సాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి.
Publish Date:Aug 7, 2025
Advertisement
పీ4లో భాగస్వాములు కావాలంటూ పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు పిలుపు ఎంత సంపాదించినా కలగని తృప్తి మనస్పూర్తిగా సాటి మనిషికి సాయం చేసినప్పుడు కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో పారిశ్రామిక వేత్తలతో గురువారం (ఆగస్టు 7)న సమావేశమైన ఆయన పీ4లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సీఎం పిలుపుతో కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన ఇండస్ట్రియలిస్టులను చంద్రబాబు అభినందించారు. సాయం చేసేందుకు ఆసక్తి ఉన్న వారి కోసం కో స్పాన్సర్ విధానాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. గతంలో తాను పారిశ్రామిక వేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరాననీ, ఇప్పుడు పెట్టుబడులతో పాటు పేదలకు అండగా నిలవాలని కోరుతున్నట్లు చెప్పారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సంస్కరణలు చూశాను, చేశాను కానీ, పీ4 ఇస్తున్న తృప్తి మరేదీ ఇవ్వలేదన్న చంద్రబాబు.. ఆర్థిక సంస్కరణల ఫలాలను అందుకుని ఉన్నత స్థాయికి చేరిన వారు.. సమాజంలో అసమానతలను తొలగించే బాధ్యత తీసుకోవాలన్నారు. చేసే చిన్న సాయం కూడా.. పేదరికంలో ఉన్నవారికి భరోసా ఇస్తుందన్నారు. ప్రభుత్వం చేసేది సంక్షేమం అయితే మీరు చేసేది బాధ్యతాయుత సాయం అవుతుందన్నారు. కేవలం పేదలకు అండగా నిలవమని పిలుపునివ్వడంతో సరిపెట్టకుండా.. తాను కూడా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు చెప్పిన చంద్రబాబు.. ప్రభుత్వ పరంగా పేదల కోసం పింఛన్లు, తల్లికి వందనం, దీపం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పారిశ్రామిక వేత్తలు కూడా బాధ్యతాయుతంగా అసమానతలను రూపుమాపడానికి కుటుంబాలను దత్తత తీసుకోవాలని, దత్తత కుటుంబాలలో నైపుణ్యాలను పెంచడం ద్వారా వారి ఆదాయం రెట్టింపు అయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు. సీఎం పిలుపునకు పారిశ్రామిక వేత్తల నుంచి భారీ స్పందన లభించింది. ప్రకాశం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త మోహన్ రెడ్డి ఒకేసారి 729 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. అదే విధంగా పలువురు ఎన్నారైలు, స్థానిక వ్యాపారవేత్తలు వందలాది కుటుంబాలను, పాఠశాలలను దత్తత తీసుకుంటామని ముందుకు వచ్చారు.
http://www.teluguone.com/news/content/true-satisfaction-lies-in-helping-39-203754.html





