తెరాసకు రెబల్స్ బెడద..తాండూరు పరిస్థితులే చాలా చోట్ల!
Publish Date:Apr 29, 2022
Advertisement
వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి మూడో సారి కూడా ఆ ఫీట్ సాధించాలని భావిస్తోంది. అయితే ఎన్నికలు దగ్గరపడే కొద్దీ పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమౌతున్నాయి. టికెట్ ఆశావహుల మధ్య విభేదాలు రచ్చకెక్కి పార్టీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఇవి సహజంగానే పార్టీ అధినేతకు కొత్త తలనొప్పులను తీసుకువస్తున్నాయ. అయితే ఈ పరిస్థితికి కారణం మాత్రం అధినేత నిర్వాకమే అని చెప్పాల్సి ఉంది. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్నా తెరాస పార్టీ నిర్మాణం మాత్రం పటిష్టంగా లేదు. క్షేత్ర స్థయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం పోయి...కేసీఆర్ ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చిన వారికి పార్టీ తలుపులు బార్లా తెరిచారు. ఇదే ఇప్పుడు పార్టీలో లుకలుకలకు, అంతర్గత విభేదాలకు కారణమైంది. మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికీ మధ్య అగాధం పెరుగుతూ వచ్చింది. ఎన్నికల ముంగిట టికెట్ల విషయంలో ఇరువురి మధ్యా పోటీ వాతావరణం కారణంగా విభేదాలు భగ్గు మంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఇటువంటి సమస్యలు ఉన్నాయి. 2014 ఎన్నికల అనంతరం నాలుగేళ్లకు అంటే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే సమయంలో కేసీఆర్ ఇరత పార్టీల నుంచి నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ తలుపులు బార్లా తెరిచారు. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అలా ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరిన వారిలో ఆయా నియోజకవర్గాలలో బలం, పట్టు ఉన్న నాయకులు కూడా ఉన్నారు. అలాగే మొదటి నుంచీ తెరాసలో ఉన్న నేతలూ ఉన్నారు. ఇప్పుడు అటువంటి వారికి టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో నియోజకవర్గాలలో పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా తాండూరు పరిస్థితికి కారణం ఇదే. కొంచం హెచ్చు తగ్గుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందంటే అతిశయోక్తి కాదు. తాండూరు పరిస్థితే తీసుకుంటే..2018 ఎన్నికలలో తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత రోహిత్ రెడ్డి తెరాసలో చేరారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాండూరు నుంచి తెరాస అభ్యర్థిగా తానే రంగంలో ఉంటానని ప్రకటించారు పట్నం మహేందర్ రెడ్డి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా అలా ఎలా ప్రకటిస్తారన్నది రోహిత్ రెడ్డి అభ్యంతరం. వాస్తవానికి తాండూరు మహేందర్ రెడ్డికి కంచుకోట. 2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తరువాత రోహిత్ రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. ఇప్పుడు తెరాస టిక్కెట్ తనకేనని.. ఆ హామీ మేరకే పార్టీలో చేరానని రోహిత్ రెడ్డి అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అటువంటి అన్ని నియోజక వర్గాలలోనూ తెరాస రెబల్స్ బెడదను ఎదురొన వలసి ఉంటుందన్న ఆందోళన పార్టీ వర్గాలలో వ్యక్తమౌతున్నది. కొల్లాపూర్,పాలేరు ఇలా తీసుకుంటే కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలున్న ప్రతి నియోజకవర్గంలోనూ తెరాసలో అంతర్గత కుమ్ములాటలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అటువంటి నియోజకవర్గాలలో పార్టీ అధిష్టానం సముదాయింపులు, బుజ్జగింపులు పని చేసే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే గతంలోలా కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు బలోపేతమయ్యాయనీ, అందు వల్ల అసంతృప్తులు పక్క చూపులు చూసే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ అంటున్నారు. ఏది ఏమైనా ఈ సారి ఎన్నికలలో తెరాసకు రెబల్స్, అసంతృప్తుల ఎఫెక్ట్ బాగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
http://www.teluguone.com/news/content/trs-facing-rebels-threat-25-135178.html





