విక్రమ సింఘే కూడా గొటబాయలాగే..!
Publish Date:Jul 22, 2022
Advertisement
శ్రీలంక సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతోందా? ఆ దేశంలో రాజకీయ శూన్యం నెలకొని ఉందా? ప్రజాకాంక్ష ఏమిటన్నది ఆ దేశ నేతలకు తెలియడం లేదా? అర్ధం కావడం లేదా? అసలు విఫల నేత, అసమర్థ నేతగా ప్రజల దృష్టిలో పలుచన అయిన విక్రమ సంఘే వినా మరో నేతే అధ్యక్షపదవికి దొరకపోవడం ఏమిటి? అందుకే ఆ దేశంలో నిరసనలు చల్లారడం లేదు. ఎమర్జెన్సీని సైతం లెక్క చేయడం లేదు. దేశాధ్యక్షుడిగా విక్రమ సింఘే ప్రమాణ స్వీకారం చేసిన గంటలలోనే ఆ దేశంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. దేశ ప్రధానిగా రాజీనామా చేసిన సమయంలో విక్రమ సింఘే ఎంత బేలగా మాట్లాడారో.. మళ్లీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి అధికార పగ్గాలు అందుకున్నాక ఆయన స్వరంలో వాడి పెరిగింది. ప్రజలను బెదరించడానికి, హెచ్చరించడానికి కూడా వెనుకాడలేదు. ఆయన మాటలకు అనుగుణంగానే.. ఆయన దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టిన గంటల వ్యవధిలోనే ఆ దేశ భద్రతా బలగాలు జనంపై విరుచుకుపడ్డాయి. నిరసన కారులు అధ్యక్ష భవనం వద్ద నిరసన కారులు ఏర్పాటు చేసిన టెంటులను తొలగించాయి. నిరసన కారులపై విచక్షణా రహితంగా దాడి చేశాయి. పలువురు నిరసన కారులు గాయపడ్డారు. క్షతగాత్రులలో మీడియా ప్రతినిథులు కూడా ఉన్నారు. దీంతో మళ్లీ దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి యుతంగా నిరసన చేస్తున్న వారిపై పాశవికంగా దాడి చేయడంపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దేశం విడిచి పారిపోయిన మాజీ అధ్యక్షుడు గొటబాయ లానే తాజా అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘె కూడా అణచివేతతో అధికారాన్ని చెలాయించాలని ప్రయత్నిస్తున్నారని జనం దుమ్మెత్తి పోత్తున్నారు. అణచివేతకు, నిర్బంధానికి తలొగ్గేదే లే అంటు లంక జనం కదం తొక్కుతున్నారు. కొత్త అధ్యక్షుడు విక్రమ సింఘేను తాము ఆమోదించలేమనీ, ఆయన రాజీనామా చేసే వరకూ వెనకడుగు వేసే ప్రశక్తే లేదని నిరసనకారులు స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/vikramasinghe-is-also-likr-rajapakse-39-140284.html





