ఉద్యోగుల జీతాలెప్పుడు జగనన్నా?
Publish Date:May 3, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలు ఎప్పుడు అందుతాయనే అంశంపై అయోమయం నెలకొంది. ప్రతి నెలా ఠంచన్ గా ఒకటో తారీఖునే ఉద్యోగుల జీతాలు వారి వారి ఖాతాల్లో వేయాల్సి ఉంది. అయితే.. మే నెల మూడో తేదీ వచ్చినా వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలు పడని పరిస్థితి నెలకొంది. జగన్ రెడ్డి సర్కార్ తీరు కారణంగా ఉద్యోగులకు జీతాలు ఏ తేదీ లోగా అందుతాయో అనే స్పష్టత లేకపోయింది. రాష్ట్రానికి ఏదైనా పెద్ద మొత్తంలో అప్పు దొరికితే.. ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి మహా ప్రభో..! అని ఏపీ ఓటర్లను వేడుకున్న జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు తీరా చేతికి పవర్ వచ్చాక రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆర్థికంగా దివాళా తీయించారనే ఆరోపణలు ప్రతిపక్షం నుంచి ఎప్పటి నుంచో వస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరా ఉండదు.. పరిశ్రమలకు పవర్ హాలిడేస్.. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ కూ కోతల మీద కోతలు.. బొగ్గు నిల్వలు లేక విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం.. గ్రిడ్ నుంచి కూడా అందని విద్యుత్ సరఫరా.. కొత్త ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్తితి లేదు.. ఏపీలో రోడ్ల దుస్థితి వర్ణనాతీతం. ఏపీలో మౌలిక వసతులు లేని కారణంగా కొత్తగా పెట్టుబడులు వచ్చే దారి లేదు. వచ్చిన కొద్దిపాటి పారిశ్రామిక వేత్తలు వైసీపీ నేతల ధాటికి తట్టుకోలేక ఇతర రాష్ట్రాలకు పారిపోతున్న దుస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఏపీలో ఉత్పత్తి ఎక్కడ అవుతుంది..? ఆదాయం ఎలా వస్తుంది..? ఈ నేపథ్యంలో అప్పులు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వండి దేవుడో..! అంటూ కేంద్రం వద్ద ఏపీ రాష్ట్ర అధికారులు పడిగాపులు కాస్తున్నారట. అయితే.. ఏపీ అప్పులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడానికి కేంద్రం ససేమిరా అంటోందట. ఇప్పట్లో కేంద్రం నుంచి రుణ అనుమతులు లభించే అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలే చెబుతుండడం గమనార్హం. అప్పులు దొరికితేనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వావల్సిన దుస్థితి నెలకొందంటున్నారు. ‘సొమ్ములు పోనాయ్.. ఏటిసెత్తాం’ అన్న చందంగా వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా ఏపీలో నిధుల కొరత తన్నుకొచ్చిందంటున్నారు. ‘అయినవారికి ఆకులో.. కానివారికి కంచంలో పెట్టినట్లు’ ఏ అవసరానికి ఎంత ఖర్చు చేయాలి? ఏ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించాలి? ఏ స్కీమ్ కు ఎంత ఖర్చు పెట్టాలి? సంక్షేమానికి ఏ మేరకు నిధులు వెచ్చించాలి? అభివృద్ధికి ఎంత పెట్టుబడి పెట్టాలనే వాటిపైన సరైన అవగాహన లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో నిధుల్ని వృథా చేయడం వల్ల, ప్రభుత్వ పెద్దల అవినీతి వల్ల రాష్ట్ర ఖజానా ఖళీ అయిపోయిందంటున్నారు. ఏతావాతా విశ్వసనీయంగా బయటకు వస్తున్న విషయం ఏంటంటే.. ఖనాజాకు వచ్చిన నిధులను వచ్చినట్లే ఉద్యోగుల జీతాల కోసం ఇవ్వాలని జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయించిందని సమాచారం. దీంతో ఏప్రిల్ నెల జీతాలు విడతల వారీగా మాత్రమే అందుతాయని.. అది కూడా ఎప్పుడు ఎవరికి జీతాలు వస్తాయో అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
http://www.teluguone.com/news/content/there-is-an-uncertainty-on-ap-government-employees-salaries-25-135378.html





