ఎన్నికల వేళ లడ్డూవివాదం.. బీజేపీకి కలిసొచ్చేనా?
Publish Date:Sep 25, 2024
Advertisement
సరిగ్గా మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరమల వేంకటేశ్వరస్వామి లడ్డూ వివాదం తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ నిర్వాకం కారణంగానే లడ్డూ తయారీలో నాణ్యతా ప్రమాణాలు లేకుండా పోయాయన్నది దాదాపుగా నిర్దారణ అయిపోయింది. అయితే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హిందూ మనోభావాలు దెబ్బ తిన్నాయి. లడ్డూ నాణ్యత నాసికరంగా ఉండటానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వ త్రా వినిపిస్తోంది. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా జనం జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. కమిషన్ల కక్కూర్తితో కలియుగ దైవం వెంకన్న దేవుడికి అపచారం చేశారంటూ మండిపడుతున్నారు. సరే దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇక కేంద్రం కూడా తిరుమల ప్రసాదం తయారీకి నాసిరకం నెయ్యి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుక్కొంటున్న ఎఆర్ డెయిరీస్ కు నోటీసులు పంపింది. ఆ సంస్థ లైసెన్స్ ను రద్దు చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పడిపోవడానికి కారకు లెవరన్నది దర్యాప్తులో తేలుతుంది. మొత్తంగా గత వైసీపీ సర్కార్ హయంలోనే లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్నది ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా తేటతెల్లమైంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ తిరుమల దేవుడి లడ్డూ ప్రసాదం వివాదం బీజేపీకి ఆయాచిత లబ్ధి చేకూర్చే అవకాశాలను కొట్టిపారేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ అయితే 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు టీటీడీ అధికారులు తిరుమల పోటులో సంప్రోక్షణ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా లడ్డూ వివాదంపై సీరియస్ గా స్పందించింది. విచారణకు ఆదేశించింది. మొత్తంగా తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. దీంతో ఈ విషయంలో హిందువులంతా ఏకమై బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. హిందువులలో వచ్చిన ఈ ఐక్యత మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి అనుకూల అంశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లడ్డూ కావాలా నాయనా అన్నట్లుగా ఎన్నికల వేళ బీజేపీకి ఈ వివాదం కలిసి వచ్చిందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/tirumala-laddu-dispute-25-185528.html





