సికిందరాబాద్ విధ్వంసం స్క్రీన్ ప్లే డైరెక్షన్ పీకే.. యాక్షన్ టీఆర్ఎస్!
Publish Date:Jun 18, 2022
Advertisement
రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న పలుకుబడిని, తగ్గుతున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ లో ఆందోళన మొదలైందా? తిరిగి పరపతి పెంచుకోవడానికి, బలోపేతం అవుతున్న బీజేపీ ప్రజాదరణను తగ్గించేందుకు ఎం చేయడానికైనా సిద్ధ పడ్డారా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే సూచనలను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు పార్టీ శ్రేణులను ప్రోత్సహిస్తున్నారా? అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానం వస్తున్నది. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన విధ్వంస కాండ వెనుక ఉన్నది అధికార పార్టీ టీఆర్ఎస్ అని వారు చెబుతున్నారు. ఇందుకు కారణాలను సైతం వివరిస్తున్నారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సికిందరాబాద్ లో ఆర్మీ రిక్రూటీ ఆశావహులు శుక్రవారం చేపట్టిన ఆందోళనను టీఆర్ఎస్ అంది వచ్చిన అవకాశంగా తీసుకుని విధ్వంసకాండకు తెగబడిందని అంటున్నారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ లో ‘అగ్నిపథ్’ పథకాన్ని అమలు చేయాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం సికిందరాబాద్ లో జరిగిన విధ్వంస కాండ వెనుక అధికార పార్టీ టీఆర్ఎస్ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళన కారులు పరిమిత సంఖ్యలోనే సికిందరాబాద్ స్టేషన్ కు వచ్చారనీ, నినాదాలు చేసి రైళ్లను కొద్ది సేపు నిలువరించడమే లక్ష్యంగా వారు అక్కడికి వచ్చినా, టీఆర్ఎస్ శ్రేణుల వల్లే ఆ ఆందోళన హింసాత్మక రూపం దాల్చిందనీ ఆరోపణలు వినవస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో ఇవే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ‘అగ్నిపథ్’ ఆందోళనలను టీఆర్ఎస్ రాష్ట్రంలో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందకు వినియోగించుకునే ఎత్తుగడతోనే ఈ అల్లర్లకు పాల్పడింది. ఇందుకు టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే సలహాయే కారణమని తెలుస్తోంది.
ఆర్మీ నియామకాల్లో అగ్నిపథ్ పథకం అమలుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా, రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అవరోధం ఏర్పడేలా హింసాత్మక రూపు దాల్చాలన్నది పీకే సలహాను అనుసరించి టీఆర్ఎస్ అమలు చేసిన వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. తొలుత ఆర్మీ రిక్రూటీ ఆశావహులు ఓ 300 మంది వరకూ సికిందరాబాద్ స్టేషన్ కు చేరుకున్నారనీ, వారి వద్ద ప్లకార్డులు వినా మరెటువంటి సామగ్రి లేదనీ చెబుతున్నారు. అయితే క్షణాల్లోనే ఆందోళన కారుల సంఖ్య వేలలోకి పెరిగిపోవడం.. ఆ వచ్చిన వారి చేతుల్లో పెట్రోల్ టిన్నులు, కర్రలు, రాడ్లు వంటి ఆయుధాలు ఉండటాన్ని ఈ సందర్భంగా వారు ఎత్తి చూపుతున్నారు. ఇక్కడే పరిశీలకలు ఇంత జరుగుతుంటే పెట్రోల్, కర్రలు, రాడ్లు వంటి ఆయుధాలతో జనం పెద్ద సంఖ్యలో సకిందరాబాద్ స్టేషన్ కు వస్తుంటే పోలీసులు, నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇంత జరిగినా, రైల్వే ఆస్తుల విధ్వంసం జరిగినా హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా.. సీఎం కేసీఆర్ కానీ, మంత్రులు కానీ వీటిని సీరియస్ గా తీసుకోవడం లేదు. కేవలం బీజేపీపైనా, మోడీ ప్రభుత్వంపైనా విమర్శలకే పరిమితమయ్యారు. పైగా ఈ విధ్వంస కాండను సమర్ధించే విధంగా దేశంలో యువత ఆగ్రహానికి ఈ విధ్వంస కాండ ప్రతీక అంటూ అభివర్ణిస్తున్నారు. వీటన్నిటినీ గమనిస్తే పరిశీలకులు చెబుతున్నట్లుగా ఈ అల్లర్ల వెనుక, హింసాకాండ వెనుక టీఆర్ఎస్ ఉన్నదా అన్న అనుమానాలు సామాన్యులలో కూడా కలుగుతున్నాయి. అందుకే ఈ సంఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందనీ, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ బాధ్యతను విస్మరించి రాజకీయ విమర్శలతో పబ్బం గడుపుకుంటోదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా సికిందరాబాద్ హింసాకాండ వెనుక అధికార పార్టీ హస్తం ఉందన్న నివేదిక కేంద్రానికి అందిందనీ, ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుందనీ చెబుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయంపై స్వయంగా ఆరా తీస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/trs-behind-secunderabad-violance-with-the-advice-of-pk-25-137928.html





