వైజాగ్ టెక్కీ అనుమానాస్పద మృతి...భర్త వేధింపులే కారణమా?
Publish Date:Jun 19, 2026
Advertisement
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మసూరీకి భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి (26) అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. వివాహమైన కేవలం ఏడు నెలలకే ఆమె ఇలా విగతజీవిగా మారడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కుమార్తె మరణం వెనుక అల్లుడి వేధింపులు, అనుమానపు బుద్ధులే కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు విశాఖపట్నం పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆర్మీ విశ్రాంత ఉద్యోగి కుమార్తె అయిన గాయత్రి ఎంబీఏలో కాలేజ్ టాపర్‌గా నిలిచింది. గతేడాది నవంబర్‌లో శ్రీచరణ్ అనే యువకుడితో ఆమెకు ఘనంగా వివాహం జరిగింది. అయితే, ఈ నెల 15న మసూరీలోని ఓ హోటల్ గదిలో గాయత్రి స్పృహలేకుండా పడి ఉందంటూ శ్రీచరణ్ భార్య తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. హుటాహుటిన వారు అక్కడికి చేరుకునే లోపే దేహ్రాదూన్‌లో శవపరీక్ష సైతం ముగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్త శ్రీచరణ్‌కు విపరీతమైన అనుమానపు స్వభావం ఉందని గాయత్రి తల్లిదండ్రులు సత్యవతి, సుధాకర్ ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే సమయంలో ఆమె ఉంటున్న గదికి ఎవరు వచ్చినా సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించేవాడని, చివరకు రాపిడో బైక్‌పై వచ్చినా వాచ్‌మెన్‌తో ఆరా తీసేవాడని పేర్కొన్నారు. అంతేకాకుండా, గాయత్రికి తెలియకుండా ఆమె ఆఫీస్ బ్యాగ్‌లో లొకేషన్ ట్రాకర్ కూడా పెట్టాడని, దీనిపై ఆమె గతంలోనే తమ వద్ద ఎంతో బాధపడిందని కన్నీరుమున్నీరయ్యారు. మరికొద్ది రోజుల్లో (జూన్ 20న) ఇంట్లో జరగబోయే ఒక శుభకార్యం కోసం గాయత్రి ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకుందని, ఈ లోపే ఇలాంటి ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిత్యం వీడియో కాల్స్ చేస్తూ ఎంతో సంతోషంగా మాట్లాడే తమ కుమార్తె, అనుమానాస్పద స్థితిలో మరణించడం వెనుక ఖచ్చితంగా భర్త వేధింపులే ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి తమ కుమార్తె మృతికి కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని డీసీపీ మణికంఠను కలిసి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఏ ఆడపిల్లకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విశాఖ పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఉత్తరాఖండ్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ కేసు దర్యాప్తును ముమ్మరం చేయనున్నారు. భర్త శ్రీచరణ్‌ను విచారిస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/visakhapatnam-techie-death-36-223529.html





