పిఠాపురం తెలుగుదేశం ఇన్చార్జ్గా వర్మ తొలగింపు
Publish Date:May 7, 2026
Advertisement
ఏపీ రాజకీయాల్లో కీలక నియోజకవర్గాల్లో ఒకటైన పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కీలక మార్పులు చేసింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ (ఎస్వీఎస్ఎన్ వర్మ)ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. త్వరలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ కమిటీ నియామకంపై కసరత్తును పార్టీ హై కమాండ్ ప్రారంభించింది. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. కూటమి రాజకీయాల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలుగుదేశం హైకమాండ్.. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు తగ్గకుండా ఉండేందుకే ఈ మార్పులు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల నియోజకవర్గ పరిధిలో జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య ప్రొటోకాల్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఇన్చార్జ్గా తనను తప్పించడంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పలురకాల సమీకరణాలతో టీడీపీలో మార్పులు జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు. ఫైనల్గా పార్టీ బాగుండేలా హై కమాండ్ చూడాలని అన్నారు. మంత్రి నారా లోకేశ్ తనతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటును నిర్ణయించారన్న వర్మ.. టీడీపీలో నాయకులే ఇక్కడ నిర్వహణ చేస్తారని.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో పోటీ నుంచి అయిష్టంగానే తప్పుకున్న వర్మ.. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారు. అప్పట్లో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని తెలుగుదేశం అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇంత వరకు వర్మకు ఎలాంటి పదవి దక్కకపోవడంతో ఆయన వర్గం అసంతృప్తితో ఉంది. ఆ క్రమంలో పిఠాపురంలో ఎప్పటికప్పుడు కూటమి పార్టీల మధ్య విభేదాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వర్మను ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించడంతో ఈ పరిణామం ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
http://www.teluguone.com/news/content/varma-removed-as-pithapuram-tdp-incharge-39-219146.html





