ఆంజనేయుడు మావాడే? కర్ణాటకతో టీటీడీ చర్చ..
Publish Date:May 27, 2021
Advertisement
ఆంజనేయుడు ఎవరివాడు? మారుతి జన్మస్థలం ఏదీ? ఎంతో కాలంగా వివాదంలో ఉన్న ఈ అంశాన్ని తేల్చేందుకు తిరుమల తిరుపతి దేవ స్థానం.. కర్ణాటక సర్కార్ తో తేల్చుకోబోతోంది. హనుమంతుడి జన్మస్థానం ఏదో తేల్చేందుకు ఇరు పక్షాలు తిరుపతిలో చర్చకు సిద్ధమయ్యాయి. తిరుమల సంస్కృత విద్యాపీఠంలో జరగనున్న భేటీలో.. రెండు రాష్ట్రాలకు చెందిన పండితులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇరు పక్షాలూ.. తమ వద్ద ఉన్న ఆధారాలను బయట పెట్టనున్నాయి. దీంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. హనుమంతుడు ఎవరి వాడు అన్న విషయం ఇప్పుడైనా తేలుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. మారుతి జన్మస్థలంపై ఎంతో కాలంగా వివాదం తేలకుండా ఉంది. ఆంజనేయుడు ఆంధ్రప్రదేశ్ లోనే జన్మించాడంటూ శ్రీరామనవమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తిరుమల ఏడు కొండల్లోని అంజనాద్రి హనుమంతుడి జన్మస్థానమని టీటీడీ స్పష్టం చేసింది. అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో ఆంజనేయుడు జన్మించాడని ప్రకటించింది. టీటీడీ ప్రకటనపై కర్నాటకు నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మారుతి తమ ప్రాంతానికి చెందిన వాడని దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయని కర్నాటక తెలిపింది. కర్నాటక రాష్ట్రంలోని హంపి సమీపంలో ఉన్న ఆంజనేయాద్రి కొండ హనుమంతుడి జన్మస్థలమని ప్రకటించింది. ఈ విషయం రామాయణంలోనూ స్పష్టంగా ఉందని కర్నాటక సర్కారు చెప్పింది. ఆ తర్వాత కర్నాటక రాష్ట్రానికి చెందిన హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీవ్రంగా స్పందిస్తూ.. ఘాటు లేఖ కూడా టీటీడీకి రాసింది. బహిరంగ చర్చకు రావాలని కోరింది. కర్నాటక రాష్ట్రానికి చెందిన హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లేఖకు టీటీడీ కూడా బదులిచ్చింది. ఆంజనేయుడు జన్మస్థానానికి సంబంధించి తమ దగ్గర అన్ని అధారాలు ఉన్నాయని తెలిపింది. బహిరంగ చర్చకు తాము సిద్ధమని ప్రకటించింది. ఆ నేపథ్యంలో హనుమంతుడి జన్మస్థానంపై తేల్చేందుకు చర్చకు సిద్ధమయ్యారు.
http://www.teluguone.com/news/content/ttd-karnataka-discussion-on-hanuman-birthplace-39-116334.html





