దేవుడు సంపాదిస్తేనే సేవకులకు జీతాలా? టిటిడి లీలలు!
Publish Date:May 12, 2020

Advertisement
పాలకులు తలచుకుంటే విద్య, వైద్యం మాత్రమే కాదు. భక్తి కూడా మార్కెట్ వస్తువు అయిపోయింది. దేవుడ్ని కూడా వ్యాపార వస్తువుగా చేసేశారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వుండాల్సిన మత సంస్థల్ని ఆదాయవనరుగా చూడడం ప్రారంభించారు. అందుకే వ్యాపార భాష మాట్లాడుతూ ఆదాయం తగ్గింది కాబట్టి టిటిడి ఉద్యోగుల జీతాల్లో కోత విధించామంటున్నారు.
కరోనా వైరస్ కారణంగా టీటీడీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందట. దాంతో, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కష్టమయ్యే పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా టీటీడీ ఉద్యోగులకూ వేతనాల కోత అమలవుతోంది. ఇది 'కోత' కాదు, 'సర్దుబాటు' అని ప్రభుత్వం చెబుతున్నా, జీతాల కోతతో ఉద్యోగులు విలవిల్లాడుతున్నారు.
టీటీడీకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? మరి తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన టన్నుల కొద్దీ బంగారం, వేల కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. మరి, అలాంటి టీటీడీ సుమారు 100 కోట్లు వెచ్చించి, ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు ఇవ్వలేదా.?
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, టీటీడీలో చాలా మార్పులొచ్చాయి. అద్దె గదుల రేట్లు, లడ్డూ రేటు పెరిగాయి. టీటీడీ అంటే, భక్తులకి సౌకర్యాలు కల్పించడం కాదు, వీఐపీల సేవలో తరించేదేనన్న అభిప్రాయం రోజురోజుకీ బలపడిపోతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. భక్తులకు అవసరమైన మేర, తక్కువ ధరలో లడ్డూ ప్రసాదం అందించలేని ఆర్థిక సమస్యల్లో టీటీడీ వుందా.?
తిరుమల తిరుపతి దేవస్థానాలకు వివిధ రూపాల్లో ఆదాయం లభిస్తుంది. అందులో హుండీ ద్వారా వచ్చే దానితో పాటుగా దర్శనాల టికెట్లు, లడ్డూ ప్రసాదం, వసతి గదులు, కల్యాణ కట్ట సహా పలు మార్గాల్లో ఆదాయం వస్తుంది. కరోనా దెబ్బతో తిరుమల పూర్తిగా ఖాళీ కావడంతో ఆదాయ మార్గాలన్నీ నిలిచిపోయాయి.
టీటీడీ అధికారిక లెక్కల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో హుండీ ద్వారా రూ. 1231 కోట్ల ఆదాయం లభించింది. అంటే నెలకు వంద కోట్లకు పైగా ఆదాయం లెక్కన సగటున రోజుకి రూ. 3 కోట్లకు తగ్గకుండా ఆదాయం వస్తుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం అంటే, అది రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రం.. అనే వాదన ఎప్పటినుంచో వుంది. అందులో వాస్తవం లేకపోలేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ, తమకు అత్యంత సన్నిహితులైనవారిని టీటీడీకి సంబంధించి కీలక పదవుల్లో నియమించడం చూస్తూనే వున్నాం. కేంద్ర మంత్రి పోస్ట్‌తో సమానంగా టీటీడీ ఛైర్మన్ పదవికి 'గిరాకీ' వుందంటే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
http://www.teluguone.com/news/content/ttd-struggles-to-pay-salaries-39-99054.html












