ఆజాద్ ను పొగిడింది అందుకేనా ?
Publish Date:Jul 28, 2022
Advertisement
ప్రధాని నరేంద్ర మోడీని ఎవరైనా, ఎందుకైనా ద్వేషించ వచ్చును, దూషించావచ్చును. కానీ, ఆయన రాజకీయ చతురతను చులకన చేయడం మాత్రం కుదిరే వ్యవహారం కాదు. భవిష్యత్ సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే, అది అంత శ్రేయస్కరం కూడా కాదు. గత ఎనిమిది సంవత్సరాలలో మోడీ రాజకీయ చతురత అనేక మార్లు రుజువైందని వేరే చెప్పనక్కరలేదు. అసలు ఎలాంటి రాజకీయ నేపధ్యం లేకుండా, 20 ఏళ్లకు పైగా రాజకీయ చదరంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం సాధారణ విషయం కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఎక్కడ మౌనంగా ప్రత్యర్ధులకు చెక్ పెట్టాలో, ఒకటనేమిటి రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు అన్నీ ఆయన అవపోసన పట్టారు. కాబట్టే, ఆయన జాతీయ రాజకీయాల్లో ఆ స్థాయికి చేరుకున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఒక సంవత్సరం క్రితం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీలో చాలా కాలం ట్రబుల్ షూటర్ గా చక్రం తిప్పిన గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం ముగిసిన సమయంలో, పెద్దల సభ ఆయనకు వీడ్కోలు పలికింది. ఆ సందర్భంగా మోడీ చేసిన భావోద్వేగ ప్రసంగం విన్న ఎవరైనా, మోడీ, ఆయనకు ఏదో కీలక పదవి ఇస్తారని అనుకున్నారు. గులాం నబీ ఆజాద్ ను మోడీ ఎంతగానో మెచ్చుకున్నారు. ప్రశంసలతో ముంచెత్తారు. ఆయనంటే తనకు ఎంతో గౌరవమని, విపక్షంలో ఉన్నప్పటికీ హుందాగా మాట్లాడతారని, ఎప్పుడూ అసభ్య పదజాలం ఉపయోగించరని కొనియాడారు. ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని కూడా చెప్పు కొచ్చారు. చివరకు, భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఆజాద్ పట్ల అంట గౌరవం ఉన్నమోడీ ఆయన సేవలను తప్పక వినియోగించుకుంటారనే అంతా అనుకున్నారు. అప్పటికే గులాం నబీ ఆజాద్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు (జీ23) కాంగ్రెస్ అధిష్టానంపై తిరుబాటు జెండా ఎగరేశారు. సో ..ఆజాద్ బీజేపీకి దగ్గరవుతారనే ఉహగానాలు కూడా వినిపించాయి. ఇక అక్కడి నుంచి, గులాం నబీ ఆజాద్ పేరు రాష్ట్ర పతి, ఉప రాష్ట్రపతి అశావహుల మీడియా ఉహల జాబితాలో చేరిపోయింది. నిజంగా ఆజాద్ ఆ పదవులను ఆశించారో లేదో తెలియదు. అలాగే, మోడీ అయినా అలాంటి ఆలోచన చేశారో తెలియదుకానీ మీడియాలో అయితే పుంఖాను, పుంఖాలుగా కథనాలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత మోడీ ఎక్కడా ఆ ప్రస్తావన తీసుకు రాలేదు మోడీ నిజానికి మోడీ ఆశించింది అదే, అదే అయన చతురత. నాలుగు మంచి మాటలు,కాసిన్ని కన్నీళ్ళతో ఒక సమర్ధుడైన, నాయకుడిని ముఖ్యంగా, ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరమైన నాయకుడిని, కాంగ్రెస్ కు మరింత దూరం చేయగలిగారు. అదే మోడీ చతురత అని అంటున్నారు. అయితే, ఎంత మోడీ అయినా, ఆయనకు జంటగా ఉన్న అమిత్ షా అయినా, అన్ని సందర్భాలలో అందరినీ ‘మోళీ’చేయడం కుదరదని కూడా అంటున్నారు.
http://www.teluguone.com/news/content/the-reason-behind-modi-praise-gulam-nabi-azad-25-140753.html





