ఆక్సిజన్ కోసం రాగిచెట్టు కింద కూర్చోండి! కరోనా రోగులపై యూపీ పోలీసుల క్రూరత్వం
Publish Date:Apr 30, 2021
Advertisement
కరోనా విలయానికి దేశం అల్లాడిపోతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ బాటలోనే ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. వారం రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ అందక రోగులు నరకయాతన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలబెట్టాలంటూ హాస్పిటల్ కు వస్తున్న కరోనా రోగుల పట్ల యూపీ పోలీసులు క్రూరంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆక్సిజన్ అందక చాలా మంది కరోనా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు ఆక్సిజన్ సిలిండర్ల పట్టుకుని ప్లాంట్ల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఆక్సిజన్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఇంతటి తీవ్రమైన పరిస్థితుల్లో పోలీసులు కరోనా పేషెంట్ బంధువులకు వింత పరిష్కారాలు చెబుతున్నారు. ‘రావి చెట్టు కింద కూర్చోబెట్టండి.. ఆక్సిజన్ దానంతట అదే పెరుగుతుంది’’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో చాలా మంది పేషెంట్లకు ఇలాంటి పరిస్థితులే ఎదరవుతున్నాయి. కరోనా సోకిన తన తల్లిని ఆసుపత్రికి తీసుకు వెళితే ఆక్సిజన్ సిలిండర్లుగానీ, క్యాన్లుగానీ, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు గానీ లేవన్నారని, ఆక్సిజన్ కోసం అక్కడి రావి చెట్టు కింద కూర్చోపెట్టాలంటూ పోలీసులు సూచించారని ఓ కరోనా పేషెంట్ కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ పోలీసులు ఇదే విషయం చెబుతున్నారని మరో వ్యక్తి అన్నారు. కరోనా పేషెంట్లు ఇంట్లోనే ఉండాలంటూ చెబుతున్నారని, కానీ, ఇంట్లోనూ ఆక్సిజన్ అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఓ రోగి తాలూకు బంధువు కన్నీరుమున్నీరయ్యాడు. ఆసుపత్రులకు వెళితే అక్కడ బెడ్లన్నీ ఫుల్ అయిపోయాయని అన్నాడు. తన తండ్రికి ఆక్సిజన్ కోసం ఎన్ని ప్లాంట్లు తిరిగినా దొరకట్లేదన్నాడు. ప్లాంట్ దగ్గరకు వస్తే మాట్లాడేవారే ఉండరని వాపోయాడు. ఒక్కసారి మాట్లాడే చాన్స్ ఇవ్వాలని కోరినా.. పోలీసులు తరిమికొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు కరోనా రోగి బంధువు.
http://www.teluguone.com/news/content/up-police-hate-behaviour-on-covid-patients-39-114587.html





