తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు
Publish Date:Jan 9, 2025
Advertisement
హిందువులకు అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికే అంతా ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం (జనవరి 10) తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనంతో ఆ దేవ దేవుడిని దర్శించుంకుటున్నారు. తిరుమల లో కూడా తెల్లవారు జాముకు ముందే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. శుక్రవారం (జనవరి 10) నుంచి ఈ నెల 19వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను అధికారులు రద్దు చేశారు. ఈ 10 రోజుల పాటు కేవలం దర్శనం టికెట్, టోకెన్స్ కలిగిన భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం నాలుగున్నర గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించారు. ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ద్వారా సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీదేవి,భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రధంపై ఆలయ తిరు విధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు.11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో ఉత్సవ మూర్తులు భక్తులకు దర్శనం ఇస్తారు. ఇలా ఉండగా వైకుంఠ ద్వారా దర్శనం కోసం ప్రముఖులకు 4250 పాసులని మంజూరు చేశారు. లఘు దర్శనంలో ప్రముఖులకు స్వామి వారీ దర్శనం కల్పిస్తున్నారు. కాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నవారిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాందేవ్ బాబా, మంత్రులు అనిత, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, సవిత, సంధ్యారాణి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, చాముండేశ్వరి నాథ్, పుల్లెల గోపీచంద్ తదితరులు ఉన్నారు.
http://www.teluguone.com/news/content/vaikuntha-dwara-darshanalu-started-in-tirumala-25-191112.html





