ఈటల ఇలాఖాలో జోరుగా బేరాలు.. ప్రజా ప్రతినిధులకు కాసుల పంట?
Publish Date:Jun 7, 2021
Advertisement
ఈటల రాజేందర్ నియోజకవర్గం హుజూరాబాద్ లో రాజకీయం రంజుగా మారింది. ఇప్పుడా నియోజకవర్గంలో జోరుగా బేరాలు జరుగుతున్నాయి. నాయకుడి స్థాయి, పదవిని బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారట. పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మొదలు, రాష్ర్ట స్థాయి నాయకుడి వరకు ఒక్కొక్కరికి ఒక్కో ధర. ఈటల వెంట ఎవరూ వెళ్లకుండా కేడర్ ను కాపాడుకోవడానికి.. కారు పార్టీ నేతలు కాసుల సంచులతో దిగారని ఈటల వర్గీయులు ఆరోపిస్తున్నారు. అటు తన బలాన్ని నిలుపుకోవడానికి ఈటల కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉండటంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో నాయకుల పంట పండుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈటలను మంత్రివర్గం నుంచే తొలగించినప్పటి నుంచే హుజూరాబాద్ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. రోజుకో ట్విస్ట్ బయటికి వస్తోంది. మొదట నేతలంతా ఈటలకు మద్దతుగా నిలిచినా.. రోజులు గడిచే కొద్ది సీన్ మారిపోయింది. టీఆర్ఎస్ ముఖ్య నేతల ఎంట్రీతో కొందరు వెనక్కి తగ్గారు. ఒక రోజు గ్రామ శాఖ అధ్యక్షుడికి రూ.లక్ష ధర పలుకుతోందని సమాచారం. సర్పంచ్ కి ఐదు, మండలాధ్యక్షుడికి పది, ఇంకా స్థాయి పెరుగుతుంటే రేటు పెంచుతూ డీల్ కుదుర్చుకుంటున్నారని సమాచారం. అధికార పార్టీకి చెందిన ప్రముఖులు రంగంలోకి దిగి తమ అనుయాయుల ద్వారా పని పూర్తి చేసుకుంటున్నట్టు వినికిడి. వారికి స్పష్టమైన హామీలు ఇస్తూ, భవిష్యత్ లో మంచి స్థాయి కల్పిస్తామని తెలియజేస్తూ రాజేందర్ వెంట వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. మండలాల్లో ఉన్న బలమైన నాయకులను ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి పిలిపించుకుంటూ పరిస్థితులపై సమీక్షలు జరుపుతున్నారు. ఈటల రాజేందర్ తో అన్యాయానికి గురైన వారిని ఒక్కటి చేసే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నట్టు వినికిడి. ప్రతి గ్రామం నుంచి ఆ కోవకు చెందిన వారి జాబితాను తెప్పించుకుని మండల స్థాయిలో సంఘాలుగా ఏర్పాటు చేయడం, వారితో ఈటల భవితవ్యాన్ని కథలుగా ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో ఈటల కూడా తనకు వ్యతిరేక వర్గానికి తన మనుషులు చిక్కకుండా యాక్షన్ మొదలుపెట్టారట. తను ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో కూడా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే జాగ్రత్త పడ్డారని సమాచారం. గ్రామస్థాయి లీడర్లను లైన్లోకి తీసుకుని స్వయంగా మాట్లాడుతున్నారట. తానున్నానని, ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు భయపడకుండా ఉండాలని ధైర్యం చెబుతున్నారు. కట్టె కాలే వరకు తన అనుకున్న వారిని కాపాడుకుంటూ, వారికి బంగారు భవిష్యత్ ను అందిస్తాననే హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.కొందరికి ఆర్థిక సాయం కూడా రాజేందర్ చేశారని చెబుతున్నారు. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు తమవైపు మొగ్గుచూపకుండా చూసేందుకు టీఆర్‌ఎస్ పార్టీ 50 కోట్ల రూపాయల ఆశ చూపించిందని మాజీ మంత్రి ఈటల ఆరోపిస్తుండగా.. అలాంటి ప్రయత్నాలకు ముందుగా దిగింది ఈటలేనని టీఆర్‌ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నా, కొందరు ప్రజా ప్రతినిధులకు మాత్రం ఈ బేరసారాలు సందట్లో సడేమియాగా పనికొస్తున్నట్టు తెలుస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే తీరుగా వారు తమ ‘రేటు’ను అంతకంతకు పెంచుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వేలం పాటలో బేరం కుదుర్చుకుని ‘సెటిల్’ అవ్వాలని చూస్తున్నారట. మరోవైపు ప్రజలు అడగక ముందే అధికార టీఆర్‌ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి నియోజకవర్గ పరిధిలోని హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం 50 కోట్ల చొప్పున రెండు మున్సిపాలిటీల్లో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చినట్లు సమాచారం. చిన్న, మధ్యతరహా పంచాయతీల్లో 20 లక్షలతో, మేజర్ పంచాయతీల్లో 30 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల వ్యక్తిగత సమస్యలను కూడా తెలుసుకొని వారికి చేదోడువాదోడుగా ఉంటామని సంతృప్తిపరిచే ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు.
ఈటల వెంట.. మరుసటి రోజు గులాబీ క్యాంపులో ఉంటూ కొందరు నేతలు హల్చల్ చేశారు. దీంతో ఎవరూ ఎవరికి మద్దతుగా ఉన్నారో తెలియని పరిస్థితి కనిపించింది. అయితే కేసీఆర్ డైరెక్షన్ లో రంగంలోకి దిగిన గులాబీ నేతలు.. పార్టీలో పలుకుబడి గల నాయకులను టీఆర్ఎస్ తోనే కలిసి నడిచేలా మంత్రులు, రాష్ర్ట నాయకులు పావులు కదుపుతున్నారు. నాయకులకు పోస్టు ను బట్టి రేటు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/trs-etela-rajender-plans-to-suppoet-leaders-in-huzurabad-39-117071.html





