టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ భయం!
Publish Date:Feb 23, 2021
Advertisement
శాసన మండలి ఎన్నికల్లో ముఖ్యంగా విద్యావంతులు, ఉపాధ్యాయులు ఓట్లుగా ఉండే పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో గతంలోనూ తెరాస ఓడిపోయింది.అయినా,పార్టీ నాయకత్వం అంతగా పట్టించుకోలేదు. భయపడలేదు.కానీ, ఇప్పుడు, ఓటమిని ఉహించుకునే ఆందోళనకు గురవుతున్నట్లు, నాయకుల హావభావాలు, మాటతీరు స్పష్టం చేస్తోంది. ఒక విధంగా చూస్తే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల షాక్ నుంచి పార్టీ నాయకత్వం ఇంకా తేరుకున్నట్లు లేదు. అందుకే కావచ్చు, తాడును చూసి పామనుకుని భయపడినట్లు ప్రతి చిన్నా పెద్ద విషయానికీ భయపడుతోంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజక వర్గం అభ్యర్ధి ఎంపిక విషయంలో చివరి నిముషం వరకు నిర్ణయం తీసుకోలేక, చివరాఖరుకు, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టని చందాన, స్వర్గీయ పీవీ నరసింహ రావు, పలుకుబడి, ప్రతిష్టల మీద భారం వేసి అయన కుమార్తె సురభి వాణీదేవిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. పీవీ శత జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపధ్యంలో, ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావించి ముఖ్యమంత్రి ఆమెకు అవకాశం ఇచ్చారో లేక ‘గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం’ అన్నట్లుగా ఎటూ ఓడిపోయే సీటే కదా అని ఇచ్చారో ఏమో గానీ, ఆదిలోనే హంసపాదుఅన్నట్లుగా ఆమె నామినేషన్’ఘట్టంలోనే, కథ అడ్డం తిరగింది.నామినేషన్ పత్రంలో తప్పులు దొర్లిన కారణంగా, రిటర్నింగ్ అధికారులు ఆమెను వెనక్కి పంపారు. చివరకు నామినేషన్ చివరి రోజున ఆమె నామినేషన్ దాఖలు చేశారు.అయినా, ప్రతి దానికి ముహూర్తాలు, మంచీ చెడులు, చూసుకోవడానికి అలవాటుపడిన పార్టీ పెద్దలు కొందరు ఇదేదో అపశకునం అని కలత చెందుతున్నారు. పత్రాలు సక్రమంగా లేక ఆమె నామినేషన్ దాఖలు చేయలేక పోవడంతో సోషల్ మీడియాలో వ్యంగ వ్యాఖ్యలు బాగా ట్రోల్ అవుతున్నాయి. బహుభాషా కోవిదుడు,మహా మేథావి పీవీగారి కుమార్తె స్వయంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మంచి విద్యావంతురాలు. పైగా చదువుల తల్లి పేరుపెట్టుకున్న ఆమె, నామినేషన్ పత్రాలను సక్రమంగా నింపలేక పోవడం ఏమిటని విమర్శలు వినవస్తున్నాయి. అలాగే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజనక వర్గం అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ సందర్భంగానూ అపశ్రుతి చోటు చేసుకుంది. నామినేషన్ సందర్భంగా నల్లగొండ పట్టణం చేసిన భారీగా కటౌట్లు, జండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు.ఇందుకు సంబందించి బిజెపి నాయకులు పిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటామని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ హామీ ఇచ్చారు.అలాగే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన విషయాన్ని, కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగి ఫ్లెక్సీల తొలగించారు. సెంటిమెంట్’కు పెద్దపెట్ట వేసే పల్లా ... ఇతర పెద్దలు ఇది కూడా అపశకునంగానే భావిస్తున్నారు. చివరకు ఫలితాలు ఎలా వస్తాయో ... ఏమో గానీ, అధికార పార్టీలో వెనకటి ధీమా, ధైర్యం అంతగా కన్పించడం లేదు. ప్రత్యర్దులే తెరాస ప్రధాన బలం ఈ ఎన్నికలలో గత ఎన్నికలలో రెండవ స్థానంలో ఉన్న బీజేపీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి,గతంలో హనుమకొండ లోక్ సభ స్థానం నుంచి పీవీ నరసింహ రావును ఓడించిన సీనియర్ బీజేపీ నాయకుడు జగ్గారెడ్డి కుమారుడు ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్సీ, రాముల్ నాయక్, వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా జయసారధి రెడ్డి, తెలంగాణ జనసమితి అభ్యర్ధిగా ఆపార్టీ అధ్యక్షుడు కోదండరామ్ రెడ్డి, యువ తెలంగాణ పార్టీ అభ్యర్ధిగా ఆ పార్టీ వర్కంగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమలతో పాటుగా మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ వద్ద సుదీర్ఘకాలం పాటు పీఏగా పనిచేసిన శంకర్ గౌడ్, జగమెరిగిన తెరాస ఆగర్భ శత్రువు తీన్మార్ మల్లన్న స్వంతంత్ర అభ్యర్ధులుగాపోటీ చేస్తున్నారు. ఇందులో ఒక కాంగ్రెస్ మినహా మిగిలిన వారంతా గత ఐదారు నెలలుగా, క్షేత్ర స్థాయిలో తిరిగి, ఇటు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని, అటు ప్రచారాన్ని సమాంతరంగా సాగిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ఆలస్యంగా ప్రకటించడంతో ప్రచారంలో కాసింత వెనక బడింది. అయితే, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇతర నాయకులు దూకుడు పెంచి ప్రచారం సాగిస్తున్నారు. ఇక అధికార పార్టీ సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. అలాగే, బీజేపీ కూడా, ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఒక ఇంచార్జిని నియమించి ప్రచారం సాగిస్తోంది. అలాగే, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ ఇప్పటికే రండు మూడు పర్యాయాలు మూడు జిల్లాలలో పర్యటించారు. అలాగే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నాయకులు రంగంలోకి దిగుతున్నారు.అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం అధికార పార్టీకి ప్రధాన అడ్వాన్టేజ్’ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే 2015 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. నల్గొండ-వరంగల్- ఖమ్మం జిల్లాల్లో గతంలో 2 లక్షల 81 వేల138 మంది ఓటర్లు ఉండగా ఈసారి ఆ సంఖ్య 4 లక్షల 92 వేల 943కు పెరిగింది. ఇది కొంత వరకు ప్రతిపక్షాల చెవులకు ఇంపుగా వినిపించే మాటే అయినా కొత్త ఓటర్లు ఎటు మొగ్గుచుపుతారు అనే ప్రశ్న ..
మంది ఎక్కువైతే మజ్జిగపలచ బడుతుంది...ఎన్నికలబరిలో పోటీ చేసే ప్రత్యర్ధుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అధికార పార్టీ విజయావకాశాలు అంతగా మెరుగు పడతాయి. ఇప్పడు నల్లగొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల నియోజక వర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి అధికార తెరాస అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర రెడ్డి పోటీ చేస్తున్నారు.సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు అధికార పార్టీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. మంత్రి జగదీశ్వర రెడ్డి గెలుపు బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలనే వ్యూహంతో చిన్నా పెద్ద తేడాలేకుండా, స్వతంత్ర అభ్యర్ధులు సహా ప్రత్యర్ధులు వేసే ప్రతి అడుగును గమనించి వ్యూహ ప్రతివ్యూహాలు అల్లుతూ ముందుకు సాగుతున్నారు.అయితే,ఇతర విషయాలు ఎలా ఉన్నప్పటికే, అరడజను మంది వరకు ప్రత్యర్ధులు బరిలో దిగడం అధికార పార్టీకి అడ్వాంటేజ్ పాయింట్’గా అందరూ భావిస్తున్నారు. అలాగే, టూ మెనీ కూక్స్ స్పాయిల్’ ది డిష్’ అన్నట్లుగా పెద్ద సంఖ్యలో బరిలో దిగిన అభ్యర్ధులు,తమ ఓటమిని తామే కొనితెచ్చుకుంటారనే మాట వినవస్తోంది.
అలాగే ఉంది.
http://www.teluguone.com/news/content/trs-fear-on-mlc-election-25-110587.html





