విజయసాయి మరో బాల్ థాక్రే అనుకుంటున్నారా?
Publish Date:Sep 8, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఆయనను మరింత ఏకాకిగా మార్చేలా ఉన్నాయి. సోమవారం (సెప్టెంబర్ 7) ఆయన ఆర్భాటంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కొత్త పార్టీ ప్రకటన చేశారు. అయితే పార్టీ పేరు, జెండా, అజెండాలను రివీల్ చేయలేదు. అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది. విజయకొత్త పార్టీ ప్రకటన చేసి కూడా పార్టీ పేరు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. ఇక ఆయన అనుసరిస్తున్న విధానాలు, పార్టీ లక్ష్యాలపై ఆయనలోనే అయోమయం, గందరగోళం ఉందని ఆయన మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను బట్టి అవగతమౌతున్నది. పార్టీ స్థాపిస్తారట కానీ, తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదంటున్నారు విజయసాయిరెడ్డి. అసలు రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ, జనసేన వంటి పార్టీలు క్రియాశీలంగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు చేసి.. తాను కాదు మరో నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతాను.. తాను వెనుకుండి సలహాలూ, సూచనలూ ఇస్తాననడం ఆయనలోని గందరగోళానికి అద్దంపడుతున్నట్లుగా ఉంది. సీఎం అభ్యర్థి స్థాయి నాయకుడు పార్టీలోకి వచ్చి తన నాయకత్వంలో పని చేసేంత సీన్ విజయసాయిరెడ్డికి ఉందా అన్న అనుమానాలు రాజకీయపరిశీలకులలో వ్యక్తం అవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో బలంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, వైసీపీలను కాదని మరీ.. బలమైన నేత ఎవరైనా.. విజయసాయి నాయకత్వంలో పని చేయడానికి ముందుకు వస్తారా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. ఆయన మాటలను బట్టి చూస్తే.. ప్రజాదరణ, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న బలమైన నేతను ముందు పెట్టి తాను వెనకుండి చక్రం తిప్పాలన్నది విజయసాయి ఆలోచనగా కనిపిస్తోంది. తనను తాను శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే తో పోల్చుకోవడం కూడా విస్తుగొలుపుతోంది. బాల్ థాకరే మహారాష్ట్రలో హిందుత్వ ఐకాన్, అలాగే.. మరాఠా సెంటిమెంట్ ఆయనకు అప్పట్లో పెద్ద బలంగా నిలిచింది. కానీ ఇక్కడ అంటే ఏపీలో అటువంటి పరిస్థితి లేదు. అన్నిటికీ మించి జగన్ అక్రమాస్తుల కేసు సహా పలు కేసులలోఆయన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులు ముందు ముందు విజయసాయి పొలిటికల్ జర్నీకి అడ్డంకులుగా మారే అవకాశాలనూ కొట్టిపారేయలేము. ఈ విషయాలన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని ఆలోచిస్తే.. ఇంకా నామకరణం కూడా జరగని విజయసాయి కొత్త పార్టీ ప్రయాణం నల్లేరు మీద బండి నడకగా మారే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు. [Vijayasai Reddy Bal Thackeray Strategy, New Political Party, AP Politics, YCP, Telugudesham, Janasena, Ap Politics, Telugu One]
http://www.teluguone.com/news/content/vijayasai-reddy-bal-thackeray--strategy-25-230934.html




