భారత్ పై 25 శాతం సుంకాల మోత.. ఎవరికి లాభం ఎవరికి నష్టం?
Publish Date:Aug 1, 2025
Advertisement
ట్రంప్ భారత్ అంటేనే మండి పడుతున్నారు. మరీ ముఖ్యంగా మోడీ అంటేనే ఆయనకు అస్సలు గిట్టడ్డం లేదు. ఒక సమయంలో ట్రంప్ విజయం కోసం ప్రచారం చేసిన మోడీ.. ట్రంప్ రెండో సారి గెలిచాక తన తప్పిపోయిన సొంత సోదరుడ్ని కలిసినంత సంబరంగా ఫీలయ్యారు. అయినా కూడా మోడీ పొడ ట్రంప్ కు అస్సలు నచ్చడం లేదు. ఏమైందో తెలీదుగానీ.. భారత్ పై పాతిక శాతం టారీఫ్ లతో విరుచుకుపడ్డం మాత్రమే కాదు.. భారతీయులంటేనే ఉద్యోగాలివ్వదని అంటున్నారు ట్రంప్. పాకిస్థాన్ లో ప్రస్తుతం పెట్రోలు తవ్వకాల్లో పెట్టుబడి పెట్టింది అమెరికా. వచ్చే రోజుల్లో భారత్ కే ఇంధనం అమ్మొచ్చని అంటారు ట్రంప్. మోడీ పాకిస్థాన్ పాలసీని ఫాలో కావడం లేదు. కొత్త రూట్ మ్యాప్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా, చైనాలతో పాటు దీటైన దేశంగా అన్ని రంగాల్లో రాణించేదిశగా దూసుకెడుతోంది. ఆయుధ సంపత్తి సైతం పెంచుకుంటోంది. గ్లోబ్ సౌత్ కి నాయకత్వం వహించడానికి మోడీ మొన్న చాలా దేశాల్లో పర్యటించారు. అంతే కాదు.. బ్రిక్స్ ద్వారా గ్గోబ్ సౌత్ లీడర్షిప్ కి ప్లానేస్తున్నారు. దీంతో ట్రంప్ కి మోడీ అంటే అస్సలు పడడం లేదు అంటున్నారు విశ్లేషకులు. అవసరమైతే చైనా, ఆఫ్రికా దేశాలతో కొత్త జట్టు కట్టడానికి కూడా సిద్ధ పడుతున్నారు మోడీ. దీంతో మోడీ ని చూసి చికాకు పడుతోంది ట్రంప్ నాయకత్వంలోని అమెరికా. నిజమే పాతిక శాతం సుంకాల ద్వారా భారత్ లో కొన్ని రంగాలకు తీవ్రమైన ఇబ్బంది కలగొచ్చు. ఇందులో పాడి, వ్యవసాయ రైతులకు, ఎన్నో చిన్న మధ్యతరహా ఎంఎస్ఎంఈలకు నష్టం వాటిల్ల వచ్చు. అంతే కాదు.. ఎంపీ లావు పార్లమెంటులో చెప్పినట్టు.. ఏపీ ఆక్వాకు భారీ నష్టం కలగొచ్చు. ఎందుకంటే మన సముద్ర ఉత్పత్తుల్లో 33 శాతం అమెరికాకు ఎగుమతి అవుతాయి. ఆ మాటకొస్తే మొన్నటి మామిడి రైతుల కడగండ్లకు కారణం కూడా ఇలాంటి పరిస్థితులే. కొందరేమంటారంటే మోడీ ఒక్క మాట మాట్లాడితే ఇలాంటి సమస్యలు సమసిపోతాయి. పాతిక శాతం కాస్తా 15 నుంచి 20 శాతానికి దిగి వస్తుందంటారు. బేసిగ్గా ఇప్పటి వరకూ ఇరు పక్షాలు వచ్చే కొన్నేళ్లలో ద్వైపాక్షిక వ్యాపారం 500 బిలియన్ డాలర్లకు పెంచాలన్న యోచనలో ఉన్నాయి. ఈ క్రమంలో సానుకూలంగా స్పందిస్తే సరిపోతుంది. కానీ, మోడీ ఇందుకు సమ్మతంగా ఉన్నట్టు లేరు. పైపెచ్చు అమెరికా కన్నా చైనాను నమ్మడమే మేలని భావిస్తున్నారు. ఈ మధ్య చైనా టూరిస్టులకు వీసా అనుమతులివ్వడం ఇందులో భాగంగానే భావిస్తున్నారు. ఇక ఫైనల్ గా రష్యాను వదులుకోవడం. ఎందుకంటే ప్రపంచమంతా ఉక్రెయిన్ లోన మారణకాండ ఆపాలని ఎదురు చూస్తుంటే.. మోడీ, భారత్ మాత్రం రష్యా నుంచి చమురుతో సహా ఎన్నో ఆయుధ సహాయ సహకారాలను పొందుతున్నారని ఆరోపిస్తారు ట్రంప్. నిజమే ఇదే రష్యా నుంచి భారత్ చమురు కొనకుంటే జరిగే విపత్తు ప్రపంచ వ్యాప్తంగా ఆయల్ బ్యారళ్ల ధరలు అమాంతం పెరుగుతాయి. మొన్న ఆపరేషన్ సిందూర్ లో రష్యాన్ ఎస్ 400 ద్వారా మనమెంతో విజయం సాధించాం. అదే అమెరికాను దాని ఎఫ్ 16లను నమ్ముకున్న పాక్ పరిస్థితి ఎలా ఉందో చూశాం. చైనా ఇచ్చిన పీఎల్ 15లు, ఇతర వాయు రక్షణ వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితులు. మనం కూడా అలాంటి ఫలితాలనే పొందడానికి సిద్ధంగా లేమంటారు మోడీ ఆయన పరివారం. కాబట్టి ట్రంప్ ని ఫాలో కావడం అయ్యే పని కాదని తెగేసి చెబుతారు. ఒక వేళ మోడీ మన వాళ్లకు ఉద్యోగాలివ్వొద్దంటే నష్టపోయేది అమెరికాయే. కారణం మన మేధస్సు అక్కడ ట్రిలియన్ డాలర్ల వృద్ధి చూపుతోంది. తద్వారా అమెరికాకు ఎంతో మేలు జరుగుతోంది. ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఆ మాటకొస్తే మస్క్ ని కూడా ఇలాగే దూరం చేసుకుంటున్నారు ట్రంప్. ఆయన వల్ల ఎంతో లబ్ధి చేకూరుతున్నా.. కావాలని మస్క్ ఆదాయ వనరులను గండి కొట్టేలా బిగ్ బిల్ వంటి బిల్లులు పాస్ చేయిస్తున్నారు. దీని వల్ల అంతిమ నష్టం అమెరికాకే అన్నది నిపుణుల అంచనా. ఇప్పటికే పక్కనే ఉన్న మెక్సికో, కెనాడా వంటి దేశాలతో సఖ్యంగా లేక పోవడం వల్ల.. కెనడియన్లు అమెరికన్ టూర్ లు మానేస్తున్నారు. దీని వల్ల ఎంతో లాస్. ఎందుకంటే ఒక కెనడియన్ అలా యూఎస్ టూర్ వస్తే పెట్టే ఖర్చు మినిమంలో మినిమం 4 వేల డాలర్లు. ఇక మెక్సికన్లు అమెరికాలోకి చొరబడకుంటే అక్కడ పాచిపని, వంటపని, మ్యూజిక్ వంటి రంగాల్లో ఆ వెలితి తీర్చలేనిది. ఇక భారత్ ని కాదనుకుంటే స్పేస్, మెడిసిన్, లా, సాఫ్ట్ వేర్ రంగాల్లో భారీ వెలితి ఏర్పడుతుంది. చైనాను కాదనుకుంటే ఏకంగా అన్ని చౌక వస్తువులను అత్యధిక ధరలు వెచ్చించి కొనాల్సి వస్తుంది. ఎటు నుంచి ఎటు చూసినా ఈ సుంకాల వ్యూహంలో చిక్కింది అమెరికాయే తప్ప.. భారత్, చైనా కాదంటారు వాణిజ్య నిపుణులు. మరి చూడాలి.. ట్రంప్ తెంపరి తనం ఇక్కడితో ఆగుతుందా? లేక ఆయన ఒంటి చేత్తో కొత్త ప్రపంచం సృష్టిస్తారా.. కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/trum-tariff-whip-on-india-25-203250.html





