ఇక టీటీడీ పుస్తక ప్రసాదం!
Publish Date:Jul 8, 2025
Advertisement
దేశవ్యాప్తంగా అందరికీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని అర్థమయ్యేలా తెలియజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందు కోసం పుస్తక ప్రచురణకు శ్రీకారం చుట్టింది. శ్రీవారి మహాత్మ్యం, వైభవం అతి సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా చిన్న సైజులో పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. మతమార్పిడులను అరికట్టడం, హిందూ ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడం లక్ష్యంగా ఇందుకు సంకల్పించింది. శ్రీ వెంకటేశ్వర వైభవం, విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, లలితా సహస్రనామం, శివ స్తోత్రం, భగవద్గీత, మహనీయుల చరిత్ర, తదితర హిందూ దేవుళ్లకు సంబంధించిన పురాణాలు తదితర అంశాలతో సంబంధించిన ధార్మిక పుస్తకాలను ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా దళితవాడల్లో ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగం ద్వారా ఈ ధార్మిక పుస్తకాలను చిన్న సైజులో భక్తులు చేతిలో ఇమిడే విధంగా ముద్రించి దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు తిరుమల తిరుపతిలలో కూడా భక్తులకు వీటిని శ్రీవారి పుస్తక ప్రసాదంగా అందజేయాలని నిర్ణయించినట్లు బీఆర్నాయుడు తెలిపారు. అలాగే తిరుమలలో శ్రీవారికి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలో వేచి ఉండే భక్తులకు వీటిని అందజేస్తామన్నారు.
http://www.teluguone.com/news/content/ttd-to-distribute-books-for-hindu-dharma-pracharam-39-201487.html





