పోలికల వల్ల కలిగే నష్టం ఏమిటి?
Publish Date:Nov 11, 2024

Advertisement
మనల్ని ఇంకొక మనిషి నుండి వేరు చేసేవి, ప్రత్యేకంగా ఉంచేవి ఆలోచనలు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనలకు తగినట్టే వారు పనులు చేస్తారు,దానికి తగ్గట్టుగా జీవిస్తారు. కానీ ఎప్పుడూ మనం ఉన్న స్థితినీ ఉండవలసిన స్థితినీ పోల్చి చూసుకుంటున్నాం. ఉండవలసిన స్థితి అనేది మన మనసు రూప కల్పన చేసినదే. సరిపోల్చి చూసుకోవడం అనేది ఎదురైనప్పుడు వైరుధ్యం వస్తుంది. ఏదో పరాయివస్తువుతో కాదు, నిన్నటి మనతో ఉన్నది, ఈరోజు మనతో ఉన్నదీ రెండింటినీ తరచి చూసుకున్నా అవి మనిషిలో ఎప్పుడూ సంఘర్షణను వెంటబెట్టుకొస్తాయి.
పోల్చి చూచుకోవడం అనేది లేనప్పుడు ఉన్నది ఒక్కటే వుంటుంది. అది మనలో మనమే అయినా లేక ఇతరులతో అయినా పోలిక అనేది లేనప్పుడు మనలో ఉన్నది ఒక్కటే మనతో ఉంటుంది. ఉన్నదానితో జీవించడమే ప్రశాంతంగా వుండడం, అప్పుడు మీరు మీ అంతరంగ స్థితికి మరే పరధ్యాసా లేకుండా పరిపూర్ణ సావధానత యివ్వగలరు. అది నిరాశ అయినా, వికారమయినా, క్రౌర్యం అయినా, భయం అయినా, ఆదుర్దా అయినా, ఒంటరితనం అయినా… ఇట్లా ఏదైనా సరే... దానితోనే పూర్తిగా సహజీవనం చేస్తారు. అప్పుడు వైరుధ్యం లేదు. కనుక సంఘర్షణ కూడా లేదు.
కాని, ఎంతసేపు మనం ఇతరులతో మనను పోల్చి చూసుకుంటున్నాం. మనకంటే శ్రీమంతులు, మేధావంతులు, మరింత అనురాగపరులు, ప్రసిద్దులు, ఇలా ఎన్నో రకాలుగా మిన్న అయిన వారితో, 'మిన్న' అవడం మనల్ని నడుపుతుంది. మన జీవితాలలో అది గొప్ప ప్రాధాన్యం అయిపోతుంది. ఏదో ఒకదానితోనో, మనష్యులతోనూ పోల్చి చూసుకోవడం అనేది మనకు సంఘర్షణను తెచ్చి పెడుతున్న ప్రథమ కారణం.
అసలు పోల్చి చూసుకోవడం అనేది ఎందుకు జరుగుతోంది? మరొకళ్ళతో మిమ్మల్ని ఎందుకు పోల్చుకుంటారు? ఈ పని చిన్నతనం నుంచి నేర్చుకుంటున్నారు కదా... ప్రతి పాఠశాలలోను యిద్దరు పిల్లలకు పోలిక. రెండో వానిలాగ వుండటానికి మొదటివాడు తనను తాను నాశనం చేసుకుంటాడు. అసలు సరిపోల్చి చూసుకోవడం అనేది లేనప్పుడు, ఆదర్శం అంటూ లేనప్పుడు, అవతలి పక్షం అనేది లేనప్పుడు, ద్వంద్వప్రవృత్తి లేనప్పుడు, మీకంటే విభిన్నమయిన వారుగా మీరు కనిపించాలని ప్రయత్నం చేయనప్పుడు మీ మనసు ఏమవుతుంది? మీ మనసు వ్యతిరేకమైన దానిని నిర్మించడం, ఎదురుగా పెట్టడం మానివేస్తుంది. అప్పుడది చాల తెలివిగా, పదునుగా, లలితంగా, అమిత శక్తివంతగా తయారవుతుంది.
ఎందుకంటే ప్రయత్న ప్రయాసల వలన మన గాఢాసక్తి చెదరిపోయి పలచబడుతుంది. జీవసత్త్వమే శక్తివంతమైన లక్షణం. ఈ సత్యం లేకుండా ఏ పని చేయలేరు.
ఇతరులతో పోల్చి చూసుకోవడం అన్నపని లేనప్పుడు, మీరు మీరుగా వుండిపోతారు. పోలిక వల్ల, మీరు పరిణమించాలనుకుంటున్నారు. ఎదగాలనుకుంటున్నారు. మరింత తెలివి కలవారు, సుందరులు అవాలనుకుంటున్నారు. కాని నిజంగా అలా కాగలరా? వాస్తవం ఏమిటంటే మీరు ఉన్న స్థితి పోల్చి చూచుకోవడం వల్ల మీరు వాస్తవాన్ని ముక్కలు ముక్కలుగా నరుక్కుంటున్నారు. అది శక్తిని దుర్వినియోగం చేసుకోవడం.
ఎటువంటి పోలికలు లేకుండా, మీ నిజస్థితిని మీరు చూచుకున్నందువల్ల మీకు ఎంతో శక్తి సంపద ఒనగూరుతుంది. పోలికలు లేకుండా మీవంక మీరు చూసుకున్నప్పుడు మనసు తృప్తితో స్తబ్ధమయిపోయిందని కాదు అర్ధం మీరు పోలికలకు అతీతులు అయిపోతారు. జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి అవసరమయిన శక్తి, జీవసత్త్వం ఎలా వృధా అయిపోతుందో మనకు తెలిసివస్తుంది. పోలికలు పెట్టుకోవడం జీవితంలో ఎదుగుదలను, వ్యక్తిత్వాన్ని కుచించుకునేలా చేయడమే అవుతుంది. అందుకే పోలిక మంచిది కానే కాదు.
◆నిశ్శబ్ద.
http://www.teluguone.com/news/content/what-is-the-loss-of-comparism-35-146581.html












