జ్ఞాపకాలు బాధపెడుతున్నాయా? ఇలా చేస్తే ఉపశమనం లభిస్తుంది..!
Publish Date:Dec 4, 2025
Advertisement
జ్ఞాపకం అంటే జరిగిపోయిన ఒక సంఘటన తాలుకూ సందర్భాలు, మాటలు, మనుషులు గుర్తుండిపోవడం. ఇవి సంతోషం కలిగించేవి అయితే గుర్తు వచ్చిన ప్రతిసారీ సంతోషాన్నే కలిగిస్తాయి. కానీ.. అవి బాధపెట్టే విషయాలు అయితే మాత్రం వాటి ప్రభావం మామూలుగా ఉండదు. కొన్నిసార్లు గత సంఘటనలు, జ్ఞాపకాలు హృదయంలో లోతైన గాయాన్ని మిగిల్చుతాయి. అలాంటి సమయాల్లో లోలోపలే నలిగిపోతాడు. చాలా నరకం అనుభవిస్తాడు. ఒంటరితనం ఫీలవుతాడు. కానీ ఒంటరిగా అనిపించడం అంటే జీవితంలో చాలా విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. దీన్నుండి బయటకు రావడానికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. అంగీకారం.. బాధాకరమైన జ్ఞాపకాల నుండి బయటపడటానికి వాటిని అణచివేయడం కంటే అంగీకరించడం చాలా ముఖ్యం. సత్యాన్ని అంగీకరించడం ముందుకు సాగడానికి మొదటి అడుగు. కాబట్టి జరిగినవి ఏవైనా సరే.. వాటిని అంగీకరించాలి. ఒకరు మోసం చేసినా, నమ్మక ద్రోహం చేసినా, నష్టం కలిగినా.. ఇలా ఏదైనా సరే.. దాన్ని అంగీకరించి ముందుకు సాగాలి. ఇలా చేస్తే జ్ఞాపకాలు బాధపెట్టవు. షేరింగ్.. జ్ఞాపకాలు బాధపెట్టినప్పుడు బాధను అందరితో పంచుకోవడం తప్పు. కుటుంబ సభ్యులు, అర్థం చేసుకునే స్నేహితులు, లేదా కౌన్సిలర్ లతో జరిగింది చెప్పుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను విశ్లేషణ చేసుకుని ఆలోచించే సామర్థ్యం ఉండదు. అదే ఇలా అర్థం చేసుకోగలిగే వారు ఉంటే .. జరిగిన విషయం గురించి మంచి వివరణ, సలహా, ఊరట కలిగే విధంగా మాట్లాడటం వంటివి చేయగలుగుతారు. వ్యక్తీకరణ.. బాధను వ్యక్తీకరించడం కూడా ఒక కళే.. డైరీ రాయడం లేదా కళ-సృజనాత్మకత ద్వారా భావాలను వ్యక్తపరచడం కూడా ఉపశమనం కలిగిస్తుంది. మనసులో ఉన్న భావాలను కాగితంపై పెట్టడం మంచి చికిత్స. అంతే కాదు.. బాధ నుండి బయటకు రావడానికి ఆ అక్షరాలే సహాయం చేస్తాయి. ధ్యానం, యోగ.. ధ్యానం, యోగా సహాయం తీసుకోవడం కూడా జ్ఞాపకాల మిగుల్చే బాధ నుండి బయటకు రావడానికి సహాయపడుతుంది. ఇది మనస్సును ప్రశాంతపరచడమే కాకుండా వర్తమానంలో జీవించడం కూడా నేర్పుతుంది. బాధకు సమయం ఇవ్వవద్దు.. బిజీగా ఉండటం, కొత్త అభిరుచులను అలవాటు చేసుకోవడం, ఏదో ఒక కొత్త పనిని చేయడం లేదా నేర్చుకోవడం వలన జ్ఞాపకాల నుండి దూరం కావడానికి సహాయపడుతుంది. కొత్త వాటిలో మునిగిపోయినప్పుడు బాధాకరమైన విషయాలు మసకబారుతాయి. అసలు వాటి గురించి ఆలోచించే అంత సమయం ఉండకుండా చూసుకోవాలి. జీవనశైలి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. బాగా తినడం, తగినంత నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయవచ్చు. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/ways-to-get-over-painful-memories-35-206044.html





