అండమాన్ లో అంతులేని చమురు నిక్షేపాలు
Publish Date:Jun 19, 2025

Advertisement
పెట్రోల్ సమస్యకు పెర్మనెంట్ సొల్యూషన్
కలిసోచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాని సామెత.. ఇప్పుడు మన దేశానికి అలాంటి కలిసొచ్చే రోజులు వచ్చాయా? నడిచొచ్చే కొడుకు పుట్టే రోజు వచ్చేసిందా? అంటే అవుననే అంటున్నారు కేంద్ర పెట్రోలియం ,సహజ వనరుల శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పూరీ. అవును అండమాన్ ద్వీప సముద్ర గర్భంలో బయట పడిన చమురు నిక్షేపాలు మన దేశ చమురు కరవును శాశ్వతంగా తొలిగించేంత పెద్ద మొత్తంలో ఉన్నాయని కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారు. నీవినీఎరుగని రీతిలో, రెండు వేల సంవత్సరాల పాటు, మన దేశ చమురు అవసరాలను తీర్చగల స్థాయిలో అడమాన్ లో చమురు నిక్షేపాలు ఉన్నట్టు చెపుతున్నారు.
నిజానికి, అండమాన్ ద్వీపంలో చమురు నిక్షేపాలున్న విషయం ఇప్పడు కాదు.. ఎప్పుడో, 1970- 80 దశకంలో అంటే ఇంచు మించుగా అర్థ శతాబ్దికి (50 ఏళ్ల) పూర్వమే గుర్తించారు. అయితే అప్పట్లో అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చి పోయిన ప్రభుత్వాలు కానీ ముందడుగు వేసే సాహసం చేయలేదు. బహుశా.. అప్పటికి ఉన్న సాంకేతిక, ఆర్ధిక పరిమితుల దృష్ట్యా.. అప్పటి ప్రభుత్వాలు ముందడుగు వేసి ఉండక పోవచ్చును. అత్యంత సంక్లిష్ట వాతావరణ, భౌగోళిక పరిస్థితుల నడుమ.. అది కూడా సముద్ర గర్భం లోతుల్లోకి వెళ్లి చమురు నిక్షేపాలను వెలికితీయడం అప్పుడే కాదు, ఇప్పటికీ కొంత వరకు అసాధ్యమే. అందుకే అప్పటి ప్రభుత్వాలు సాహసించి ముందడుగు వేయలేక పోయాయి కావచ్చును.
సరే. అదంతా గతం. ప్రస్తుతం పరిస్థితులలో మార్పు వచ్చింది. ముఖ్యంగా.. గడచిన 11 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన మొదలు అంతరిక్ష పరిశోధనల వరకూ ప్రతి రంగంలోనూ, సాహసం చేయరా ...డింభకా టైపులో.. సాహసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. అందుకు తోడు ఈ రోజున ఆయిల్ రిఫైనరీలో మన దేశం, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో చాలా వేగంగా ముందుకు సాగుతోంది. నిజానికి, ఆయిల్ రిఫైనరీ రంగంలో మన దేశం చమురుతో తలలు పండిన దేశాలకంటే చాలా ముందు వరసలో వుందనీ.. అందుకే మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
అవును.. ఏక కాలంలో 26 వేల బోర్లు వేసి, చమురు నిక్షేపాలను అన్వేషించడం అంటే మాములు విషయం కాదు. అయినా.. మోదీ ప్రభుత్వం సాహసించి ముందుగువేసింది. అదృష్టం ఎగసి పడింది. ఈ విషయాన్ని, కేంద్ర చమురు, సహజ వాయువుల శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీ, ఒక అంగ్ల టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
అయితే.. ఇల్లు అలకగానే పండగ రాదు, చమురు నిక్షేపాలు కనుగొన్నంత మాత్రాన, పెట్రోల్, డీజీల్ పెట్రోల్ బంకుల్లోకి, మన వాహనాల్లోకి వచ్చేయదు. ప్రభుత్వ ప్రైవేటు రంగ సహకారంతో, ఎంతో మెటిక్యులస్ గా ప్లాన్ చేస్తేనే కానీ పని జరగదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైన, ఓఎన్జీసీ, భారత్, హెచ్ పీ, ఇండియన్ ఆయిల్ కంపెనీలు చమురు తవ్వకాలు, నిర్వహణ బాధ్యతలను చూస్తున్నాయి. మరోవంక రిలయన్స్, నయారా వంటి ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు చమురు రంగంలో చురుగ్గా పని చేస్తున్నాయి. సో.. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతోనే అండమాన్ ఆపరేషన్స్ చేపట్టాలని ప్రభుత్వం బావిస్తునట్లు మంత్రి చూచాయగా చెప్పారు.
అదలా ఉంచితే.. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగి, అండమాన్ సముద్ర గర్భంలో దాగున్న సుమారు 1,160 బిలియన్ బ్యారెళ్ళ చమురు నిక్షేపాలను వెలికి తీయగలిగితే.. అత్యధిక చమురు నిల్వలు ఉన్న తొలి 20 దేశాల్లో మన దేశం స్థానం సముచిత స్థానం సంపాదించుకుంటుంది. అంతే కాదు.. ప్రస్తుత చమురు దిగుమతులు 85 శాతం మేర తగ్గి, రోజుకు కేవలం 15 శాతం మాత్రమే ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయవలసి వస్తుంది. అదే జరిగితే.. చమురు దిగిమతి వ్యయం ప్రస్తుత రూ. 11 లక్ష కోట్ల నుంచి కేవలం రూ.1.75 లక్షల కోట్లకు దిగివస్తుంది. అంటే ఏటా.. నికరంగా . రూ. 9 లక్షల కోట్లు ఆదా అవుతాయి.. అంతే కాదు.. మనం మన చమురు ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. కలిసొచ్చే రోజొస్తే .. నడిచొచ్చే బిడ్డడు పుడతాడంటే ఇదే కదా.
http://www.teluguone.com/news/content/vast-oil-deposits-in-andaman-39-200322.html












