చెంగల తరువాత వంశీయేనా?
Publish Date:Sep 4, 2012
Advertisement
తెలుగుదేశం పార్టీ ఇటీవల తన విధానాలు మార్చుకున్నా నేతల మనస్సు మార్చలేకపోతోంది. అలానే జనంలోనూ తెలుగుదేశం పార్టీ లేదన్న విషయాన్ని ఆ పార్టీ నేతలే నొక్కిచెబుతున్నారు. ఎన్ని బీసి డిక్లరేషన్లు ప్రకటించినా పెద్దగా ప్రయోజనం ఉండబోదని కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకత్వం మారితే కానీ, మార్పు రాని పరిస్థితి నెలకొందని కొందరు సీనియర్లు గట్టిగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి వలసలను ఆపటం కష్టమవుతోంది. విశాఖ జిల్లాలో అతిచిన్న నియోజకవర్గమైన పాయకరావుపేటకు చెందిన చెంగల వెంకట్రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల ఉపఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన వెంకట్రావు తాజాగా ఎదుర్కొన్న అవమానాలను దిగమింగుకోలేక రాజీనామా చేశానన్నారు. అక్టోబర్ 15న తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీ తీర్థం తీసుకుంటానన్నారు. చెంగల వెంకట్రావు నందమూరి కుటుంబంతో మంచి అనుబంధమున్న తెలుగుదేశం నాయకుడు. ఒకసారి ఈయన ఆత్మహత్య చేసుకునేంత దారుణమైన పరిస్థితుల్లో నందమూరి కుటుంబమే ఈయన్ని ఆదుకుంది. అంతేకాకుండా బాలకృష్ణకు వెంకట్రావుకు మంచి సంబంధాలున్నాయి. అసలు ఆ కుటుంబాన్ని సంప్రదించకుండా ఏ పని చేయని వెంకట్రావు ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత జీర్ణించుకోలేకపోతున్నారు. వెంకట్రావును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంతగా ఆదరించారంటే ఇక పాయకరావుపేటలో తెలుగుదేశం పార్టీ అంటే చెంగల అన్నంతగా ప్రాధాన్యత కల్పించారు. అలానే జిల్లా స్థాయి పార్టీ కార్యక్రమాల్లో వెంకట్రావు లేకపోతే బాబు ఊరుకునేవారు కాదని ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. అటువంటిది చెంగల పార్టీ మార్పు నిర్ణయం తీసుకోవటం విశాఖజిల్లాలో తెలుగుదేశం పార్టీకి చాలా పెద్దదెబ్బ తగులుతుందని పార్టీవర్గాలు గట్టిగా భావిస్తున్నాయి. ఈ స్థానంలో ఇప్పటి వరకూ కాంగ్రెస్ తరుపున బాబురావు పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ తరుపున చెంగల ప్రత్యర్థిగా ఉండేవారు. ఈ ఉపఎన్నికల్లోనే బాబురావు వై.కా.పా. తరుపున పోటీ చేసి మంచి మెజార్టీ సాధించారు. దీంతో ఈయన విజయం కూడా ప్రత్యర్థిగా పోటీపడుతూ వచ్చిన చెంగల మనస్సు మార్చటానికి ఉపయోగపడిరదని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాబురావు ఎన్నికల ఫలితాలే వెంకట్రావును ఆలోచింపజేసిందని ఆయన సన్నిహితులు కూడా విశ్లేషకుల అభిప్రాయాన్ని బలపరుస్తున్నారు. వైకాపాకు పునాది గట్టిదని నమ్మినందునే వెంకట్రావు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని రాజకీయపరిశీలకులు అంటున్నారు.
ఏమైనా నందమూరి కుటుంబంతో సంబంధం ఉన్న చెంగల పార్టీ నుంచి బయటకువెళ్లేందుకు నిర్ణయం తీసుకోవటంతో గాలి మళ్లీ విజవాడ తెలుగుదేశం పార్టీవైపు మళ్లింది. చెంగల తరువాత నందమూరి కుటుంబంతో సన్నిహితంగా ఉండే కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆల్రెడీ వైకాపాలో కొనసాగుతున్నారు. ఈయన తరువాత తెలుగుదేశం పార్టీ విజయవాడ సిటీ కన్వీనర్ వల్లభనేని వంశీ కూడా వీలైనంత త్వరలో పార్టీ మారతారని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. నందమూరి కుటుంబంతో సన్నిహితంగా మెలిగే మూడో నేత వల్లభనేని వంశీ కావటంతో ఈయన ఖచ్చితంగా పార్టీ వదిలేస్తారని బెట్టింగులు జరుగుతున్నాయి. ఇప్పటికే కృష్ణాజిల్లా వారు, విశాఖ జిల్లా వారితో బస్తీమేసవాల్ అంటున్నారట. వంశీ కూడా పార్టీ మారకపోతే చూడండని కొందరు, సమస్యే లేదని మరికొందరు ఈ బెట్టింగుల్లో పాల్గొంటున్నారు.
http://www.teluguone.com/news/content/vallabhaneni-vamsi-mohan-tdp-31-17134.html





