మంత్రిగా ఉంటూ ఈ చిల్లర చేష్టలేంటి రోజా మేడమ్?
Publish Date:Oct 18, 2022
Advertisement
‘వేసిన రాయినల్లా ఒప్పుకుంటే.. వెర్రోడే గెలిచాడని’ సామెత ఒకటి ఉంది. అంటే.. ఆ మాదిరిగా ఉంది ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా తీరు అని పలువురు రాజకీయ నేతలు, ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో రోజా ప్రవర్తించిన తీరుతో అనేక మంది ఆమెపై అగ్గిమిద గుగ్గిలం అవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు వస్తున్న సందర్భంగా ఆయనకు అఖండ స్వాగతం పలికేందుకు వచ్చిన జనసేన శ్రేణులు, నేతలను రెచ్చగొట్టే విధంగా మంత్రి రోజా ‘వేలు’ చూపించడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. మంత్రై ఉండీ అలాంటి చిల్లర చేష్టలేమిటని ప్రశ్నిస్తున్నారు. అమరావతే ఏకైక రాజధాని అన్న డిమాండ్ తో ఆ ప్రాంత రైతులు అమరావతి టూ అరసవిల్లి మహా పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తున్న క్రమంలో ‘విశాఖ గర్జన’ పేరుతో అధికార వైసీపీ ఆధ్వర్యంలో నాన్ పొలిటికల్ జేఏసీ పేరుతో శనివారం (అక్టోబర్ 15) జరిగిన కార్యక్రమంలో ఆ గర్జనలో మంత్రి రోజాతో సహా పలువురు ఇతర మంత్రుల, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను అమరావతి రైతులపై రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారు. ఆ తర్వాత తిరిగి వెళ్లేందుకు రోజా సహా వైసీపీ నేతలు, కొందరు మంత్రులు కూడా విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు. అదే సమయంలో ఉత్తరాంధ్రలో మూడు రోజుల పర్యటన కోసం, ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహించేందుకు వస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ను స్వాగతించేందుకు జనసేన నేతలు, శ్రేణులు ఇసుక వేస్తే రాలనంత సంఖ్యలో ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆ సందర్భంగా ఎయిర్ పోర్టు ఆవరణలో రోజా తన వేలు చూపిస్తూ వారిని రెచ్చగొట్టారు. దాంతో జనసైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడం.. మంత్రులకు, వైసీపీకీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. ఆ సందర్భంగానే మంత్రుల కార్లపై దాడి జరిగింది. మంత్రులు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చేటపుడు తాను అక్కడే ఉన్నానని, జనసేన నేతలు, కార్యకర్తలు హుందాగా వ్యవహరించారని టీడీపీ నేత బుద్దా వెంకన్న మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. జనసైనికులకు మంత్రి రోజా వేలు చూపించారు. వేలు చూపించడానికి అర్థం ఏమిటో రోజాయే చెప్పాలి అని బుద్దా వెంకన్న అన్నారు. ఇటు జనసైనికులు కూడా రోజా వ్యవహరించిన తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. రోజా మరీ హద్దుమీరి వ్యవహరిస్తున్నారంటూ ఫైరవుతున్నారు. రోజా వేలు చూపించిన వీడియో క్లిప్పింగ్ చూసిన పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఓ మహిళ అయి ఉండీ, పైగా మంత్రి పదవిలో ఉండీ ఆమె అటువంటి చేష్టలకు పాల్పడటాన్ని తప్పుపడుతున్నారు. రోజా ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదని జనం గుర్తుచేసుకుంటున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అప్పటి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. అప్పటి మంత్రి పీతల సుజాతపైన కూడా ‘వడ్డాణం’ అంటూ ఆమె ప్రదర్శించిన హావభావాలు చూసిన ప్రతి ఒక్కరూ తప్పుపట్టారు. అలాగే అసెంబ్లీలోనే టీడీపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి వైపు చూస్తూ ‘… కోస్తా’ అంటూ ఆమె చేసిన విన్యాసం కూడా పలువురిని విస్మయా నికి గురిచేసింది. మంత్రి పదవి చేపట్టిన తరువాత అయినా హుందాగా ప్రవర్తించకుండా ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడుతుండాన్ని జనం అసహ్యించుకుంటున్నారు. రోజాకు ఇప్పటికైనా కాస్త ఇంగితం వస్తే బాగుండు అని వ్యాఖ్యానిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/what-is-this-behaviour-minister-roja-25-145642.html





