పారిశ్రామికాభివృద్ధికి భూ కేటాయింపుల్లో తప్పేంటి?
Publish Date:Aug 1, 2025
Advertisement
ఏపీలో పెట్టుబడి దారుల సందేహాలన్నీ దాదాపు నివృత్తి అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకత చూపుతున్న పెట్టుబడి దారులకు ఇంత కాలం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటన్న సందేహం ఉండేది. ఇప్పటి వరకు కొందరు పెట్టుబడి దారులు.. విపక్షాలు సహా.. ఇతర ఉద్యమకారుల విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు కల్పించే మౌలిక వస తులపై.. యాగీ చేస్తారని.. ముఖ్యంగా భూములు.. ఇతరత్రా కీలక విషయాల పై తమకు ఇబ్బందులు వస్తాయని అనుమానించారు. ఆ సందేహాలు, అనుమానాలూ మరింత బలపడే తీరుగానే గత ఏడాది కాలంగా వైసీపీ వ్యవహరిస్తూ వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులకు మోకాలడ్డే విధంగా కోర్టు కేసులు, ఆయా కంపెనీలకు ఈ మెయిల్స్ పంపుతూ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి శతధా ప్రయత్నించింది. అయితే తాజాగా హైకోర్టు వ్యాఖ్యలతో పెట్టుబడి దారుల సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో తమ వ్యాపారాలకు ఎలాంటి అవరోధాలు ఉండవన్న నమ్మకం చిక్కింది. ఇంతకీ విషయమేంటంటే.. విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కు భూమిని కేటాయించిన వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందులో విశాఖలో తక్కువ ధరకు భూములు ఇవ్వడాన్ని పిటిషనర్లు తప్పుపడుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పిటిషన్ విచారణ సందర్బంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెట్టుబడి దారులకు ఇచ్చే భూముల కేటాయింపు విషయంలో సందేహాలు ఎందుకని పిటిషనర్లను ప్రశ్నించింది. ఏపీలో అభివృద్ధి ఆరంభ దశలో ఉ:ది.. ఏమీ ఇవ్వకుండా ఇన్వెస్టర్లు ఎలా వస్తారని హైకోర్టు నిలదీసింది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు అభివృద్ధి చెందడానికి గతంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్టుబడి దారులకు భూములు కేటాయించి.. వనరులు కల్పించారనీ, అందుకే ఆ నగరాలు అభివృద్ధి చెందాయనీ హైకోర్టు పేర్కొంది. హైకోర్టు వ్యాఖ్యలతో దీంతో సర్కారుకు భారీ ఊరట దక్కడమే కాకుండా ఇన్వెస్టర్లలో ధైర్యం, విశ్వాసం పెరిగాయి. విశాఖలో టీసీఎస్ సహా లులు మల్టీ చైన్ కంపెనీలకు భూములు కేటాయించారు. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకర్రేడు గ్రామంలో సౌర విద్యుత్ ప్లాంటుకు భూములు ఇచ్చారు. విజయవాడలోని పాత బస్టాండ్‌ను లులు మాల్‌కు కేటాయించనున్నారు. ఇప్పుడు వీటి విషయంలో ప్రభుత్వం ధైర్యంగా ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడింది. వీటిపై రేపు న్యాయపరమైన వివాదాలు తలెత్తినా.. హైకోర్టు ఉత్తర్వులు ప్రభుత్వానికి కలిసి రానున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ఇన్వెస్టర్లు కూడా ధైర్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడానికి కోర్టు వ్యాఖ్యలు దోహదపడతాయనడంలో సందేహం లేదు.
http://www.teluguone.com/news/content/what-is-wrong-in-alloting-land-ti-industries-39-203260.html





