పుంజుకున్న టీడీపీ.. కొండపల్లిలో కుట్రలు.. శివాజీ సంచలనం.. టాప్ న్యూస్@7PM
Publish Date:Nov 18, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది.పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగిరింది. వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్వగ్రామాల్లో సైతం టీడీపీ జెండా ఎగిరింది. వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సొంత మండలం శ్యావాలపురం జడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది. ఎమ్మెల్యే జోగి రమేష్ కు షాకిస్తూ పెడన జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. -------కొండపల్లి మున్సిపాలిటీలో హైడ్రామా చోటుచేసుకుంది. ఈ నెల 22న చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తనకు ఓటు హక్కు కల్పించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని కోరారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాల్సిన మున్సిపల్ కమిషనర్.. ఇప్పటివరకు సమాధానం ఇవ్వకపోవడంతో కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని కేశినేని నిర్ణయం తీసుకున్నారు-------
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయం సాధించిన అభ్యర్థులకు బాధ్యత మరింత పెరిగిందని వివరించారు. క్షేత్రస్థాయి సమస్యలను స్థానిక సంస్థల సమావేశాల్లో బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు.
--------
ఏపీ అనేది రాష్ట్రం కాదు.. కులాల కుంపటి అని నటుడు శివాజీ అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న మహాపాద యాత్రకు ప్రకాశం జిల్లాలో ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఎవరూ గుర్తించడంలేదన్నారు. మనమంతా బాగా పొల్యూట్ అయ్యామన్నారు. దీన్నుంచి బయటపడితేగాని భవిష్యత్ తరం బాగుపడదని ఆయన అభిప్రాయపడ్డారు.
--------
భారీ వర్షంతో చిత్తూరు నగరం చుట్టూ వర్షపు నీరు చేరింది. వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీవా నది పొంగిపొర్లుతోంది. దొడ్డిపల్లి వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి నీటి ప్రవాహంలో స్కూల్ బస్సు చిక్కుకుంది. స్థానికులు గమనించి బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులను సురక్షితంగా కాపాడారు. చిత్తూరు ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. గంగినేని చెరువు కట్ట ప్రమాదపు అంచుల్లో ఉంది. మిట్టూరు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు
------
మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి రాజీనామాపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజీనామాను ఆమోదించడాన్ని సవాలుచేస్తూ సుబేందర్ సింగ్, శంకర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు తెలిపారు. ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని పిటిషనర్లు పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు హైకోర్టును అభ్యర్థించారు.
------
కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లు జేఏసీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పండించిన పంటకు గిట్టబాటు ధర కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్, ఇందిరాపార్క్ దగ్గర ఏసీలతో ధర్నాలు, దీక్షలు చేస్తారా..? అని ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాటం చేయాలంటే.. రైతుల కళ్లాల దగ్గరకు వెళ్ళాలన్నారు. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలన్నారు
--------
సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధర్నాచౌక్ నుంచే సీఎం కేసీఆర్ పతనం ఆరంభమైందన్నారు. తన ముఖం అసెంబ్లీలో చూడకూడదనుకుంటే సీఎం రాజీనామా చేయాలన్నారు. టీఆర్ఎస్‌లో ఏ ఒక్క నేత సంతృప్తిగా లేడని, సమయం కోసం వేచి చూస్తున్నారన్నారు. కేసీఅర్ తీరును ప్రజాస్వామ్యం అసహ్యించుకుంటోందన్నారు. వరి వేస్తే ఉరే అని మాట్లాడటం దుర్మార్గం, మూర్ఖత్వమన్నారు.
--------
ప్రముఖ నటి స్నేహ చెన్నైకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలపై కణత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు వ్యాపారవేత్తలు ఓ ఎక్స్ పోర్ట్ కంపెనీ నడిపిస్తున్నారు. వారు తమ సంస్థలో పెట్టుబడి పెడితే లాభాల్లో వాటా ఇస్తామని చెప్పడంతో స్నేహ రూ.26 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. అయితే, ఎంతకీ వాటా ఇవ్వకపోగా, తాను పెట్టుబడిగా పెట్టిన రూ.26 లక్షలు కూడా తిరిగి చెల్లించలేదని స్నేహ ఆరోపిస్తున్నారు.
------
ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ దేవాలయాల పూజారులు బీజేపీకి ఎదురు తిరిగారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. 2,500 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సంప్రదాయాన్ని ధిక్కరించి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్తగా దేవస్థానం బోర్డును ఏర్పాటు చేసిందని, దీనికి వ్యతిరేకంగా తాము ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.
----
http://www.teluguone.com/news/content/top-news-39-126660.html





