ఉందా అని ఇతర రాష్ట్రాలు అనుకునే విధంగా ఆయన నిర్ణయాలు, విధానాలు, వ్యవహార శైలి ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రధానిగా మోడీ పాలన లక్ష్యం పీఎస్ యూలను తెగనమ్మడమేనా అనిపించేలా కనిపిస్తోంది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో కేంద్రం తెగనమ్మిన పీఎస్ యూల సంఖ్య 28. ఇప్పటి వరకూ దేశంలో ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేసిన రికార్డు మోడీ సర్కార్ దే అనడంలో సందేహం లేదు. పైగా ఈ అమ్మకాలన్నీ సంపన్నులకు అనుకూలంగానే జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి పారేసిన మోడీ ప్రభుత్వ రంగంలో ఒక్క సంస్థనైనా నెలకొల్పారా అంటే లేదనే సమాధానం వస్తుంది. మోడీకి ముందు ఉన్న ప్రధానులు దేశంలో ప్రభుత్వ రంగంలో సంస్థలను ఏర్పాటు చేసి వాటిని జాతికి అంకితం చేశారు. కానీ మోడీ మాత్రం తన ముందున్న ప్రధానులు జాతికి అంకితం చేసిన సంస్థలను తెగనమ్మి ఆయా సంస్థలలో పని చేస్తున్న కార్మికుల భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ దేశంలో దాదాపు 300 పీఎస్ యూలు ఏర్పాటయ్యాయి.

వాటిలో నెహ్రూ హయాంలో  దేశంలో 32 ప్రభుత్వ రంగం సంస్థలు ఏర్పాటయ్యాయి. అదే ఇందిరాగాంధీ హయాంలో 66 పీఎస్ యూలు ఏర్పాటయ్యాయి. ఇక కేవలం రెండున్నరేళ్లు మాత్రమే అధికారంలో ఉన్న జనతా పార్టీ హయాంలో అంటే మురార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన 9 పీఎస్ యూలను జాతికి అంకితం చేశారు. దేశంలో ఆధునిక టెక్నాలజీకి ద్వారాలు తెరిచిన రాజీవ్ గాంధీ హయాంలో కూడా 16 పీఎస్ యూలు దేశంలో ఏర్పాటయ్యాయి. ఇక వీపీసింగ్ హయాంలో 2   పీఎస్ యూలు ఏర్పాటయ్యాయి. 

సరళీకృత ఆర్థిక విధానాలకు అంకురార్పణ చేసిన పీవీ నరసింహరావు కూడా తన హయాంలో ఏకంగా 14 పీఎస్ యూలను జాతికి అంకితం చేశారు.  ఇక వాజ్ పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో కూడా 17 ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారు. అయితే ప్రబుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం కూడా ఆయన హయాంలోనే ఆరంభమైనా... చాలా పరిమితంగా మాత్రమే వాటాలను విక్రయించి పీఎస్ యూలపై ప్రభుత్వ హయాం ఇసుమంతైనా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో అంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి.

ఆయన హయాంలో మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించారు. అదీ పరిమితంగానే. అయితే మన్మోమన్ సింగ్ హయాంలో మూడు పీఎస్ యూలలో  వాటాల విక్రయంపై అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశాన్ని అమ్మేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. దేశాన్ని అమ్మేస్తుంటే తాను మౌనంగా ఎలా ఉంటాను, ఒట్టేసి చెబుతున్నా..దేశాన్ని అమ్మనివ్వనంటూ గర్జించారు.

అయితే అప్పుడు ఆయన అన్నదేమిటి? ఇప్పుడు ప్రధానిగా మోడీ చేస్తున్నదేమిటి? అని ప్రశ్నించుకుంటే ఆయన మాటలకూ చేతలకూ నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా కనిపిస్తుంది. మూడు పీఎస్ యూలలో వాటాలను విక్రయించినందుకే వాళ్లు దేశాన్ని అమ్మేస్తున్నారంటూ మన్మోహన్ ప్రభుత్వంపై విరుచుకుపడిన మోడీ.. తాను పీఎంగా పగ్గాలు చేపట్టిన తరువాత ఇప్పటి వరకూ దేశంలో ఒక్క ప్రభుత్వ సంస్థ ఏర్పాటు కాలేదు సరికదా.. 23 ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేశారు. 

అది కూడా మన్మోహన్ సింగ్ హయాంలో విక్రయించినట్లుగా పరిమిత వాటాలు కాకుండా మొత్తంగా సంస్థలనే వాటి ఆస్తులతో సహా విక్రయించేశారు. వీటితో మోడీ అమ్మకాల పరంపర ఆగిపోయినట్లు కాదు... తన లక్ష్యం వంద పీఎస్ యూల ప్రైవేటీకరణ అంటూ ఆయనే స్వయంగా చెబుతున్నారు. ఇంత అడ్డగోలుగా పీఎస్ యూలను తెగనమ్మేస్తున్న మోడీ హయాంలో దేశం ఖాతాలోకి కొత్తగా ఒక్కటంటే ఒక్క పీఎస్ యూ కూడా  ఏర్పాటు కాలేదు. ఇంతకీ ఇంత అడ్డగోలుగా పీఎస్ యూలను ఎందకు అమ్మేస్తున్నారయ్యా అంటే ఆయన ప్రభుత్వం వ్యాపారం చేయదు.. అందుకే అమ్మేస్తున్నాం అంటారు. అదే సమయంలో ఆయన కేబినెట్ లో ఆర్దిక శాఖ నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్ మాత్రం ప్రభుత్వం ఉచిత సేవలు చేయదనీ, వ్యాపారమే చేస్తుందనీ చెబుతున్నారు. అందుకే లాభసాటిగా లేని పీఎస్ యూలను అమ్మేస్తున్నామంటున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో లక్షా 75 వేల కోట్ల రూపాయల రాబడి లక్ష్యంతో 28 ప్రభుత్వ రంగ సంస్థలను వేలం పెట్టినట్లు పెట్టి మరీ అమ్మేశారు. ప్రైవేటైజేషన్ పేరుతో మోడీ సర్కార్ బంగారు గుడ్లు పెట్టే బాతును అడ్డంగా కోసుకుని తినేస్తున్నారు. సరే ఈ విషయంలోనైనా సమన్యాయం పాటిస్తున్నారా అంటే... అస్సలు లేదు. గుజరాత్ లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ  జీఎస్పీసీ( గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్)ని నష్టాల నుంచి కాపాడేందుకు లాభాల బాటలో ఉన్న ఓఎన్జీసీ వంటి సంస్థలను సంక్షోభంలోకి నెట్టేయడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు. లాభాల బాటలో ఉన్న ఓఎన్జీసీ జీఎస్ పీసీలో 80శాతం వాటాలను 8 వేల కోట్లకు తీసుకునేలా మోడీ సర్కార్ చేసింది. 

అంతే కాదు ఓఎన్ జీసీ ఆ జీఎస్పీసీకి 13 వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. గుజరాత్ లో ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ సంస్థను కాపాడేందుకు లాభసాటిగా నడుస్తున్న పీఎస్ యూలను సంక్షోభంలోకి నెట్టడానికి కూడా వెనుకాడని మోడీ..మరి అదే విధానాన్ని మిగిలిన రాష్ట్రాలలో ఎందుకు అవలంబించడం లేదన్న ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని  విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీ సర్కార్ ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపుతోందని నిలదీస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా ఇదే ప్రశ్నను తెలుగుదేవం ఎంపీ రామ్మోహననాయుడు ప్రభుత్వానికి సంధించారు. మోడీ దృష్టిలో సమన్యాయం అంటే గుజరాత్ కు మాత్రమే వర్తిస్తుందా అని నిలదీస్తున్నారు. ఒక దేశం ఒక ఎన్నిక, ఒక దేశం ఒక రేషన్ అంటున్న మోడీ సర్కార్ వన్ నేషన్ వన్ జస్టిస్ విధానాన్ని ఎందుకు అనుసరించదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంతకూ జీఎస్ పీసీపై మోడీకి అంత ప్రేమ ఎందుకంటే.. తాను ప్రధాని కావడానికి ఆ సంస్థ సోపానంగా ఉపయోగపడటమే. ఔను గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ రెండో సారి అధికారంలో ఉన్న సమయంలో ఆయన దేశం మొత్తం అచ్చెరవొందేలాంటి ప్రకటన ఒకటి చేశారు. దేశం చమురు దిగుమతుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా తమ గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ గొప్ప ఇన్వెన్షన్ చేసిందనీ,  ఏపీలోని కృష్ణా గోదావరి బేసిన్ లో దాదాపు 2లక్షల 20 వేల కోట్ల రూపాయల విలువైన 20 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలను గుర్తించిందనీ,  వీటిని వెలికి తీయడం ద్వారా 2014 నాటికి భారత్ దిగుమతి చేసుకుంటున్న 80 వేల కోట్ల చమురు దిగుమతుల అవసరం లేకుండా చేస్తామనీ ఉద్ఘాటించారు. అలా మిగిల్చిన 80 వేల కోట్ల రూపాయలనూ దేశంలోని పేదలకు పంచుతామని మోడీ చెప్పారు.  ఔను అప్పట్లో మోడీ ఇదే విషయాన్ని చెప్పారు. ఇలాంటి మాటలే ఆరు సంవత్సరాల కిందట పెద్ద నోట్ల రద్దు సమయంలో మోడీ చెప్పారు కదా అనుకుంటున్నారా? ఔను నిజమే.. పెద్ద నోట్ల రద్దు తో దేశంలో నల్ల ధనం లేకుండా చేస్తామని అప్పట్లో గొప్పగా చెప్పారు. 

ఆ మాటలు ఎంత డొల్లో ఈ ఆరేళ్లలో తేలిపోయింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కేవలం సంపన్నులకు మేలు చేయడానికేననీ, అదే సమయంలో చిన్న తరహా పరిశ్రమలన గుల్ల చేయడం, మధ్యతరగతి ఆర్థిక పరిస్థితిని చిన్నా భిన్నం చేయడానికే దోహదపడిందని తేలిపోయింది. సరిగ్గా అలాగే 17 ఏళ్ల కిందట 2015 జూన్ లో జీఎస్ పీసీ కృష్ణాబేసిన్ లో 20 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ను కనుగొందనీ, 2014 నాటికి దానికి వెలికి తీస్తామని మోడీ చెప్పిన మాటలు కూడా కేవలం గాలి కబుర్లేనని తేలిపోయింది. 2014 గడిచిపోయి ఎనిమిదేళ్లయ్యింది. కానీ ఇంత వరకూ జీఎస్ పీసీ కృష్ణాగోదావరి బేసిన్ నుంచి వెలికి తీసినది ఎన్ని క్యూబిక్ మీటర్ల గ్యాస్ అన్న ప్రశ్నకు వచ్చే సమాధానం జీరో అనే. అంటే గ్యాస్ నిల్వలే లేని చోట అపార గ్యాస్ నిల్వలున్నాయంటూ దేశాన్ని మోసం చేశారన్నమాట. అయితే ఇప్పుడు గ్యాస్ నిల్వల కోసం అన్వేషణ కొనసాగుతోందంటున్నారు.

మోడీ మాటల గారడీకి కృష్ణాగోదావరి బేసిన్ లో గ్యాస్ నిల్వల ప్రకటన, పెద్ద నోట్ల రద్దు ప్రకటనలు మచ్చుకు మాత్రమే. మోడీ హయాంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందంటూ చేస్తున్న ప్రకటనలన్నీ జనాన్ని మభ్య పెట్టడానికేనని తేలిపోయిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు మోడీ విశాఖ పర్యటన సందర్భంగా మోడీ విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణపై జనాలను సమాధానం చెప్పుకోవలసిన అవసరం ఉందంటున్నారు. జీఎస్ పీసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా దానిని కాపాడటానికి తన అధికారాన్ని మొత్తం ఉపయోగించి.. ఆర్బీఐ నిబంధనలను కూడా తోసి రాజంటున్న మోడీ ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ  ఉక్కు కర్మాగారం విషయంలో సవతి తల్లిప్రేమ ఎందుకు చూపుతున్నారు. లాభాల్లో సాగుతున్న సంస్థను గనులు కేటాయించకుండా ఉద్దేశపూర్వకంగా నష్టాలలోకి నెట్టి మరీ ప్రైవేటు పరం చేస్తన్నతీరును ఆంధ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటు ఉక్కు కర్మాగారాలకు కేటాయించినట్లుగా విశాఖఉక్కుకు కూడా గనులను కేటాయిస్తే.. కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేకుండానే విశాఖ ఉక్కు కర్మాగారం మళ్లీ లాభాల బాట పడుతుందంటున్నారు.  

By
en-us Political News

  
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.