మహా సాగరంలో అరుదైన ఖనిజాల వేట ముమ్మరం!
Publish Date:Aug 10, 2025
Advertisement
మానవుడు తన మనుగడ కోసం, తన అవసరాల, తన స్వార్థం, విలాసవంతమైన సౌకర్యాల కోసం మహా సాగరాలను కూడా చెరబడుతున్నాడు. భూగోళంపై 71శాతం నీరే కాబట్టి భూమి మీద కన్నా సముద్రగర్భంలోనే రెండు రెట్లు అధికంగా ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి, సాంకేతికంగా ముందున్న దేశాలు సముద్ర గర్భం నుంచి అరుదైన లోహాలను తవ్వి తీయడానికి పోటీ పడుతున్నాయి. ఈ ఖనిజాల వేట మహా సాగర జలాలను కలుషితం చేసి.. సాగర జీవులకు ముప్పు తెస్తున్నాయి. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాయి. అసలే కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని మరింత ఎక్కువ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది ప్రజలకి జీవనాధారం సముద్ర తీర ప్రాంత వనరులపై ఆధారపడి ఉంటుంది. వాళ్లందరి జీవనభృతికి ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. సముద్రగర్భంలో 600 కోట్ల టన్నుల మ్యాంగనీసు, 27 కోట్ల టన్నుల నిఖీలు, 23 కోట్ల టన్నల రాగి, 5 కోట్ల టన్నుల కోబాల్ట్ నిక్షేపాలున్నాయనీ, వీటిని వెలికి తీస్తే, అరుదైన లోహాల కోసం చైనాపై ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుందని పాశ్చ్యాత్త దేశాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం హవాయి నుంచి మెక్సికో వరకూ పసిఫిక్ మహాసముద్రంలో విస్తరించిన క్లారియం, క్లిప్పర్టన్ క్యాప్చర్ జోన్ (సీసీజడ్ )లో అరుదైన ఖనిజాల కోసం వేట ముమ్మరమైంది. సముద్రాలను విచ్చలవిడిగా ఉపయోగిస్తే.. జీవజాతులకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది. దీనిని నివారించడానికి ఐక్యరాజ్య సమితి ఛత్రం కింద కుదిరిన సముద్ర చట్టం ఒప్పందం 1994 నవంబర్ 16 నుంచి అమలులోకి వచ్చింది. దీని కింద ప్రతి దేశానికి తమ తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్ మైళ్లు (22.22 కిలోమీటర్లు) దూరం వరకూ ఉన్న జలాలపై సార్వభౌమ హక్కు ఉంటుంది. వీటిని అంతర్గత జలాలు అంటారు. ఖండపు అంచుల నుంచి 220 నాటికల్ మైళ్లు (370.4 కిలోమీటర్లు) వరకూ విస్తరించిన ప్రాదేశిక జలాలను ప్రత్యేక ఆర్థిక మండళ్లుగా పిలుస్తారు. అంతర్గత, ప్రాదేశిక జలాల పరిధికి అవతల ఉన్నదంతా అంతర్జాతీయ జలాలే. అంటే.. ఏ దేశానికి ఆ దేశ సముద్ర గర్భంలోని అరుదైన ఖనిజాల అన్వేషణపై సమన్వయం పాటించాలన్నమాట. వాస్తవానికి సముద్ర గర్భ అన్వేషణకు ఐఎస్ఏ (అంతర్జాతీయ సముద్రగర్భ ప్రాధికారిక సంస్థ) నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఐఎస్ఏలో 170 సభ్య దేశాలు ఉన్నాయి.
సముద్రంలో 5,580 రకాల జీవజాతులుండగా, వాటిలో 430 జీవ జాతులను మాత్రమే ఇప్పటి వరకూ మనం గుర్తించగలిగాం. సముద్ర గర్భంలో ఖనిజ కణికల కోసం చేపట్టే అన్వేషణ భారీ నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి అరుదైన ఖనిజాల అన్వేషణ తక్షణం ఆపాలని ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్, చిలీ, కోస్టారికా దేశాలు కోరుతున్నాయి.
మానవ మనుగడ, అవసరాలు, నూతన ఆవిష్కరణలైన ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్ల పరిశ్రమల ఉత్పత్తుల కోసం లిథియం, కోబాల్ట్, టైటానియం, గాలియం, రాగి, నికేల్, మ్యాంగనీస్ వంటి అరుదైన లోహాలు అవసరం ఏంతైనా ఉంది. వీటి అన్వేషణ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి.
http://www.teluguone.com/news/content/the-hunt-for-rare-minerals-in-sea-intensifies-39-203928.html





