అప్పులు చేసినా తప్పని తిప్పలు.. తెలంగాణ పయనమెటు?
Publish Date:Jul 13, 2022
Advertisement
దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, తొమ్మిది (9) కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులున్నారు. అలాగే, 28 రాష్ట్రాలు, తొమ్మిది (9) కేంద్ర పాలిత ప్రాంతాలలో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. అయితే, ఒక్క తెలంగాణ మినహా మిగిలిన 27 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తేదీనే జీతాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అంతకు ఒక రోజు ముందు జూన్ 30 తేదీనే జీతాలు వచ్చాయి. తెలంగాణాలో మాత్రం.. ఫస్ట్’కు కాదు, 13 వరకూ కూడా 18 జిల్లాల ఉద్యోగులకు జీతాలు రాలేదు. రోజుకు మూడు, నాలుగు జిల్లాల వంతున జీతాలు చెల్లిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇది కూడా ఏదో ఒక నెల సమస్య కాదు. ఇంచుమించుగా సంవత్సర కాలంగా ఇదే కొనసాగుతోందని ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగాసంఘాల నాయకులు అంటున్నారు. నిజానికి, నెల నెలకు పరిస్థితి దిగజారుతోందని అంటున్నారు. ముందు ఐదారు తారీకులలో వస్తున్న జీతాలు.. ఇపుడు 20 తేదీకి కూడా జమ కావడం లేదని అంటున్నారు. జూన్ నెలలో 20 వ తేదీ తర్వాతనే ఉద్యోగుల ఖాతాలో జీతాలు జమయ్యాయని, ఉద్యోగులు చెప్పుకొస్తున్నారు. మరో మూడు నాలుగు నెలలు పోతే, ఏ నెల జీతాలు ఆ నెలలో వచ్చే పరిస్థతి కూడా ఉండక పోవచ్చని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల (జులై) 5వ తేదీన రూ.3 వేల కోట్ల అప్పు తీసుకున్నది. అందుకు అదనంగా, మరో వెయ్యి కోట్ల రూపాయల అప్పుకు కేంద్రం అనుమతిచ్చింది. అంటే ఈ ఒక్క నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్ల అప్పు చేసింది. అయినా జీతాలు ఇచ్చేందుకు చేతులాడడం లేదంటే, ముందు ముందు పరిస్థితి ఇంకెంత అధ్వానంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఒక్క జీతాలే కాదు రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్ల పరిస్థితి అంతే. ఆసరా పెన్షన్ల విషయం అయితే, చెప్పనే అక్కరలేదు. రెండు మూడు నెలలుగా ఆసరా పెన్షన్ల ఆచూకీ చిక్కడం లేదు. మరో వైపు రైతు బంధు నిధులు కూడా పూర్తిగా జమ చేయలేదు. ఇంకా రూ.2 వేల కోట్ల మేర రైతు బంధుకు చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇవి గాక, చిన్నా పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో, తెలియదు. ఈ మొత్తం కలిపితే, రాష్టం మొత్తం అప్పు ఎంత ఎత్తుకు ఎదుగుతుందో, ఏ శిఖరాన్ని తాకుతుందో కుడా తెలియదు. ఈ మొత్తం పరిస్థితిని గమనిస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన స్థితికి చేరుకుందని, వేరే చెప్పవలసిన అవసరం లేకుండా అందరికీ, అర్థమై పోయింది. అయితే ఎందుకీ పరిస్థితి? మిగులు నిధులతో తొలి అడుగు వేసిన తెలంగాణ రాష్ట్రం, ఎనిమిది సంవత్సరాలలో సుమారు రూ. 5 లక్షల కోట్లు అప్పు చేసినా, ఇంకా, ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి ఎందుకు చేరుకుంది అంటే, స్పష్టమైన కారణం చెప్పడం కష్టమేమీ కాదు. ఆర్థిక క్రమశిక్షణ అడుగంటి పోవడమే రాష్ట్ర అధ్వాన ఆర్థిక పరిస్థితికి మూల కారణమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం, అధికార తెరాస నాయకులు మాత్రం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై ఆంక్షలు విధించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని, నేరం నాది కాదు, కేంద్రానిది అనే విధంగా వాదన చేస్తున్నారు. మరోవంక ఆర్థిక నిపుణులు, అప్పులు హద్దులు దాటితే, రాష్ట్రంలోనూ శ్రీలంక పరిస్థితి తప్పదని హెచ్చరిస్తున్నారు. అధికార విపక్షాల వాదనలు, ఆర్థిక నిపుణుల హెచ్చరికలు ఏలా ఉన్నా, సకాలంలో జీతాలు రాక ఉద్యోగులు, ఇబ్బడులు పడుతున్నారు. చెక్ బౌన్సులు అవుతున్నాయని, ఈఎంఐలు కట్టలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే., పెన్షనర్ల పరిస్థితి మరింద దయనీయంగా ఉందని అంటున్నారు. జీతాలు ఇచ్చిన తర్వాతనే పెన్షన్లు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం విషయంలోనూ సర్కార్ నాన్చుడు ధోరణితో రిటైర్డ్ ఉద్యోగులు మరింత తిప్పలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.63 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతినెలా యావరేజ్‌గా రూ.1,100 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు, మూడు నెలల కోసారి జీతాలు ఇస్తున్నారు. ఇలా ఏ దిక్కు నుంచి చూసినా అష్టమ దిక్కే కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైందని, అధికార వర్గాలు అంగీకరిస్తున్నాయి..అయినా, ముఖ్యమంత్రి కేసీఅర్, తెలంగాణ మోడల్ డెవలప్మెంట్ దేశం మొత్తంలో అమలయ్యేలా, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తామంటున్నారు.
http://www.teluguone.com/news/content/what-is-telanganas-way-25-139597.html





