భూమన వర్సెస్ బీఆర్ నాయుడు!
Publish Date:Mar 1, 2026
Advertisement
టీటీడీ పాలక మండలి చైర్మన్ ని దింపడానికి వైసీపీకి ఎందుకంత ఆతృత? ఎందుకంత ఉత్సుకత? పదే పదే రాజీనామా చేయమని ఎందుకు చేస్తారు? తాజాగా చైర్మన్ బీఆర్ నాయుడుపై ఏఐ వీడియోలతోనూ చేసిన ప్రయోగంలో మతలబు ఏంటి? అసలింతకీ వైసీపీ చేసిన ఏఐ జనరేటెడ్ వీడియోలలో ఎముంది? టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్టు ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, బీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు.. కొన్ని ఉదాహరణలు ఏకరవు పెట్టారు. అందులో భాగంగా చూస్తే గతంలో టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేసిన వారంతా కూడా రిజైన్ చేశారనీ.. మీరు కూడా అలా చేయక తప్పదనీ భూమన అన్నారు. తిరుమల కొండ మీద గాలి కూడా పవిత్రంగా ఉండాల్సిందే అని పీవీ నరసింహరావు అన్నట్టు.. ఇక్కడొక శాసనం ఉందంటారు భూమన. ఎవరైతే అనైతిక కార్యకలాపాలకు పాల్పడతారో వారు తమకు తాము తొలగిపోవల్సిందే నన్నారు. అందుకు ఎస్వీబీసీ చైర్మన్ గా పృధ్వి ఉదంతాన్ని ఉదహరించారు. పృధ్వి ఆడియో లీక్ కాగానే జగన్ ఆయన్ను తప్పించారని గుర్తు చేశారు. ఆ తర్వాత సిర్రి అప్పన్ అనే అర్చకుడు అనైతికంగా వ్యవహరిస్తే వెంటనే తొలగించారు. ఇంకా చదలవాడ, పుట్టా వంటి వారు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనే టీటీడీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ ఉదాహరణలన్నీ చెబుతూ.. బీఆర్ నాయుడు రిజైన్ చేయాలనీ, లేకుంటే చంద్రబాబు ఆయనను తొలగించాలనీ భూమన డిమాండ్ చేశారు. అయితే భూమనకు గట్టికౌంటర్ ఇచ్చారు బీఆర్ నాయుడు. వీరి బండారమంతా తానెక్కడ బయట పెడతానో అన్న భయంతోనే భూమన ఇదంతా చేస్తున్నట్లు ఆరోపించిన బీఆర్ నాయుడు... వీరు గతంలో టీటీడీ కేంద్రంగా చేసిన దురాగతాలన్నిటికీ సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయన్నారు. అవన్నీ త్వరలోనే బయటకొస్తాయని హెచ్చరించారు బీఆర్ నాయుడు. తానింత వరకూ ఆగుతూ రావడానికి గల కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం వల్లే అన్నారు బీఆర్. భూమనలాంటి వారు దిగిపోమంటే దిగిపోవడానికి కాదు తానున్నదన్నారు. తిరుమల ఉన్న ప్రాంతం నుంచే తాను వచ్చాననీ.. అదే భూమన తిరుపతికి పక్క జిల్లా నుంచి వచ్చినట్టు చెప్పారు బీఆర్ నాయుడు. అసలా వీడియోలో కనిపిస్తున్న మహిళ కుటుంబంతో తమకు ఎప్పటి నుంచో కుటుంబ సంబంధ బాంధవ్యాలున్నట్టు చెప్పారాయన. అంతే కాదు అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జనరేటెడ్ వీడియో అన్నారు. ఇందులో తన పరువు తీసే కుట్ర దాగి ఉందన్న బీఆర్ నాయుడు.. తనతో పాటు టీటీడీ ప్రతిష్ట మంటగలిపే యత్నం ఉందని ఆరోపించారు. అందుకే తాను సైబర్ క్రైమ్ ని ఆశ్రయించానన్నారు. వీరిపై వంద కోట్ల పరువు నష్టం దావా వేసి.. జీవితాంతం ఈ బీఆర్ నాయుడు పేరు గుర్తుండిపోయేలా చేస్తానన్నారు.
http://www.teluguone.com/news/content/ttd-chairman-versus-formerchairman-25-214850.html





